నాపై ఎగవేతదారు ముద్ర

CBI, ED filed charge sheets with false allegations, says Vijay Mallya - Sakshi

ఆస్తులమ్మి బకాయిలు చెల్లించాలనుకుంటున్నా...

రాజకీయాలు చేస్తే ఏమీ చేయలేను

ప్రధాని, ఆర్థిక మంత్రికి లేఖలు రాసినా స్పందన లేదు

విజయ్‌ మాల్యా వ్యాఖ్యలు  

న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు ఉడాయించిన లిక్కర్‌ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు మళ్లీ పెదవి విప్పారు. ప్రభుత్వం, బ్యాంకులు, దర్యాప్తు ఏజెన్సీలన్నీ తనపై కక్ష కట్టాయని, కావాలనే ఎగవేతదారుగా ముద్ర వేశాయని పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు.

తనకున్న ఆస్తులను అమ్ముకునైనా బ్యాంకులకు బకాయిలు చెల్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే, ఈ విషయంలో ఇంకా రాజకీయాలు చేస్తే చేయగలిగిందేమీ లేదని మంగళవారం మీడియాకు విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలో వ్యాఖ్యానించారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ.9 వేల కోట్ల రుణ ఎగవేతలో మాల్యాపై సీబీఐ, ఈడీ కేసులు దాఖలు చేయడంతో చడీచప్పుడుకాకుండా లండన్‌కు పరారైన సంగతి తెలిసిందే.

బ్యాంకులు తనను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా పేర్కొనడాన్ని మాల్యా తీవ్రంగా ఖండించారు. రుణాల చెల్లింపులో విఫలం కావడం వెనుక తన వాదనను వివరించేందుకు ప్రధాని, ఆర్థిక మంత్రులకు 2016 ఏప్రిల్‌ 15న లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం, దర్యాప్తు ఏజెన్సీల వేధింపులతో విసిగిపోయానని కూడా ఆయన పేర్కొన్నారు.  ఈ లేఖలను కూడా మాల్యా బయటపెట్టడం విశేషం. 

‘సుప్రీం కోర్టుకు 2016 మార్చి 29, అదేవిధంగా 2016 ఏప్రిల్‌ 6న దాఖలు చేసిన అఫిడవిట్లలో బ్యాంకులకు రెండు సెటిల్‌మెంట్‌ ఆఫర్లను ఇచ్చాను. వీటిని బ్యాంకులు తిరస్కరించాయి’ అని మల్యా వ్యాఖ్యానించారు.  ‘నా వ్యక్తిగత, గ్రూప్‌ కంపెనీలు, అదేవిధంగా నా కుటుంబ నియంత్రణలోని కంపెనీలకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వాటి విలువ  రూ.13,000 కోట్లు.  బ్యాంకులు ఈ ఆస్తుల అమ్మకం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఈడీ అడ్డుకుంటోంది. కచ్చితంగా ఇది రాజకీయ జోక్యంతోనే జరుగుతోంది.  బ్యాంకులకు తాను బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం కోరుకుంటుందా లేదా’ అని మల్యా వివరించారు.

కాగా, విజయ్‌ మాల్యాకు నిజంగానే బకాయిలను చెల్లించే ఉద్దేశం ఉంటే, ఇన్నేళ్లలో ఎప్పుడో ఆ పని చేసి ఉండేవారని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top