కాలంతోపాటే ప్రణాళిక

Changes in financial planning - Sakshi

మార్చుకోకపోతే లక్ష్యాలకు దూరం!

రిటైర్మెంట్‌ అవసరాల కోసం అధిక కేటాయింపులు

అత్యవసరాలకూ అదనపు నిధి

ఈక్విటీలకు అగ్ర ప్రాధాన్యం

డెట్‌ సాధనాల్లో కొంత మేర

మారుతున్న పరిస్థితులతో ఆర్థిక ప్రణాళికల్లోనూ మార్పులు

రుణం తీసుకొని ఇన్వెస్ట్‌ చేయొద్దు. ఆర్జిస్తున్న దాని కంటే తక్కువే ఖర్చు పెట్టు. ఇవి తరచుగా వినిపించే మనీ సూత్రాలు. వీటికి కట్టుబడి నడుచుకుంటే ఆర్థిక వ్యవహారాలు తప్పుదోవలో వెళ్లకుండా చూసుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక విషయంలో ఇలాంటివే ఎన్నో సాధారణ సూత్రాలు ఉన్నాయి. వీటిని కాలంతోపాటే వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నతీకరించుకుని ఆచరణలో పెడితేనే ఆశించినంత ప్రయోజనం నెరవేరుతుందని ఫైనాన్షియల్‌ ప్లానర్లు సూచిస్తున్నారు. ఆధునిక కాలంలో మార్చుకోదగిన సిద్ధాంతాల గురించి వారు ఇలా తెలియజేస్తున్నారు...

వేతనంలో రిటైర్మెంట్‌కు పొదుపు
నెలవారీ ఆర్జనలో 10 శాతాన్ని పెన్షన్‌ కోసం ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లాలన్నది గతంలోని సూత్రం. రిటైర్మెంట్‌ తర్వాత సౌకర్యవంతమైన జీవనం కోసం ఈ మాత్రం పొదుపు చేసుకోవాలి. కానీ, పెరుగుతున్న జీవన ప్రమాణాలతో ఆయుర్దాయమూ అధిగమవుతోంది. కనుక వేతనంలో కనీసం 20 శాతాన్ని రిటైర్మెంట్‌ కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆప్టిమా మనీ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు మత్‌పాల్‌ తెలిపారు. జీవన వ్యయం పెరిగిపోతున్నందున, వైద్య వ్యయాలు కూడా భారమవుతుండడంతో రిటైర్మెంట్‌కు అధిక పొదుపు అవసరమని గుర్తించిన చరణ్‌ (35), వేతనం వచ్చిన వెంటనే 20 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు తెలిపాడు.

ఈక్విటీల్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలి?
సాధారణంగా తమ పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా డెట్, తదితర సాధనాల మధ్య కేటాయింపులు చేసుకోవాలని, తద్వారా రిస్క్‌ను సమతుల్యం చేసుకోవాలని ఫైనాన్షియల్‌ ప్లానర్లు సూచిస్తుంటారు. మరి ఈక్విటీల్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలన్న ప్రశ్న తలెత్తిత్తే... 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలే అంత శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్నది ఓ ప్రాథమిక సూత్రం. ఉదాహరణకు చరణ్‌ వయసు 35 ఏళ్లు. 100లో 35 తీసివేస్తే 65 వస్తుంది. కనుక తన మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. అయితే, కాలంతోపాటే ఇందులోనూ మార్పులు అవసరమన్నది నిపుణుల భావన. ఆర్జన ఆగిపోయిన తర్వాత కూడా 25 ఏళ్ల వరకు జీవించాల్సి వస్తున్న పరిస్థితుల్లో... ఈక్విటీలకు అధిక కేటాయింపులు అవసరమని సూచిస్తున్నారు.

కనుక 100 కాకుండా 120 స్థాయిని నిర్ణయించుకోవాలన్నది వారి సూచన. ఈ నేపథ్యంలో 120 నుంచి తమ వయసును మినహాయించి మిగిలే అంత మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ముంబైకి చెందిన  చేతన్‌ (39) ప్రస్తుతానికి పలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ ద్వారా ప్రతీ నెలా రూ.50,000 ఇన్వెస్ట్‌ చేస్తున్నాడు. అంటే మొత్తం పెట్టుబడుల్ని తీసుకెళ్లి ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తున్నాడు. దీనికి బదులు నూతన సూత్రం ప్రకారం 120 నుంచి చేతన్‌ వయసు 39ని తీసివేసి చూస్తే 81 వస్తుంది. కనుక పెట్టుబడిచేయదగిన మొత్తంలో 81 శాతం మాత్రమే.. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను రూ.40,000కు పరిమితం చేసుకోవాలి. మరింత చిన్న వయసుల్లో వారు (25–35 వయసు) ఈక్విటీలకు 85–90 శాతాన్ని, డెట్‌కు 10 శాతాన్ని కేటాయించుకోవచ్చని మనీ మ్యాటర్స్‌ సీఈవో తేజల్‌ గాంధీ సూచించారు. 60 ఏళ్ల తర్వాత కూడా ఈక్విటీలకు 25–30 శాతం కేటాయింపులు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  

50–20–30 సూత్రం
50–20–30 సూత్రం తెలుసు కదా? పన్ను బాధ్యతలు పోను మిగిలే నెలవారీ ఆదాయంలో 50 శాతాన్ని కనీస అవసరాల కోసం వినియోగించుకోవాలి. 20 శాతాన్ని భవిష్యత్తు లక్ష్యాలు, అవసరాల కోసం కేటాయించుకోవాలి. మిగిలిన 30 శాతాన్ని తమ విచక్షణ అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చన్నది ఈ సూత్రం అంతరార్థం. అయితే, మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఇందులో భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం 20% చాలదని, కనీసం 30% అయినా కేటాయించుకోవాలని ఫైనాన్షియల్‌ ప్లానర్లు సూచిస్తున్నారు. వీలయితే 40% కేటాయించుకోవడం మంచిదన్నది సలహా. మంచి వేతనాల్లో ఉన్న వారికి ఇది సాధ్యమే.

జీవిత బీమా
జీవిత బీమా అవసరాన్ని నేడు చాలా మంది గుర్తిస్తున్నారు. అయితే, పాలసీ తీసుకుంటున్నారు కానీ అవసరమైన మొత్తానికి బీమా రక్షణ ఉండేలా జాగ్రత్త వహిస్తున్న వారు కొద్ది మందే. నిజానికి ఆర్జించే వ్యక్తికి ఎంత మేర జీవిత రక్షణ ఉండాలి? అన్న సందేహం ఎదురైతే... వార్షిక వేతనానికి కనీసం 10 రెట్లు అయినా తీసుకోవాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తుంటారు. అయితే, అందరికీ వర్తించే ఉమ్మడి సూత్రం కాదిది. విడిగా వ్యక్తుల అవసరాలు, రుణాలు, వారిపై ఆధారపడిన వారు ఎంత మంది ఉన్నారు తదితర ఎన్నో అంశాలు జీవిత బీమా రక్షణ మొత్తాన్ని నిర్ణయిస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

అప్పుడే ఆర్జన మొదలు పెట్టి, తక్కువ వేతనంలో ఉన్న యువకులకు జీవిత బీమా కొంచెం అధికంగానే ఉండాలంటున్నారు నిపుణులు. ‘‘చిన్న వయసులో బీమా పాలసీ తీసుకుంటుంటే... బీమా కవరేజీ వార్షిక వేతనానికి కనీసం 20 రెట్లు అయినా ఉండాలి. ఎందుకంటే చిన్న వయసులో ఉన్న వారికి వేతనంలో పెరుగుదల వేగంగా ఉంటుంది. దీనికి తగినట్టు జీవిత బీమా కవరేజీ పెంచుకుంటూ వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు’’ అని మత్‌పాల్‌ వివరించారు. అయితే 40 ఏళ్లకు పైగా వయసున్న వారు మాత్రం ఇంతకుముందు మాదిరే వార్షిక వేతనానికి పది రెట్ల మొత్తం బీమా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.
హెల్త్‌ కవరేజీ
వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్సలు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడేస్తున్నాయి. వైద్య రంగంలో పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ, అత్యాధునిక చికిత్సా విధానాలు అమల్లోకి వస్తుండడంతో వాటి వ్యయాలు కొంచెం ఖరీదుగానే ఉంటున్నాయి. కనుక నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.3–5 లక్షల వైద్య బీమా అవసరం అని భావిస్తుండగా, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతంగా ఉంటుందన్న నేపథ్యంలో పట్టణాల్లో నివసించే వారికి ఇది చాలదంటున్నారు నిపుణులు. దీన్ని కనీసం రూ.10 లక్షలకు పెంచుకోవాలని సూచిస్తున్నారు.

కిరణ్‌ కుమార్‌ తల్లికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. బీమా కవరేజీ రూ.3 లక్షలు ఏ మాత్రం సరిపోలేదు. దీంతో హెల్త్‌ కవరేజీ మరింత అవసరమని అర్థం చేసుకున్న అతడు రూ.25 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ ప్లాన్‌ కవరేజీని పెంచుకున్నాడు. ఇందులో తన తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజీ ఉండేలా చూసుకున్నాడు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీల ప్రాముఖ్యతనూ కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలం పాటు చికిత్స అవసరమైతే ఇవి ఆదుకుంటాయని, సంప్రదాయ పాలసీలు దీర్ఘకాలం పాటు చికిత్సా వ్యయాలను తీర్చలేవని గుర్తు చేస్తున్నారు.

అత్యవసర నిధి ఎంత మొత్తం?
ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు లేదా వైద్య పరమైన ఆకస్మిక చికిత్సలు అవసరం పడినప్పుడు లేదా ఇతర ఆర్థిక అత్యవసరాల్లో ఆదుకునేందుకు అత్యవసర నిధిని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలన్నది ఓ ఆర్థిక సూత్రం. కనీసం మూడు నుంచి ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్‌ ఫండ్స్‌లో లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో అత్యవసర నిధిగా ఉంచుకోవాలన్నది ఇప్పటి వరకు చెబుతున్న సూత్రం. కానీ, దీన్ని తొలి అడుగుగానే చూడాలంటున్నారు.

ముందు ఆరు నెలల మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాత దానిని కనీసం 9 నెలల అవసరాలకు సరిపడా మొత్తానికి పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఫార్మా కంపెనీలో పనిచేసే వైభవ్‌ కుమార్‌ (36) నెలవారీ వేతనం రూ.50,000. కానీ, ఇతడు రూ.4.5 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి ఉంచాడు. దీనికి అదనంగా అతడికి రూ.10 లక్షలకు హెల్త్‌ ప్లాన్‌ కూడా ఉంది. అయితే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రాబడి తక్కువ కనుక ఒక నెల అవసరాలకు సరిపడా ఎఫ్‌డీగా ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్నది సూచన.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top