పూచీ ఇస్తున్నారా?

Be Carufull On Surety signatures In Bonds And Loan Papers - Sakshi

కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సుమా..!

తేడా వస్తే ఆర్థిక సమస్యలు మెడకు చుట్టుకునే అవకాశం

చిత్తూరు, తిరుపతి: బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు బ్యాంకుల నుంచి తమ వ్యక్తిగత అవసరాలు, గృహ నిర్మాణాలు, పిల్లల చదువుల కోసం వివిధ రకాల రుణాలు తీసుకునే సందర్భాల్లో ఏ మాత్రం ఆలోచించకుండా అనేక మందికి ష్యూరిటీ సంతకాలు చేస్తుంటారు. రుణాలు తీసుకున్న వారు డబ్బు చెల్లించకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు. ఆర్థిక భారం మీద పడుతుంది. ష్యూరిటీ సంతకాలు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను బ్యాంకు అధికారులు వివరిస్తున్నారు.

నమ్మకంపై గుడ్డిగా..
సాధారణంగా బంధువులు లేదా స్నేహితులు అడిగారని కొందరు గుడ్డిగా వారి ఉద్యోగ, గృహ, వా హన రుణాలకు ష్యూరిటీ సంతకాలు చేస్తుంటా రు. మొహమాటానికి పోయి సంతకం చేస్తే రుణం తీసుకున్న వారు సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించకపోతే ఆ భారం మీపై పడుతుంది. హామీ గా ఉండేటప్పుడు అతడి గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మంచింది.

పూచీ అంటే అప్పు చెల్లిస్తామని హామీ
హామీ సంతకం పెడుతున్నామంటే అసలు రుణగ్రస్తుడు అప్పు చెల్లించని పక్షంలో ‘నేను చెల్లించేందు కు సదరు బ్యాంకుకు హామీ ఇస్తున్నా’ అని అర్థం. రుణం తీసుకున్న వ్యక్తి ఆ బకాయిలు చెల్లించకపోయినా సిబిల్‌లో మీ పరపతి రేటింగ్‌ పడిపోతుంది. మీకు రుణం అవసరమైనప్పుడు బ్యాంకు కు వెళ్తే బ్యాంకులు ‘సారీ.. మీ పరపతి రేటింగ్‌ బాగోలేదు. మీకు అప్పు ఇవ్వడం కుదరదు’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. దీంతో మీరు తీసుకోని అప్పుకు కూడా మీరే బాధ్యత వహించి బ్యాంకు క్రెడిట్‌ స్కోర్‌ తగ్గి నష్టపోయే ప్రమాదం ఉందని గమనించండి.

సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే..
బ్యాంకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించి మీ ష్యూరిటీ సంతకం కావాలని ఎవరైనా కోరితే అతడి పరపతి రేటింగ్‌(సిబిల్‌ స్కోర్‌) సరిగా లేదని అర్థం చేసుకోవాలి. సాధారణంగా రుణం తీసుకునే వ్యక్తి పరపతి రేటింగ్‌ సంతృప్తికరంగా లేకపోతే బ్యాంకులు వారి రుణ చెల్లింపు కోసం ష్యూరిటీ కోరతాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని నిర్మొహమాటంగా ఎవరికీ హామీ సంతకం చేయకుండా ఉండటం మంచింది.

ముందస్తు చర్యలతో మేలు
ఇంకొకరికి గృహ, వ్యక్తిగత రుణానికి మీరు ష్యూ రిటీ సంతకం చేయాల్సి వస్తే ఆ రుణానికి సంబం« దించిన నియమ నిబంధనల గురించి ముందుగా బ్యాంకు ప్రతినిధితో చర్చించండి. ఈ విషయంలో అసలు రుణగ్రహీతకు ఎంత హక్కుందో మీకూ అంతేహక్కు ఉంటుంది. అసలు రుణగ్రహీతకు పంపే సమాచారం అంతటినీ మీకు కూడా పంపాలని బ్యాంకును కోరవచ్చు. తద్వారా అసలు రుణగ్రహీత బకాయిలు సకాలంలో చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయం ఎప్పటికప్పుడు మీకూ తెలుస్తుంది.

నిబంధనలపై అవగాహన అవసరం
ష్యూరిటీ సంతకం పెట్టే ముందు రుణగ్రస్తుడు తీసుకున్న అప్పు చెల్లించలేని పక్షంలో ఆ రుణానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకోండి. ముఖ్యంగా రుణం మొత్తం వడ్డీ రే టు ప్రతినెలా బకాయిలు చెల్లించాల్సిన తేదీ, చె ల్లింపు ఆలస్యమైతే గ్రేస్‌ పీరియడ్‌ ఎంత? తదితర విషయాలపై పూచీదారులకు అవగాహన అవసరం. రుణానికి సంబంధించి బీమా తీసుకున్నారో లేదో తెలుసుకోండి. ఎంతకూ అసలు చెల్లింపుదారులు బకాయి చెల్లించకపోతే ఈ భారం ష్యూ రిటీగా ఉన్న వారిపై పడుతుందని గ్రహించండి.

సంతకం చేస్తే..
ఒకసారి ష్యూరిటీ సంతకం చేస్తే మధ్యలో తప్పుకునే అవకాశం ఉండదు. కాబట్టి ష్యూరిటీ సంత కం పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవడం మంచింది. తప్పదు అనుకుని సంత కం చేస్తే అసలు రుణగ్రహీత డబ్బు చెల్లించలేని పరిస్థితి తలెత్తితే బ్యాంకు బకాయిలు తీర్చేందుకు వీలుగా ముందుగానే నిధులు సిద్ధం చేసుకోవడం మంచింది. లేకపోతే మీ సిబిల్‌ స్కోర్‌ దెబ్బతింటుంది. తద్వారా మీకు అవసరం ఉండి రుణం తీసుకునేందుకు అవకాశం ఉండదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top