మాటిస్తున్నా.. మంచి పాలన అందిస్తా

YS Jagan Mohan Reddy With Media After Results - Sakshi

సంవత్సరం లోపే ప్రజలందరితో అలా అనిపించుకుంటా.. 

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి: ‘‘జగన్‌ మంచి ముఖ్యమంత్రి అని ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే మీ అందరితో అనిపించుకుంటానని మాట ఇస్తున్నా. ఆ దిశగానే నా ప్రతి అడుగూ వేస్తా’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించిన తరువాత గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌లో జగన్‌ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే... 

రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం 
‘‘గవర్నెన్స్‌ (పరిపాలన) అంటే ఏమిటి? గొప్ప గవర్నెన్స్‌ అంటే ఎలా ఉంటుంది? అన్నది ఇవాళ చెబుతున్నా. ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే.. జగన్‌ మంచి ముఖ్యమంత్రి అని మీ అందరితో అనిపించుకునేటట్టుగా నా ప్రతి అడుగు వేస్తానని మాట ఇస్తున్నా. అదే విధంగా నవరత్నాలతో ప్రజలందరికీ మేలు చేసేలా పాలన అందిస్తా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో.. బహుశా ఇంత గొప్ప విజయం ఎప్పుడూ కూడా నమోదు కాలేదేమో. నాకు తెలిసి 25కు 25 ఎంపీ స్థానాలు మొత్తంగా రావడం.. 175 నియోజకవర్గాలకు గాను 153కు పైగా నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నెగ్గడం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం. 

విశ్వసనీయతకు ఓటు వేశారు 
ఇవాళ నేను ఇక్కడ మీ అందరి ఎదుట నిల్చుని మాట్లాడగలగడం నిజంగా ఒక అదృష్టం. అది కేవలం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్లనే సాధ్యమైందని గర్వంగా చెబుతున్నా. ఈ విజయం నాపై ఉన్న బాధ్యతను, విశ్వాసాన్ని మరింత పెంచుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు నాకు ఓట్లు వేశారంటే... అది విశ్వసనీయతకు ఓటు వేయడమే. ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఇప్పుడు తమ ఓటు ద్వారా తెలియజేశారు. ఐదు కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కరికే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఆ అవకాశం దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది. నాపై విశ్వాసం ఉంచినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. అందరికీ పేరుపేరునా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 

నవరత్నాలను తీసుకొస్తున్నాం
మొదటి సంతకం ఏ ఫైల్‌పై పెట్టబోతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జగన్‌ స్పందిస్తూ... ‘‘మొదటి సంతకం కాదు. నవరత్నాల అమలు అన్నది నేను గట్టిగా నమ్ముతున్నా. సుదీర్ఘమైన నా పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు చూశా, వారి బాధలు విన్నా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని ప్రజలందరికీ చెబుతున్నా. ఒక సంతకం కాదు. నవరత్నాలను తీసుకొచ్చే పాలనను ఇవ్వబోతున్నామని కచ్చితంగా చెబుతున్నా’’ అని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరుగుతుందని చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top