ఆర్థిక సలహాదారు అరవింద్‌ గుడ్‌బై

Arvind Subramanian Quits - Sakshi

పదవీకాలం ముగియకుండానే నిష్క్రమణ

వ్యక్తిగత అంశాలే కారణం

తిరిగి అమెరికా పయనం

న్యూఢిల్లీ: దాదాపు నాలుగేళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ)గా వ్యవహరిస్తున్న అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. కుటుంబానికి మరింత సమయం కేటాయించే ఉద్దేశంతో తిరిగి అమెరికా వెళ్లిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. 2019 మే దాకా పదవీకాలం గడువు ఉన్నప్పటికీ అంతకన్నా చాలా ముందుగా వచ్చే రెండు నెలల్లోనే సీఈఏ హోదా నుంచి తప్పుకోనున్నట్లు సుబ్రమణియన్‌ తెలిపారు.

‘ఈ సెప్టెంబర్‌లో నాకు మనవడో, మనవరాలో పుట్టబోతున్నారు. ఇలాంటి పూర్తి వ్యక్తిగత కారణాల రీత్యా నేను ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను‘ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని సంప్రతించిన తర్వాత అందరికన్నా ముందుగా ప్రధానికే ఈ విషయం తెలియజేసినట్లు సుబ్రమణియన్‌ వివరించారు. నెలా, రెణ్నెల్ల వ్యవధిలో తాను విధుల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. 2014 అక్టోబర్‌ 16న కేంద్ర ఆర్థిక శాఖకు సీఈఏగా మూడేళ్ల కాలానికి సుబ్రమణియన్‌ నియమితులయ్యారు. 2017లో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు.

భవిష్యత్‌ ప్రణాళికలు..  
ప్రస్తుతానికి భవిష్యత్‌ ప్రణాళికల గురించి వెల్లడించేందుకు సుబ్రమణియన్‌ నిరాకరించారు. తానేం చేయబోతున్నది మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. కొత్త సీఈఏ ఎంపికకు సంబంధించి అన్వేషణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కాగలదన్నారు. పోటీతత్వాన్ని విశ్వసించే కేంద్ర ప్రభుత్వం .. తన వారసుల ఎంపిక విషయంలోనూ అదే ధోరణిని అనుసరించే అవకాశం ఉందన్నారు.

పూర్తికాని ఎజెండా గురించి ప్రస్తావిస్తూ.. ప్రతి రాష్ట్రంలోనూ ఒక సీఈఏ ఉండాలన్నది తన ఆకాంక్షగా ఆయన చెప్పారు. ‘తమ తమ రాష్ట్రాల్లో సీఈఏలాంటి వ్యవస్థ ఉండాలని చాలా మంది ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు. కానీ ఇందుకోసం కావాల్సిన శక్తి సామర్ధ్యాలు, సమయం ప్రస్తుతం నా దగ్గర లేవు. భవిష్యత్‌లో ఇది సాకారం కాగలదని ఆశిస్తున్నాను‘ అని సుబ్రమణియన్‌ పేర్కొన్నారు.

రెండంకెల వృద్ధికి ఆ రెండూ కీలకం..
భారత్‌ నిర్దేశించుకున్న రెండంకెల స్థాయి వృద్ధి రేటు సాధించాలంటే రెండు అంశాలు కీలకమని సుబ్రమణియన్‌ తెలిపారు. ముందుగా అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా ఉండాలన్నారు. అలాగే దేశీయంగానూ విధానాలను సంస్కరించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండో అంశం విషయంలో తగు చర్యలు తీసుకుంటోందని సుబ్రమణియన్‌ అభిప్రాయపడ్డారు.

భారత్‌ నిస్సందేహంగా రెండంకెల స్థాయి వృద్ధి రేటును అందుకోగలదన్నారు. ప్రస్తుతం మినహాయింపు పొందుతున్న రంగాలన్నీ కూడా వస్తు, సేవల పన్నుల పరిధిలోకి వస్తే శ్రేయస్కరమని, జీఎస్‌టీ కౌన్సిల్‌ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుబ్రమణియన్‌ చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధభయాలపై స్పందిస్తూ.. ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనగలిగేలా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు.  

ముందుగానే వెల్లడించిన జైట్లీ ..
సీఈఏ హోదా నుంచి తప్పుకుంటున్నట్లు సుబ్రమణియన్‌ ప్రకటించడానికి ముందుగానే ఆయన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. ‘కొద్ది రోజుల క్రితం సీఈఏ అరవింద్‌ సుబ్రమణియన్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా నాతో మాట్లాడారు. కుటుంబానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉన్నందున తిరిగి అమెరికా వెళ్లిపోదల్చుకుంటున్నట్లు చెప్పారు.

ఆయన కారణాలు వ్యక్తిగతమైనవి, చాలా ముఖ్యమైనవి. దీంతో నేను ఆయనతో ఏకీభవించక తప్పలేదు‘ అంటూ ఫేస్‌బుక్‌లో అరుణ్‌ జైట్లీ పోస్ట్‌ చేశారు. గతేడాదే పదవీకాలం ముగిసిపోయినప్పటికీ తన విజ్ఞప్తి మేరకు అరవింద్‌ సుబ్రమణియన్‌ మరికొంత కాలం సీఈఏగా కొనసాగేందుకు అంగీకరించారని జైట్లీ చెప్పారు. అత్యంత ప్రతిభావంతుడైన సుబ్రమణియన్‌ నిష్క్రమణ తీరని లోటుగా జైట్లీ అభివర్ణించారు. ఎరువులు, విద్యుత్‌ తదితర రంగాల్లో సంస్కరణల అమలుకు సంబంధించి కీలక సూచనలతో ఆయన తోడ్పాటు అందించినట్లు తెలిపారు.

సుబ్రమణియన్‌ తప్పుకోవడం ఊహించిందే: కాంగ్రెస్‌
సీఈఏగా అరవింద్‌ సుబ్రమణియన్‌ నిష్క్రమణ ఊహించిందేనని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. అత్యంత భారీ స్థాయి ఆర్థిక అరాచకత్వాన్ని’ భరించలేకే మోదీ ప్రభుత్వంలోని ’ఆర్థిక నిపుణులు’ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం ఇన్‌చార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. అరవింద్‌ పనగారియా, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మొదలైన వారు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.   

ఒక్కొక్కరుగా కీలక వ్యక్తుల నిష్క్రమణ..
పదవీకాలం ముగియడానికి ముందుగానే ఇటీవల వైదొలిగిన కీలక ఆర్థిక సలహాదారుల్లో అరవింద్‌ సుబ్రమణియన్‌ రెండో వారు కానున్నారు. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా 2017 ఆగస్టులో తప్పుకున్నారు. ఆయన కూడా పదవీకాలం మరో రెండేళ్లు ఉండగానే వైదొలిగారు.

ఎన్‌డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక వీరిద్దరినీ ఆయా హోదాలకు ప్రత్యేకంగా ఎంపిక చేసింది. అయితే పదవీకాలం పూర్తికాకుండానే ఇద్దరూ వ్యక్తిగత కారణాలతో వైదొలగడం గమనార్హం.

కొంగొత్త ఐడియాల అమలు ..
సీఈఏగా అరవింద్‌ సుబ్రమణియన్‌ పలు వినూత్న ఐడియాలను అమలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా తొలి ఆన్‌లైన్‌ కోర్సును నిర్వహించారు. అలాగే, ఆన్‌లైన్‌ విద్యకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే ’స్వయం’ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు.

అలాగే సంపన్నులకు క్రమంగా సబ్సిడీలు తొలగించడం, వాతావరణంలో పెను మార్పులు, యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌ తదితర అంశాలపై ఆయన పలు కీలక సూచనలు చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top