చక్కెర ఫ్యాక్టరీలకు పునర్‌ వైభవం

YS Jaganmohan Reddy directed the officers to the re-establishment of cooperative sugar factories and dairies in the state - Sakshi

పని చేస్తున్న ఫ్యాక్టరీల ఆధునికీకరణ

సహకార డెయిరీల బలోపేతంపై చర్యలు

ప్రముఖ బ్రాండ్ల భాగస్వామ్యంపై ఆలోచనలు

సహకార డెయిరీకి పాలుపోస్తే లీటర్‌కు రూ.4 బోనస్‌ 

వైఎస్సార్‌ చేయూత ద్వారా వచ్చే నాలుగేళ్లలో మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నాం. తద్వారా డెయిరీ కార్యక్రమాల ద్వారా వారి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో సహకార డెయిరీల బలోపేతం, డెయిరీ రంగంలో మహిళల భాగస్వామ్యం, పాడి పశువులను గణనీయంగా పెంచడమనే మూడు కోణాల్లో కార్యక్రమాలు విస్తృతం చేస్తాం.

సహకార చక్కెర ఫ్యాక్టరీలపై పెట్టే ప్రతి పైసా సద్వినియోగం కావాలి. సొంత కాళ్ల మీద ఫ్యాక్టరీ నిలబడాలి. రైతులు ఆనందంగా ఉండాలి. అప్పుడు కొంత, ఇప్పుడు కొంత ఇచ్చి.. అటూ ఇటూ కాకుండా ఫ్యాక్టరీని, రైతులను ఇబ్బంది పెట్టొద్దు. రెండు మూడేళ్లలో వీటిని అత్యంత ఆధునిక పరిశ్రమలుగా తీర్చిదిద్దాలి. 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సహకార చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీల పునర్‌ వైభవానికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పని చేస్తున్న ఫ్యాక్టరీలను మరింత బలోపేతం చేయడంతో పాటు మూత పడిన వాటిని తెరిపించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పుడున్న పోటీని తట్టుకుని, లాభదాయకంగా నడపడానికి తీసుకోవాల్సిన చర్యలను అందులో పొందుపరచాలన్నారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డెయిరీలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కర్మాగారాలను అభివృద్ధి చేయడంతోపాటు ఉప ఉత్పత్తుల ద్వారా అవి సొంతకాళ్ల మీద నిలబడేందుకు అవసరమైన ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. చెరకు సరఫరా చేసిన రైతులకు బకాయిలను చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చెరకు పంట సాగు, సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి గురించి అధికారులు సీఎంకు నివేదించారు. ఫ్యాక్టరీల వారీగా రైతుల బకాయిలు, రుణాలు.. తదితర అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.  

చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి ఇదీ..
- దేశంలో 330.70 లక్షల మెట్రిక్‌ టన్నుల పంచదార ఉత్పత్తి అవుతోంది. అత్యధికంగా 116.7 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్‌ దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 5.02 లక్షల మెట్రిక్‌ టన్నులతో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో ఉంది. కాగా రాష్ట్రంలో  10.23 లక్షల మెట్రిక్‌ టన్నుల చక్కెర డిమాండ్‌ ఉంది.  
- ఒక్కో హెక్టారుకు చెరకు ఉత్పత్తిలో 105 మెట్రిక్‌ టన్నులతో తమిళనాడు దేశంలో ప్రథమ స్థానంలో ఉండగా, 78 మెట్రిక్‌ టన్నులతో ఏపీ ఏడో స్థానంలో ఉంది. 
- మన రాష్ట్రంలో 29 చక్కెర కర్మాగారాలకుగాను 18 మాత్రమే పని చేస్తున్నాయి. మహారాష్ట్రలో 264 ఉంటే 195 పనిచేస్తున్నాయి.
- రాష్ట్రంలో 2006–07లో 100.91 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు క్రషింగ్‌ అయ్యేది. 2018–19 నాటికి అది 54.05 లక్షల టన్నులకు పడిపోయింది. 
- సహకార చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించి విజయనగరం జిల్లా భీమసింగిలోని విజయరామగజపతి, విశాఖపట్నం జిల్లా చోడవరం, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు మాత్రమే ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్నాయి. అనకాపల్లి (ఎన్నికల ముందు ప్రారంభమైనా మళ్లీ మూత), గుంటూరు జిల్లా జంపని, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని శ్రీ వెంకటేశ్వర, చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ, కడప సమీపంలోని చెన్నూరు సుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. పది సహకార సుగర్‌ ఫ్యాక్టరీలపై రూ.891.13 కోట్ల భారం ఉంది. 

సీఎం సూచనలు, ఆదేశాలు..
- సహకార ఫ్యాక్టరీల నుంచి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా దృష్టి సారించాలి.
- ప్రస్తుతం నడుస్తున్న నాలుగు సహకార చక్కెర ఫ్యాక్టరీలను పూర్తి స్థాయిలో ఆధునికీకరించడానికి, మూత పడిన వాటిని తెరవడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి.
- వైఎస్సార్‌ జిల్లా చెన్నూరు, చిత్తూరు జిల్లా గాజులమండ్యం, విశాఖ జిల్లా అనకాపల్లి ఫ్యాక్టరీలను వెంటనే పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. 
తెరవడానికి అవకాశం లేని సహకార చక్కెర కర్మాగారాల విషయంలో ఉన్న బకాయిలను తీర్చడానికి ఏం చేయాలన్న దానిపై  ప్రణాళిక సిద్ధం చేయండి. 
మొలాసిస్‌ లాంటి ఉప ఉత్పత్తుల వల్ల ఆర్థిక ప్రయోజనం సమకూరే మార్గాలపైనా దృష్టిపెట్టాలి.
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఇతరత్రా అంశాలపై దృష్టి సారించాలి.
సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలి.
- ఎన్నికల ప్రణాళికలో నిర్దేశించిన విధంగా సహకార డెయిరీలకు పాలు పోస్తున్న రైతుకు ప్రతి లీటరుకు రూ.4ల బోనస్‌ ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించాలి.
- సహకార డెయిరీలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల స్థితిగతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలి. డెయిరీల సామర్థ్యాన్ని పెంచేందుకు, మార్కెటింగ్‌లో కొత్త వ్యూహాలు దిశగా అడుగులు వేయాలి. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ల భాగస్వామ్యం దిశగా ఆలోచించాలి.  
రాష్ట్రంలో చెరకు సాగు తగ్గకుండా మరింత పెరిగేలా, నాణ్యత ఉండేలా వ్యవసాయ శాఖ దృష్టి సారించాలి. చెరకు నాటడానికి, కటింగ్‌కు ఫ్యాక్టరీ ద్వారా అత్యాధునిక పరికరాలను రైతులకు అందించేలా చూడాలి. అధిక దిగుబడి కోసం తమిళనాడు విధానాలను పరిశీలించండి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top