అమ్మకు జరిగిన మోసం.. మరెవరికి జరగకూడదని..

Cyber Crime: College Professor Invented App Against Fraudsters Warangal - Sakshi

బాధితులకు బాసటగా వరంగల్‌ కుర్రాడు

అమ్మకు ఎదురైన అనుభవంతో యాప్‌ తయారు

కూర్చున్న చోటునుంచే ‘ఈ–ఫిర్యాదు’ 

రుసుము లేకుండానే ఉచిత సేవలు

నాలుగురోజుల వ్యవధిలో ఇద్దరికి సాయం

లా విద్యార్థి రాహుల్‌ శశాంక్‌ ఆలోచనలపై ప్రశంసలు

సాక్షి, హనుమకొండ: సైబర్‌ క్రైమ్‌.. కూర్చున్న చోటునుంచే మన డబ్బులను సైబర్‌ నేరగాళ్లు కొల్ల గొడుతున్నారు. 24 గంటల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే పోయిన 100శాతం డబ్బులు తిరిగివచ్చే ఆస్కారముంది. ఏమాత్రం ఆలస్యం చేసినా నగదును మనం  మర్చిపోవాల్సిందే. బాధితులు కూర్చున్నచోటునుంచే సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేలా వరంగల్‌కు చెందిన యువకుడు, లా స్టూడెంట్‌ డి.రాహుల్‌ శశాంక్‌ రూపొందించిన ‘సైబర్‌ అలర్ట్‌’ యాప్‌ ఎంతో మందికి బాసటగా నిలవనుంది. ఇది అందుబాటులోకి తెచ్చిన నాలుగురోజుల వ్యవధిలో రెండు ఫిర్యాదుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగింది. 

అమ్మకు ఎదురైన అనుభవం..
వరంగల్‌లోని ఓ కాలేజీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాహుల్‌ శశాంక్‌ తల్లి సెల్‌ఫోన్‌కు ఏడబ్ల్యూఎస్‌ నుంచి లింక్‌తో కూడిన ఓ మెసేజ్‌ వచ్చింది. అది వైరస్‌ లింక్‌ అని తెలియని ఆమె తెరవడంతో ఆటోమేటిక్‌గా తన బ్యాంక్‌ ఖాతాలోని రూ.10వేలు డెబిట్‌ అయ్యాయి. ఈ సంక్షిప్త సమాచారం చూసుకున్న ఆమె ఆ సమయంలో ఎక్కడా ఫిర్యాదు చేయాలో తెలియక తికమకపడి ఆలస్యమైంది. ఆ తర్వాత సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న రాహుల్‌ శశాంక్‌ తన అమ్మలాగా మిగతావారు మోసపోవద్దని భావించాడు. అప్పటికే సైబర్‌ నేరాలపై వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలు చదవడంతో పాటు ఆ రంగంలో అవగాహన ఉన్న న్యాయవాదులతో చర్చించాడు. ఇంటర్నెట్‌ ద్వారా కూడా సమగ్ర సమాచారం సేకరించి పట్టు పెంచుకున్న రాహుల్‌ శశాంక్‌ ‘సైబర్‌ అలర్ట్‌’ యాప్‌ కోసం రెండు నెలలపాటు శ్రమటోడ్చాడు. నాలుగురోజుల క్రితమే అధికారికంగా యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. సైబర్‌ అలర్ట్‌ అని టైప్‌ చేయగానే కనిపించే ఈ యాప్‌ను మొబైల్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు.

ఎలా ఉపయోగపడుతుందంటే
 సైబర్‌ అలర్ట్‌ యాప్‌లోకి వెళ్లగానే సైబర్‌ ఈ–కంప్లయింట్, సైబర్‌ ట్రాకింగ్, స్టేటస్, సైబర్‌ పోలీసు స్టేషన్లు, సైబర్‌ లీగల్‌ ఎయిడ్, సైబర్‌ మెటీరియల్స్‌ సైబర్‌ ఇంటర్న్‌షిప్స్‌ అనే ఫీచర్లు కనిపిస్తాయి. 
►  సైబర్‌ ఈ–కంప్లయింట్‌ ఫీచర్‌లోకి వెళ్లి మీరు ఎక్కడి నుంచైనా సైబర్‌ నేరానికి సంబంధించిన ఫిర్యాదును టైప్‌ చేస్తే ఆటోమెటిక్‌గా అది సమీప ప్రాంతంలోని సైబర్‌క్రైమ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్తుంది. ఎవరైనా పోలీసు అధికారితో మాట్లాడాలకున్నా అక్కడ వారి సెల్‌ఫోన్‌ నంబర్‌ కూడా కనిపిస్తుంది. 
►  ఈ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందనే విషయం సైబర్‌ ట్రాకింగ్, స్టేటస్‌లో కనబడుతుంది. వీరి బృందమే సైబర్‌ పోలీసులతో మాట్లాడి కేసు స్టేటస్‌ను అప్‌లోడ్‌ చేస్తుంది. ఇది కేవలం కంప్లయింట్‌ ఇచ్చినవారికే కనబడుతుంది.
►  ఫిర్యాదు చేయడంతో పాటు మీ సమీపంలో సైబర్‌క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ ఎక్కడుందనే చిరునామాతో పాటు కాంటాక్ట్‌ నంబర్‌ పొందుపరచబడి ఉంటుంది. మీరు నేరుగా వెళ్లి పోలీసులతో మాట్లాడే అవకాశముంటుంది. పోలీసులు మారుతున్న వారి సమాచారం ఎప్పటికప్పుడూ అప్‌డేట్‌ చేస్తారు. 

నాలుగు రోజుల్లోనే ఇద్దరు బాధితులకు సాంత్వన.. 
ఈ సైబర్‌ అలర్ట్‌ యాప్‌ అందుబాటులో ఉంచిన నాలుగురోజుల్లోనే ఇద్దరికి న్యాయం జరిగింది. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో రూ.80వేలు నష్టపోయిన వ్యక్తి ఈ యాప్‌ ద్వారా చేసిన ఫిర్యాదుతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు 24 గంటల్లోనే అతడి డబ్బును వెనక్కి రప్పించగలిగారు. వరంగల్‌కు చెందిన ఓ మహిళ సెల్‌ఫోన్‌కు వచ్చిన గ్రోసరీ స్టోర్‌ లింక్‌ ద్వారా రూ.10వేలు డెబిట్‌ అయితే ఈ యాప్‌ ద్వారా ఇచ్చిన ఫిర్యాదుతో రూ.ఎనిమిది వేలను తిరిగి పొందగలిగారు. ఇవీ 24 గంటల్లోనే ఫిర్యాదు చేయడంతో సాధ్యమైంది.

చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top