ఎంబీసీలకు మరో ఛాన్స్‌

YSRCP Government Given Other Chance To MBC In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : గత ప్రభుత్వం వారిని మభ్యపెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌గా భావించిన వారు స్వయం ఉపాధి నిమిత్తం రుణాలకోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసినా వాటిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రుణ పరిమితిని రూ. 50వేలకు పెంచింది. అంతేగాకుండా మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలో 32 కులాలను ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించింది. వీరు చేసుకునే వృత్తిని బట్టి రూ.30వేలు (90 శాతం రాయితీ) రుణాలను నాన్‌బ్యాకింగ్, ఆ పై లక్షదాకా రుణాలను బ్యాంకింగ్‌ ద్వారా ఇచ్చేందుకు ఆదేశాలిచ్చింది. అప్పట్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా బీసీ ఓటర్ల ను ఆకర్షించేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో మంది ఎంబీసీలు ఆన్‌లైన్‌లో రుణాలకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి ఈ రుణాలు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. 

ప్రోత్సహిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం
నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ గతంలో జరిగిన అక్రమాలు, ఎన్నికల్లో బీసీలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన కుట్రలను గమనించి వాటిని రద్దు చేసింది. ఎంబీసీ రుణాల కోసం అవసరమైన ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతేగాదు ఎంబీసీ రుణాలను రూ.30వేల నుంచి రూ.50వేలకు పెంచిం ది. ఈ రుణాలను 90 శాతం రాయితీతో అందిస్తున్నామని ప్రకటించింది. రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్‌ 30వ తేదీ వరకు గడువునిచ్చింది. అవకాశం దక్కడంతో మళ్లీ ఎంబీసీ లు ధ్రువ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకునే పనిలో పడ్డారు.

అత్యంత వెనుకబడిన కులాలంటే...
సంచారం చేస్తూ జీవనం సాగించే సంచార జాతులుగా గుర్తించి, దారిద్య్రరేఖకు అత్యంత దిగువన గల 32 వెనుకబడిన తరగతులకు చెందిన కులాలైన బాలసంతు, బందార, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దులవారు, జంగం, జోగి, కాటికాపల, కొరచా, మొండివాళ్లు, పిచ్చి గుంట్ల, పాములోళ్లు, పర్థి, పంబాల, దమ్మలి, వీర ముష్టి, గుడల, కంజరబట్ట, రెడ్డిక, మండపట్ట, నొక్కర్, పరికిముగ్గుల, యాట, చోపెమరి, కైకడి, జోషినన్, దివలస్, మండుల, కునపులి, పట్రా, రాజన్నల, కసిగపడి కులాల ప్రజలు రుణాలు పొందటానికి అర్హులు, గతేడాది జిల్లాలో 1590 మందికి రూ.4.78 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారులు కోరుకున్నట్లయితే ఆయుర్వేదిక్‌ షాపులు, పండ్ల వ్యాపారం, బ్యాంగిల్‌స్టోర్స్, పూసల వ్యాపారం, పూల బొకే వ్యాపారం, కొవ్వొత్తుల తయారీ, హెయిర్‌ కలెక్షన్, కార్పెట్స్‌ తయారీ, చికెన్‌ షాపులు, కారప్పొడి తయారీ, కొబ్బరికాయల వ్యాపారం, కూల్‌డ్రింక్‌ షాపు, గుడ్ల వ్యాపారం, చేపల వ్యాపారం, పిండిమిల్, కూరగాయల వ్యాపారం, పచ్చళ్ల తయారీ, పాన్‌ లేదా సోడా షాపు, తదితర యూనిట్లను ఏర్పాటుచేసుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం కనీసం ఒక్కరికైనా రుణం అందజేయకపోవటం విశేషం.

ఎంబీసీలు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి
అత్యంత వెనుకబడినతరగతులకు చెందిన వారు 21 నుంచి 50 సంవత్సరాలలోపు వయ స్సు కలిగి ఉడి, పట్టణ ప్రాంతా ల వారి ఆదాయం రూ.75వేలు, గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం రూ.60వేలు కలిగిన వారు అర్హులు. గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం పొందనివారు అర్హులు. గతంలో దరఖాస్తు చేసుకున్నా... రుణాలు మంజూరు కానివారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.
– ఆర్‌.వి నాగరాణి, ఈడీ, బీసీ కార్పొరేషన్, విజయనగరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top