విశ్వసనీయత లేకుండా వ్యవహరిస్తున్నారు

YSRCP MLA Adimulapu Suresh Comments On TDP Govt - Sakshi

యర్రగొండపాలెం (ప్రకాశం): రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కొంచెమైనా విశ్వసనీయత లేకుండా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. బంద్‌ సందర్భంగా మంగళవారం హౌస్‌ అరెస్ట్‌ అయిన ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుందని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ఇవ్వాలని సీఎం కోరినట్లు పార్లమెంటులో స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారని ఆయన అన్నారు. అప్పటికీ సిగ్గులేకుండా టీడీపీ ఎంపీలు తమ పదవుల్లో కొనసాగుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో కూరుకుపోయిన చంద్రబాబును కాపాడుకోవటానికి ఎంపీలు ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. ఏపీ నుంచి ఢిల్లీ వరకు తెలిసేలా ఈ రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రాష్ట్ర బంద్‌ ఉద్యమాన్ని విఫలం చేయటానికి పోలీసు వ్యవస్థను వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.
 
బంద్‌ సందర్భంగా వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు,  స్వచ్ఛందంగా మూత వేయటాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రజల అభీష్టం ఏమిటో అర్థమవుతుందని ఆయన అన్నారు. 2014 నుంచి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్యాకేజీపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఈ సందర్భంగా అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బాబు, మోదీ జోడి అని అభివర్ణించారని, వారిద్దరూ జోడీ కావడం వల్లనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. హోదాపై వారు ముగిసిన అధ్యాయం, మగపిల్లాడిని కంటానంటే అత్త ఒప్పుకోదా, హోదా ఏమైనా సంజీవనా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని ఆయన అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు.

బంద్‌ను  అడ్డుకున్నామని బాబు ఆనంద పడుతుండవచ్చని, కానీ ఆయన చేస్తున్న జిమ్మిక్కులు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజా కెరటంలో టీడీపీ కొట్టుకు పోతుందని ఆయన అన్నారు. హోదా కోసం తమ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటుందని, ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదని సురేష్‌ అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు దొంతా కిరణ్‌గౌడ్, షేక్‌.జబీవుల్లా, పార్టీ సీనియర్‌ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, నవోదయ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కందూరి గురుప్రసాద్, బీసీ, యువజన విభాగాల రాష్ట్ర కార్యదర్శులు ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, కో ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు ఎ.శ్రీరాములు, డైరెక్టర్‌ మేడగం వెంకటరెడ్డి, ముసలారెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top