
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తన బడ్జెట్ ప్రసంగంలో పలుమార్లు తడబడ్డారు. పలు పదాలను తప్పుగా ఉచ్ఛరించారు. సవాళ్లను.. శవాలు అని పలికారు. కొన్నిసార్లు చదివిన లైన్లే మళ్లీ చదివారు. కింది లైన్లను పైన, పై వాటిని కింద చదివి కలగాపులగం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించిన యనమల ఆదిలోనే పిల్లల బట్టల కుట్టుకూలిని.. కట్టుకూలి అంటూ తడబడ్డారు. ఆ పరంపర చివరి వరకు కొనసాగింది. చక్కటి జీవనాన్ని.. చీకటి అని సంభోదించారు.
యువతను యవత, కేటాయింపుల్ని కేటింపుగా చదివారు. చర్చీల నిర్మాణాన్ని చర్చల నిర్మాణాలుగా, ప్రమాదాన్ని ప్రధమంగా చదివారు. చివరకు ఆయన రోజూ ఉచ్ఛరించే దారిద్య్ర రేఖను, ప్రోత్సాహకాలను, కేంద్రీకృతం వంటి పదాలను సైతం తప్పుగా పలికారు. ఓ దశలో ఈ చర్య అనడానికి బదులు ఈ చర్మ అనేశారు. హాలిడేను హోలీడేగా, షీ టీమ్‌ను టీ టీమ్‌గా, వ్యవసాయాన్ని వ్యవస్థాగతంగా మార్చేశారు. దాదాపు 25 పదాలను ఆయన తప్పుగా చదివారు.