ఒక్క యాప్‌.. 18 రకాల సేవలు! | All types of services have a single app | Sakshi
Sakshi News home page

ఒక్క యాప్‌.. 18 రకాల సేవలు!

Nov 10 2018 1:52 AM | Updated on Nov 10 2018 7:54 AM

All types of services have a single app - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ ఆర్డర్‌ కోసం ఒక యాప్‌! బిల్‌ పేమెంట్స్‌ కోసం ఇంకొకటి.. ట్రావెల్, సినిమా టికెట్లకు మరొకటి.. ఇలా ప్రతి దానికో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే బదులు అన్ని రకాల సేవలకూ ఒకే యాప్‌ ఉంటే? ఇదే ఆలోచన వరంగల్‌కు చెందిన ఓ కుర్రాడికి వచ్చింది. అంతే! చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ‘పబ్బాస్‌’ పేరిట ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్‌ను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ఏటా 18 లక్షల ఆర్డర్లు.. రూ.25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడా కుర్రాడు. మరిన్ని వివరాలను కంపెనీ ఫౌండర్‌ భాను లక్ష్మణ్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది వరంగల్‌లోని పెద్ద పెండ్యాల గ్రామం. సినిమాలంటే ఇష్టం ఉండటంతో కష్టపడి చదివి తమిళనాడులోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎఫ్‌టెక్‌ కోర్సు చదివా. ఆ తర్వాత ఈగ వంటి సినిమాల్లో సౌండ్‌ ఇంజనీర్‌గా పనిచేశా. పరిశ్రమలో స్థిరపడే సమయంలోనే మా అమ్మ చనిపోయింది. దీంతో సొంతూరులో నాన్నతో పాటు ఉండాల్సిన పరిస్థితి. చదివిన చదువుకు స్థానికంగా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవటంతో సొంతంగా జాబ్‌ను క్రియేట్‌ చేసుకునేలా పనిలోనే యాప్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నా.

2015లో రూ.3 లక్షల పెట్టుబడితో షాపిట్‌సూన్‌.కామ్‌ను ప్రారంభమైంది. ప్రస్తుతం షాపింగ్‌ కోసం షాప్‌ఇట్‌సూన్, ఈటింగ్‌ కోసం ఈట్‌ఇట్‌సూన్, వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌ కోసం రీడ్‌ఇట్‌సూన్, ట్రావెల్స్‌ కోసం రైడ్‌ఇట్‌సూన్, లావాదేవీల కోసం స్వైప్‌ఇట్‌సూన్‌ అనే వేర్వేరు వేదికలు అందుబాటులో ఉన్నాయి. వీటిన్నింటినీ కలిపి పబ్బాస్‌ యాప్‌లో క్రోడీకరించాం. దీంతో మొబైల్‌ రీచార్జ్‌ నుంచి మొదలుపెడితే ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్‌ బిల్స్, ఫుడ్, గ్రాసరీ, ట్రావెల్స్, మెడిసిన్స్, డయాగ్నస్టిక్స్, ఫంక్షన్‌ హాల్స్‌ బుకింగ్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబింగ్, కార్పెంటర్స్‌ వంటి 18 రకాల సేవలను పబ్బాస్‌ యాప్‌ ద్వారా పొందే వీలుంటుంది. షాప్‌ఇట్‌సూన్‌లో 200 మంది వర్తకులు, ఈట్‌ఇట్‌సూన్‌లో 60 వేల హోటల్స్, రైడ్‌ఇట్‌సూన్‌లో 80 ట్రావెల్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రతి ఆర్డర్‌ మీద వర్తకుని నుంచి 5–18 శాతం కమీషన్‌ తీసుకుంటాం. ఇప్పటివరకు 50 వేల ఆర్డర్లు డెలివరీ చేశాం. నెలకు 15 వేల ఆర్డర్లు వస్తున్నాయి. గతేడాది రూ.25 లక్షల ఆదాయం ఆర్జించాం. రూ.50 లక్షలు ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నారు. రూ.2 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం. 10 వేల రకాల కిరాణా ఉత్పత్తులతో పాటూ ప్రత్యేకంగా తెలంగాణ అప్పడాలు, కారం, కరివేప, కాకర వంటి పొడులను విదేశాల నుంచి కూడా ఆర్డర్లు చేస్తున్నారు. 2 గంటల్లోగా ఆర్డర్లను డెలివరీ చేస్తాం. స్పీడ్‌ ప్యాక్‌ పేరిట సొంత లాజిస్టిక్‌ ఉంది. దీంతో పాటూ డీటీసీపీ, బ్లూ డార్ట్‌ వంటివి కొరియర్‌ సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరు, చెన్నై, పుణె వంటి నగరాలకు విస్తరించాలన్నది లక్ష్యం’’ అని భాను తెలియజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement