మొబైల్‌ కస్టమర్ల ఆఫ్‌‘లైన్‌’! | Sakshi
Sakshi News home page

మొబైల్‌ కస్టమర్ల ఆఫ్‌‘లైన్‌’!

Published Tue, Dec 26 2017 12:47 AM

Customers preferred to look directly - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:భారీ డిస్కౌంట్లు.. ఎక్స్‌క్లూజివ్‌ మోడళ్లు.. తెరపైకి రోజుకో కొత్త బ్రాండ్‌. ఇదీ ఆన్‌లైన్‌ విపణిలో మొబైల్‌ ఫోన్ల దూకుడు. కాకపోతే ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకటిరెండు మోడళ్లతో తళుక్కుమన్న బ్రాండ్లు అంతే వేగంగా తెరమరుగు అయిపోయాయి. ఆన్‌లైన్‌కే పరిమితమైన కంపెనీలు ఆఫ్‌లైన్‌ బాట పట్టాయి. అలాగే ఆన్‌లైన్‌ ఎక్స్‌క్లూజివ్‌ మోడళ్లూ రిటైల్‌ దుకాణాలకు వచ్చి చేరాయి. దీనికంతటికీ కారణమేమంటే ఫీచర్‌ ఫోన్‌ కస్టమర్లు స్మార్ట్‌ఫోన్లకు పెద్ద ఎత్తున మళ్లడమే. ఆధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు హల్‌చల్‌ చేస్తుండడంతో వీరు ఎక్స్‌పీరియెన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ టచ్‌ అండ్‌ ఫీల్‌ కావాలంటున్నారు. దీంతో ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ తిరిగి వేగం పుంజుకుంది. ఆన్‌లైన్‌ దూకుడుకు చెక్‌ పెడుతూ అన్ని ప్రధాన కంపెనీలూ ఒకే ధరను అమలు చేస్తుండటం కూడా ఆఫ్‌లైన్‌కు జీవం పోసినట్టయింది.

ఇదీ మొబైల్స్‌ మార్కెట్‌..
భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో 2017లో 12 కోట్ల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. ఇదే స్థాయిలో బేసిక్‌ ఫోన్లూ అమ్ముడవుతున్నాయి. వచ్చే ఏడాది 13.5 నుంచి 13.8 కోట్ల స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వస్తాయనేది మార్కెట్‌ వర్గాల అంచనా. మొత్తం పరిశ్రమలో ఆన్‌లైన్‌ వాటా 20 శాతముంది. ఒకానొక దశలో ఇది 28 శాతానికి కూడా చేరింది. 2018లో ఆన్‌లైన్‌ వాటా 30 శాతం దగ్గర స్థిరపడొచ్చని అంచనా వేస్తున్నట్లు షావొమీ ఇండియా ఆన్‌లైన్‌ సేల్స్‌ హెడ్‌ రఘు రెడ్డి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.

ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు..
దేశీయ స్మార్ట్‌ఫోన్‌ రంగంలో షావొమీ, లెనోవో, మోటరోలా, వన్‌ప్లస్, లా ఇకో, ఇన్‌ఫోకస్‌ వంటి బ్రాండ్లు తొలుత ఆన్‌లైన్‌లోకే ఎంట్రీ ఇచ్చాయి. మార్కెట్‌కు అనుగుణంగా ఇవి వ్యూహాన్ని మార్చుకుని... అన్నీ ఆఫ్‌లైన్‌లోకి అడుగు పెట్టాయి. వీటిలో కొన్ని కంపెనీలేమో ఆన్‌లైన్‌ కోసం ఎక్స్‌క్లూజివ్‌ మోడళ్లను తీసుకొచ్చాయి. ఇప్పుడు అన్ని మోడళ్లనూ ఆఫ్‌లైన్లో అమ్ముతున్నాయి. ఏడాదిగా ఆన్‌లైన్‌ మార్కెట్‌ స్థిరపడిందని మోటరోలా మొబిలిటీ ఇండియా ఎండీ సుధిన్‌ మాథుర్‌ చెప్పారు. సాధారణంగా డిస్కౌంట్లు ఉన్నంత కాలమే ఆన్‌లైన్‌ జోరు సాగిందన్నారు. తమ కంపెనీ ఆఫ్‌లైన్‌ అమ్మకాలు ప్రస్తుతమున్న 33 శాతం నుంచి ఏడాదిలో 50 శాతానికి చేరతాయని అంచనా వేశారు. విక్రయాల పరంగా దేశంలో మొబైల్స్‌ రిటైల్‌ చైన్ల హవా నడుస్తోందని, సొంత బ్రాండ్‌ ఇమేజ్, కస్టమర్‌ సపోర్ట్‌ ఇందుకు కారణమని చెప్పారాయన.

కాలం చెల్లిన డిస్కౌంట్లు..
కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ–కామర్స్‌ కంపెనీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఆన్‌లైన్లో తక్కువ ధరకు మోడళ్లు లభించడంతో ఒక్కసారిగా ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లో స్తబ్దత నెలకొంది. కానీ ఏడాదిగా ఈ–కామర్స్‌ కంపెనీలు రాబడిపై దృష్టి సారించడంతో భారీ డిస్కౌంట్లకు కాలం చెల్లింది. దీంతో కొనుగోలుదార్లు తిరిగి ఆఫ్‌లైన్‌కు మళ్లారు. ఒకటిరెండు మోడళ్లతో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేసిన కంపెనీలు నిలదొక్కుకోలేక పోయాయని బిగ్‌‘సి’ వ్యవస్థాపకుడు బాలు చౌదరి తెలిపారు. కొత్త మోడళ్లు, విభిన్న ఫీచర్ల రాకతో కస్టమర్లు ఫోన్లను ప్రత్యక్షంగా చూసి, ఎంపిక చేసుకుంటున్నారని తెలియజేశారు. 

ఎంవోపీతో అడ్డుకట్ట
మొబైల్‌ ఫోన్ల వ్యాపారంలో మార్కెట్‌ ఆపరేటింగ్‌ ప్రైస్‌ (ఎంవోపీ) అత్యంత కీలకంగా మారింది. ఒక రకంగాచూస్తే ఆఫ్‌లైన్‌ తిరిగి గాడిలో పడడానికిదే కారణం. ప్రతి మోడల్‌కూ నిర్దేశిత ఎంవోపీని తయారీ కంపెనీ నిర్ణయిస్తుంది. విక్రేతలు ఈ ధర కంటే తక్కువకు అమ్మజాలరు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన విక్రేతకు సరుకు సరఫరాను కంపెనీలు నిలిపివేస్తాయని టెక్నోవిజన్‌ ఎండీ సికందర్‌ తెలిపారు. దాదాపు అన్ని కంపెనీలూ దీన్ని అనుసరిస్తున్నాయని, ఎంవోపీతో ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లకు అడ్డుకట్ట పడిందని చెప్పారాయన.  

Advertisement
 
Advertisement
 
Advertisement