ప్రజా సంకల్పయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : పట్టుమని పదేళ్లయినా లేని బుడతలు వారు. పరుగు పరుగున వచ్చారు. రామకృష్ణాపురం ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేతను చూసి ‘జగనన్నా.. జగనన్నా’ అంటూ కేకలు వేశారు.. ఒకింత చిరునవ్వుతో దగ్గరకు రండి అన్నట్లు జగన్ సైగ చేశారు. ఇదే అవకాశం అన్నట్లు వారు సెక్యూరిటీని నెట్టేసుకుంటూ వచ్చి.. జగన్‌కు అటు, ఇటు నిలుచుని అడుగులేశారు. రాజకీయమంతా తమకే తెలుసన్నట్టు వాళ్లు మాటలు చెప్పడం మొదలు పెట్టారు. ‘అన్నా.. మనమే గెలుస్తాం.. చంద్రబాబును ఊళ్లో ఎవరూ నమ్మడం లేదన్నా...’ అన్నాడో పిడుగు. ‘మా అమ్మకూ అదే చెప్పానన్నా...’ అంటూ మరో గడుగ్గాయి. ‘మీతో దిగిన ఫొటో మా ఫ్రెండ్ వాట్సాప్‌లో పెట్టాడన్నా... నేను చూశాను’ అంటూ ఇంకో చిన్నారి మురిసిపోయాడు. ఆ చిట్టి పొట్టి పిల్లల కబుర్లు వింటూ, చిరునవ్వుతో వారి చేతుల్లో చిక్కిన తన చేయిని అలాగే ఉంచేసి జగన్ కొంత దూరం అడుగులేశారు.
♦ జీవో 85ని అమలు చేయాలి
కమ్మరి, వడ్రంగి, స్వర్ణకళ, శిల్పకళ వంటి మా కుల వృత్తులు నాశనమైపోతున్నాయి. మా అభివృద్ధి కోసం గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన జీవో 85ను జగన్ అ«ధికారంలోకి వచ్చాక అమలు చేయాలని కోరుతున్నాం. – దేవపూజ ధనుంజయ ఆచారి, విశ్వబ్రాహ్మణుడు
♦ రజకులకు సామాజిక చట్టం కావాలి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రజకులపై సాంఘిక బహిష్కరణలు, దాడులు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల తరహాలో రజకులకు ఒక సామాజిక చట్టాన్ని ఏర్పాటు చేయాలి.
– శేఖర్, ఏపీ రజక వృత్తికారుల సంఘం నేత
♦ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
వీరశైవ లింగాయత కులాన్ని వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఓసీల నుంచి బీసీల్లోకి చేర్చారు. వీరశైవ లింగాయత్‌లు ఆర్థికంగా, సామాజికంగా వెనుకంజలో ఉన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వీరశైవ లింగాయత్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలయాల్లో అర్చకులుగా ఉన్న మాకు వేతనం ఇవ్వాలి. – జగదీష్, కోసిగి, మంత్రాలయం
♦ టీడీపీని సముద్రంలో కలిపేస్తాం..
మా ప్రాంతానికి ప్రభుత్వం సాగు, తాగునీరు ఇవ్వడం లేదు. చంద్రబాబు ఎన్నికల సమయంలో మాకు చాలా హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు. ఈసారి టీడీపీని సముద్రంలో కలిపేస్తాం.
– మంగమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు, కోసిగి


