వైఎస్సార్‌సీపీలో జోష్‌ | YSRCP Celebrate Exit Polls In Nellore | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో జోష్‌

May 20 2019 2:38 PM | Updated on May 20 2019 2:39 PM

YSRCP Celebrate Exit Polls In Nellore - Sakshi

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ సాగుతున్న క్రమంలో ఆదివారం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో నయా జోష్‌ నెలకొంది. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని జాతీయ మీడియా సంస్థలతో పాటు పలు సర్వే ఏజెన్సీలు తమ ఫలితాలను ప్రకటించాయి. అది కూడా రికార్డు స్థాయి సీట్లతో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి. ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో పాటు అభ్యర్థుల్లో బలమైన అంచనాలకు తెరలేచింది. ముఖ్యంగా జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ దిశగా ఫలితాలు ఉంటాయని కొన్ని ఏజెన్సీలు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు మెజార్టీ లెక్కలపై అంచనాలు వేస్తున్నాయి. ఇంకోవైపు బెట్టింగ్‌ రాయుళ్ల పందేల జోరు తారస్థాయికి చేరాయి.

సాక్షి , నెల్లూరు: దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఆదివారంతో ముగిసిపోవడంతో సాయంత్రం నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థలు మొదలుకుని అనేక సర్వే సంస్థల వరకు తీవ్ర ఆసక్తిగా మారిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వేలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఆదివారం ప్రకటించిన సర్వేల్లో అత్యధిక శాతం సర్వేలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలుపట్టం కడతారని పేర్కొన్నాయి. ముఖ్యంగా జిల్లాలో అయితే పార్టీ అభ్యర్థుల పనితీరు.

పోలింగ్‌ జరిగిన సరళిని అంచనా వేయడంతో పాటు పోలింగ్‌ రోజున సర్వే సంస్థలు ఓటర్ల మాట్లాడిన అభిప్రాయాలు ఇలా అన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఫలితాలను ప్రకటించాయి. జిల్లాలో అత్యధిక స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని, అలాగే రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని కొన్ని సర్వేలు ప్రకటించగా, మరికొన్ని సర్వేలు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అంచనాలు వేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, పల్లె జనం వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారని ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. 

మూడు రోజుల్లో కౌంటింగ్‌
మరోవైపు జిల్లాలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగుల జోరు తారస్థాయికి చేరింది. మరీ ముఖ్యంగా ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే సీట్లు, మెజార్టీలపైనే ఎక్కువగా బెట్టింగులు సాగుతున్నాయి. మరో మూడు రోజుల్లో కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే కౌంటింగ్‌ ఏజెంట్లకు పాసులు జారీ మొదలుకుని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు వరకు అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి ఇప్పటికే ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 1,200 మంది సిబ్బంది కౌంటింగ్‌ విధుల్లో పాల్గొంటారు. ఇప్పటికే వారికి జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమం కలెక్టర్‌ ముత్యాలరాజు నిర్వహించారు.

అలాగే రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషనర్‌ కూడా కౌంటింగ్‌ సంబంధించి శిక్షణ నిర్వహించారు. అలాగే వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేశారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఆయా పార్టీల కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. మరోవైపు జిల్లాలో తొలిఫలితం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి వెలువడే అవకాశం ఉంది. అలాగే రెండో ఫలితం నెల్లూరు రూరల్‌ కాగా చివరి ఫలితాలు  కోవూరు, ఉదయగిరి వెలువడే అవకశాలున్నాయి. నెల్లూరు సిటీలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అలాగే నెల్లూరు రూరల్‌లో 16 రౌండ్లు, కోవూరు, ఉదయగిరిలో 23 రౌండ్లతో లెక్కింపు పూర్తవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement