అసెంబ్లీని హుందాగా నడిపిస్తాం | YS Jagan Comments At Training Classes Of MLA And MLCs | Sakshi
Sakshi News home page

అసెంబ్లీని హుందాగా నడిపిస్తాం

Jul 4 2019 3:47 AM | Updated on Jul 4 2019 10:32 AM

YS Jagan Comments At Training Classes Of MLA And MLCs - Sakshi

బుధవారం వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వాళ్లేం (ప్రతిపక్షం) మాట్లాడతారో మాట్లాడనిద్దాం. తర్వాత హేతుబద్ధంగా సమాధానం చెబుదాం. ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు అని మనమెందుకు కుట్రలు పన్నాలి? ఆ అవసరమే లేదు. మన మీద మనకు నమ్మకం ఉంది. మన పాలన మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభను గతంలో(టీడీపీ పాలనలో) మాదిరిగా కాకుండా తమ హయాంలో హుందాగా నడిపిస్తామని, స్పీకర్‌కు ఎలాంటి తలనొప్పులు రానివ్వబోమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాన్ని సభలో మాట్లాడనిస్తూ వారు చేసే విమర్శలను సహేతుకంగా, దీటుగా ఎదుర్కొందామని ఆయన ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ కమిటీ హాలు–1లో బుధవారం ప్రారంభమైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పునశ్చరణ తరగతుల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చట్ట సభలో లెజిస్లేటర్లు అబద్ధాలు చెప్పకూడదని, వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఆయా విషయాలపై సంపూర్ణమైన సంసిద్ధత, అవగాహనతో వచ్చినప్పుడే మన ప్రసంగాలు బాగుంటాయని అన్నారు. జన సామాన్యంలో ఎంత గొప్పగా ప్రసంగించే వక్త అయినా తగు సమాచారంతో సభకు రాకపోతే మాట్లాడేటప్పుడు విఫలమవుతారని ఆయన హెచ్చరించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పునశ్చరణ తరగతులు చాలా ఉపయోగపడతాయని, చట్టాలు రూపొందే సభలో చట్టాలను ఉల్లంఘించరాదని ఆయన సూచించారు. సీఎం జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..

నిబంధనలు పూర్తిగా చదవండి
‘అసెంబ్లీని ఈసారి చాలా హుందాగా నడిపిస్తాం. ఎవరు మాట్లాడాలనుకున్నా.. బంగారంగా సమయం ఇస్తాం. ఏం కావాలంటే అది మాట్లాడుకోవచ్చు. దాన్ని హేతుబద్ధంగా పకడ్బందీగా మనం ఎదుర్కొంటాం. అదే మన బలం. అందువల్ల ఇది చాలా మంచి అసెంబ్లీగా ఉండబోతోందని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు గారి మాదిరిగా చట్టాలను మనమే చేస్తాము.. వాటిని మనమే కత్తిరిస్తాము.. అనే పరిస్థితి అసలు ఉండదు. చట్టాలను చేసే సభలో చట్టాలను గౌరవించే విధంగా వ్యవహరిస్తాం కాబట్టి, స్పీకర్‌కు ఎలాంటి తలనొప్పులూ ఉండవు. అందరం కలిసికట్టుగా ఈ సభను చక్కగా నడిపిద్దాం. మీ అందరి సహాయ సహకారాలతో గొప్పగా చేయగలుతామని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. శాసనసభను ఎలా జరపాలి.. సభలో ఎలా ప్రసంగించాలి.. ఏ రీతిలో ప్రసంగిస్తే ఆకట్టుకునే రీతిలో ఉంటుంది.. ఇవన్నీ కూడా ఇంతకు ముందు మాటల సందర్భంలో ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌ చెప్పారు. స్పీకర్‌ సీతారామ్‌ కూడా కొన్ని అంశాలు మీ ముందు పెట్టారు. ఇక ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లు కూడా ఎలా ప్రసంగిస్తారో చెబుతారు. శాసనసభ అధికారులు కూడా ఏ నిబంధనల కింద సభలో వివిధ అంశాలను తీసుకు రావాలో చెబుతారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక అంశాలపై చర్చ ఎలా ఉండాలో.. ఎలా ప్రస్తావించాలో కూడా చెబుతారు. అది చాలా ముఖ్యం కూడా. మీకు అందజేసిన నిబంధనల పుస్తకాలను పూర్తిగా చదవాల్సిన అవసరం ఉంది.
బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన పునశ్చరణ తరగతులకు హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  

విషయ పరిజ్ఞానంతో సంసిద్ధంగా రావాలి
సభలో మన హోదా పెద్దది.. మనం చేయెత్తగానే స్పీకర్‌ మనకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందే కదా అనుకుంటాం. విషయం (సబ్జెక్ట్‌) ఎంత పెద్దదైనా చేయెత్తగానే స్పీకర్‌ ఒక్కోసారి అవకాశం ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఫలానా విషయంపై ఫలానా వారు మాట్లాడతారని మనం ముందుగానే ఆయనకు జాబితా అందజేసి ఉంటాం. ఆ జాబితా ప్రకారమే స్పీకర్‌ మనకు మాట్లాడటానికి అనుమతిస్తారు. అనుమతి ఇవ్వకపోతే మనం మరోలా అనుకోవాల్సిన పని కూడా లేదు. ఇరు పార్టీల్లోని వారు ఏ ఏ సబ్జెక్ట్‌లపైన మాట్లాడాలనుకుంటారో మనమూ, వాళ్లు (ప్రతిపక్షం) జాబితాలను ఇస్తాం. ఇది అందరికీ వర్తిస్తుంది. మన పార్టీ నుంచి మాట్లాడేవారి విషయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డిలు ఇద్దరూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. అలాంటి సందర్భాల్లో మనం ఆయా విషయాలపై అవగాహన పెంచుకుని, క్షుణ్ణంగా తెలుసుకుని సంసిద్ధంగా రావాలి. లేదంటే బయట బహిరంగ సభల్లో ఎంత రసవత్తరంగా మాట్లాడే గొప్ప ఉపన్యాసకుడైనా సరే సభలో ఫెయిల్‌ కావచ్చు.  

పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది
విషయ అవగాహన లేకుండా మనం అప్పటికప్పుడు చేయి ఎత్తి మాట్లాడాలనుకుంటే మాట్లాడలేము. మనం ఏదో ఒకటి మాట్లాడితే వెంటనే అవతలి వారు (ప్రతిపక్షం) ఒక డాక్యుమెంట్‌ (పత్రం) తీసుకుని ఇదిగో చూడు.. తెలియకపోతే తెలుసుకో.. అన్నారనుకోండి, అప్పుడు మనం ఇబ్బందికర పరిస్థితుల్లో పడతామనేది ఎవరూ మరచిపోవద్దు. అందుకే మీకు ఆసక్తి ఉన్న అంశాలన్నింటి (సబ్జెక్టులు) పైనా పూర్తిగా అవగాహన పెంచుకుని రండి. మీకు ఫలానా సబ్జెక్టుపై ఆసక్తి ఉందని రాజేంద్రనాథ్, శ్రీకాంత్‌కు చెబితే వారు మీకు ఆ విషయాలే అప్పగిస్తారు. అప్పుడు మీరు మాట్లాడాలనుకున్న విషయంపై మెటీరియల్‌ అంతా మీకు అందుబాటులోకి వస్తుంది. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నంత సమాచార వనరులు కూడా ఉండేవి కావు. మాకున్న పరిధిలో ప్రముఖులంతా కూర్చుని విషయాన్ని లోతుగా పరిశీలించి, క్రోడీకరించి ఆయా అంశాలను విడి విడిగా సంబంధిత సబ్జెక్టులపై మాట్లాడే వారికి క్షుణ్ణంగా అందజేసేవారు. వారిచ్చే కంటెంట్‌ ఆధారంగా శాసనసభలో చక్కగా మాట్లాడే అవకాశం లభించేది. ఇప్పుడు ఇంకా సానుకూల పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మనకు అధికార యంత్రాంగం తోడుగా ఉంది కాబట్టి సమగ్ర సమాచారం వస్తుంది. ప్రభుత్వంలో మనమే ఉన్నాం కాబట్టి సబ్జెక్ట్‌ అంతా డాక్యుమెంట్లతో సహా మనకు అందుతుంది. మీకు పూర్తి సమాచారం అందజేయడమే కాకుండా మిమ్మల్ని సంసిద్ధ పరిచే పని కూడా చేస్తారు. 

చక్కగా మాట్లాడాలనే తపన ఉండాలి
ఒక విషయంపై బాగా మాట్లాడాలనే తపన మీకుండాలి. ఆ తపన లేకపోతే అసెంబ్లీలో ఎవరూ రాణించలేరు. నేను ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇంటి వద్ద తెల్లవారుజామునే బాగా ప్రిపేర్‌ అయ్యి వచ్చే వాడిని. ఆ సబ్జెక్ట్‌తో సంబంధం ఉన్న వారిలో నలుగురైదుగురు కూడా ఇంటికి వచ్చి వివరించే వారు. మెటీరియల్‌ పూర్తిగా చూసుకుని మార్కింగ్‌ చేసుకుని అసెంబ్లీకి వచ్చే వాడిని. అలా సంసిద్ధంగా వస్తేనే హేతుబద్ధంగా ఒక అంశం మీద చక్కగా మాట్లాడే వాళ్లం. మనం చెబుతున్నది ప్రజల్లోకి బాగా వెళుతోంది అన్నప్పుడు మనకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. అందుకే ఒక విషయంపై అవగాహన, సంసిద్ధతతో రావడం అనేది శాసనసభ్యులకు చాలా చాలా అవసరం. మిమ్మల్ని శాసనసభా వ్యవహరాల మంత్రి, చీఫ్‌ విప్‌ చక్కగా సమన్వయం చేసి ఆ వివరాలను అందజేస్తారు.  

సభ గతంలో లాగా జరగదు..
ఈసారి ఈ శాసనసభలో పరిస్థితులు గతంలో మాదిరిగా ఉండవు. గతంలో ప్రతిపక్షాన్ని (వైఎస్సార్‌సీపీ) అసలు అధికారపక్షం మాట్లాడించే పరిస్థితులే ఉండేవి కావు. ఏదైనా నిర్మాణాత్మక విమర్శ ప్రతిపక్షం నుంచి వస్తే చాలు, వెంటనే మైకులు కట్‌ చేసే వారు. మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. వెంటనే వ్యక్తిగత విమర్శలకు దిగే వారు. టాపిక్‌కు సంబంధం లేని మాటలన్నీ తీసుకు వస్తూ.. మీ నాన్న అట్లా.. ఇట్లా.. అంటూ సంబంధం లేని విషయాలన్నీ తెచ్చేవారు. ఇలాంటి సంఘటనలు గత అసెంబ్లీలో లెక్కలేనన్ని చూశాం. కానీ మన పాలన ఆ తీరులో ఉండదు. గత ప్రభుత్వంలో పార్టీ మారిన వారు రాజీనామా చేసిన పరిస్థితులు ఎక్కడా ఉత్పన్నం కాలేదు. ఆ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉండాలని నేను ప్రతి సందర్భంలోనూ చెబుతున్నా. మనం మార్గదర్శకంగా అడుగులు వేస్తున్నాం. అసెంబ్లీని నిర్వహించే విషయంలో కూడా అంతే మార్గదర్శకంగా ఉండాలనేది మన అభిమతం. నేను ఈ సందర్భంగా స్పీకర్‌కు ఒకటే చెబుతున్నా. నేను ముఖ్యమంత్రి హోదాలో లేచి సభలో మాట్లాడేటప్పుడు.. ఒక వేళ ప్రతిపక్ష నాయకుడు లేచి తానేదైనా మాట్లాడదల్చుకుంటే సాధారణంగా ఎవరైనా కూర్చో, కూర్చో అనే చెబుతారు. కానీ, నేను మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేచి జోక్యం చేసుకుని మాట్లాడతానంటే.. బంగారంగా మాట్లాడండి చంద్రబాబు గారూ... అని నేనే చెబుతాను. ఎందుకంటే అతన్ని మాట్లాడనిద్దాం. ఏం మాట్లాడాలనుకుంటున్నారో.. ఏం చెప్పాలనుకుంటున్నారో సమయం ఇద్దాం. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన పాయింట్లను చాలా హేతుబద్ధంగా.. పకడ్బందీగా.. మన వాదనలను వినిపించగలిగితే ప్రజలు దాన్ని సాంతం చూస్తారు. అప్పుడు ఎవరు ఎంత హేతుబద్ధంగా మాట్లాడారనే అంశం ప్రజల్లోకి బాగా వెళుతుంది.

ఆయనలా అబద్ధాలాడొద్దు
చంద్రబాబు గారి గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఆయనకు గట్టిగా అబద్ధాలు చెప్పే అలవాటుంది. ఇదే శాసనసభలో అయితే నేను దీనిని సత్యదూరం అనాలి. గతంలో ఆయన (చంద్రబాబు) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నాన్న గారు (వైఎస్‌ రాజశేఖరరెడ్డి) ముఖ్యమంత్రిగా ఉండగా, యల్లంపల్లి అనుకుంటా.. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లపై ఒక కల్పిత డాక్యుమెంట్‌ను చంద్రబాబు ఏకంగా అసెంబ్లీలోకి తీసుకు వచ్చి చదవడం మొదలు పెట్టారు. ఆ టెండర్లు ఇలా జరిగాయి.. అలా జరిగాయి అంటూ ఏదేదో చెప్పారు. నాన్నతో సహా ఎవరికీ ఏం అర్థం కాలేదు. అసలేం జరిగిందని మొత్తం డేటా తీసుకుని చూస్తే చంద్రబాబు ఒక ఫేక్‌ (తప్పుడు) డాక్యుమెంట్‌ను తీసుకొచ్చి మాట్లాడారని అర్థం అయింది. ఆ తర్వాత రోజున అసెంబ్లీలో మా నాన్న (వైఎస్సార్‌) ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ను చూపించి, ఇదీ సిసలైన డాక్యుమెంట్‌.. ఏందయ్యా మీరు చేస్తుండేది.. ఏం మాట్లాడేది.. అని ప్రశ్నించారు. ఎందుకిలా తప్పుదోవ పట్టిస్తున్నావని అడిగితే.. ఆయన (చంద్రబాబు) ఇలా అబద్ధాలాడటం సర్వ సాధారణమేనని అసెంబ్లీ సాక్షిగా రికార్డుల్లో నమోదవుతుందని తెలిసీ నిస్సిగ్గుగా చెప్పారు. ఇలా మేం అబద్ధాలాడటం సహజమే.. ఇలా మేం అబద్ధాలాడితేనే మీరు నిజం చెబుతారు అని అన్నారు. ఇది నిజంగా షాకింగ్‌. దయచేసి నేను మీకు మనవి చేసేదేమిటంటే... అలాంటి అబద్ధాలు, అటువంటి మోసాలు చేసే కార్యక్రమం మనమెప్పుడూ చేయకూడదు.

సభకు అందరూ క్రమం తప్పకుండా రావాలి
అసెంబ్లీలో ఉన్న సభ్యుల్లో 175 మందిలో 70 మంది కొత్తవారు. అందువల్లే ఇదంతా చెబుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అసెంబ్లీకి క్రమం తప్పకుండా హాజరు కావడం. ఎమ్మెల్యేగా మనం హోరాహోరీ పోరాటం చేసి గెలిచాం. ఎందుకు గెలిచాం అన్నది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం గెలిచిందెందుకంటే ఈ శాసనసభలో కూర్చునేందుకే కదా.. ప్రజల సమస్యలు ప్రస్తావించేందుకే కదా.. అలాంటప్పుడు మనమే ఈ సభకు రాకపోతే ఏం లాభం? ఒక నిరసన తెలపడం కోసమో.. ప్రజలకు ఒక సందేశం పంపడం కోసమో.. సభను బహిష్కరించినా, గైర్హాజరైనా ఒక అర్థం ఉంటుంది.  అన్నీ బాగా జరుగుతున్నప్పుడు, మనకు ఇంట్లో పనులున్నాయనో, వేరే ఏవో వ్యవహారాలున్నాయనో చట్ట సభకు రాలేక పోవడం అన్నది సరికాదు. కచ్చితంగా ఎమ్మెల్యేలంతా హాజరు కావాలి. 

వ్యూహం ప్రధానం
అసెంబ్లీలో ఏదైనా వ్యూహం అనుసరించాలి అనుకున్నపుడు, కచ్చితంగా అసెంబ్లీ మొదలయ్యే ముందు ఒక అరగంటైనా ముందుగా రావాలి. అప్పుడే వ్యూహ రచన చేసుకోవచ్చు. ఆ రోజు కా రోజు, 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభానికి ముందే వాయిదా తీర్మానాలు ఏమైనా ఉంటాయా? ఇంకా ఏమైనా ఉంటాయా? అనే వ్యూహం ఉంటుంది. మనం 151 మందిమి ఉన్నాం. ప్రతి 15 లేదా 10 మందికి కోఆర్డినేటర్‌గా ఒక ఎమ్మెల్యేను ఎంపిక చేస్తాం. వీళ్లను సమన్వయం చేసుకోవడం, వారికి ఫోన్లు చేసి అసెంబ్లీకి రప్పించడం, వ్యూహం అమలు గురించి చర్చించడం తదితర బాధ్యతలు వీరికి అప్పగిస్తాం. వీరికి మిగతా ఎమ్మెల్యేలందరూ అందుబాటులో ఉండాలి. అసెంబ్లీ అయిపోయాక ఎక్కడో, ఏదో ఒక సమయంలో తర్వాతి రోజుకు ఏ రకంగా సంసిద్ధం కావాలి.. ఏఏ అంశాలు చర్చకు వస్తాయి? అందుకోసం ఎలా సిద్ధం కావాలి.. అందుకు కావాల్సిన మెటీరియల్‌ను ఎలా సమకూర్చుకోవాలి? కీలక అంశాలపై చర్చ లేదా ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఎలా సిద్ధం కావాలి.. అని సమాలోచనలు చేయాలి. మనకు ముందు రోజే ఎజెండాలో ఏముంటుందో తెలిసి పోతుంది. అందువల్ల మనమంతా కూర్చుని సమాలోచనలు జరిపి ఎవరు ఏ అంశంపై మాట్లాడదల్చుకుంటే వారు ఆ మెటీరియల్‌ తీసుకోవాల్సి ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, శాసన మండలి ఛైర్మన్‌ ఎం.ఏ.షరీప్, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్య తదితరులు పాల్గొన్నారు.  

ప్రస్తుతం సభలో 23 మంది టీడీపీ సభ్యులున్నారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందాలంటే సభా బలంలో పది శాతం మంది సభ్యులు, అంటే 18 మంది ఉండాలి. ఇలాంటి తరుణంలో మన వాళ్లే చాలా మంది నాకు ఓ సలహా ఇచ్చారు. ఐదారుగురిని లాగేస్తే ప్రతిపక్షానికి ఆ హోదా కూడా ఉండదు కదా అన్నారు. మనకు, వాళ్లకు (టీడీపీ) తేడా ఉండాలి కదా.. అని నేను గట్టిగా ‘నో’ అన్నాను. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నుంచి ఒక ఎమ్మెల్యేను తీసుకోవాలనుకుంటే అతనితో ఆ పార్టీకి రాజీనామా చేయించాలి. తర్వాత ఆయన్ను ప్రజల్లోకి తీసుకెళ్లి మన పార్టీ గుర్తుపై గెలిపించుకోవాలి. ఆ తర్వాతే అతను మన ఎమ్మెల్యే అవుతాడు. వేరే పార్టీ నుంచి వస్తే రాజీనామా అయినా చేయించాలి లేదా అతడిని అనర్హుడిగానైనా ప్రకటించాలి. 

వాళ్లేం (ప్రతిపక్షం) మాట్లాడతారో మాట్లాడనిద్దాం. తర్వాత హేతుబద్ధంగా సమాధానం చెబుదాం. ఆ ధైర్యం, ఆ నమ్మకం మనకున్నప్పుడు మనమెందుకు భయపడాలి? ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు అని మనమెందుకు కుట్రలు పన్నాలి? ఆ అవసరమే లేదు. మన మీద మనకు నమ్మకం ఉంది. మన పాలన మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. అలాంటప్పుడు మనం ఎవరో లేస్తారని ఏదో మాట్లాడతారని భయపడాల్సిన పని లేదు. 

మనం తప్పు చేయనప్పుడే మరొకరికి చెప్పగలుగుతాం. అందుకే తప్పు చేయొద్దు.. అబద్ధాలు చెప్పొద్దు.. వాస్తవాలే మాట్లాడండి. విషయ అవగాహనతో సంసిద్ధులై రావాల్సిన పద్ధతిలో రండి. మాట్లాడాలనుకున్న వారు ఆర్థిక మంత్రి, చీఫ్‌ విప్‌ వద్దకు వెళ్లి పద్దతిగా చర్చలోకి రండి. అప్పుడే బాగా రాణిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement