ఏ దేశమేగినా.. నిధులు మనవేగా!

World Bank Report on NRI's

2017లో ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే మొత్తం అంచనా రూ.4.25 లక్షల కోట్లు 

రెండేళ్ల తర్వాత రెమిటెన్సుల్లో వృద్ధి.. ప్రపంచ బ్యాంక్‌ నివేదికలో వెల్లడి 

అగ్రస్థానంలో కొనసాగనున్న భారత్‌.. రెండో స్థానంలో చైనా

యూఎస్, ఈయూ, రష్యా ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడంతో నిధుల ప్రవాహం

సాక్షి, అమరావతి: విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే నిధులు(రెమిటెన్సులు) మళ్లీ ఊపందుకోనున్నాయి. వరుసగా రెండేళ్లనుంచీ ప్రవాసీయుల నిధులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే 2017లో మాత్రం ఈ నిధుల్లో వృద్ధి నమోదు కానుందని, దాదాపు 65.4 బిలియన్‌ డాలర్ల(రూ.4.25 లక్షల కోట్లు)ను ఈ ఏడాది ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపనున్నారని ప్రపంచబ్యాంక్‌ తన అంచనాల్లో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ప్రవాసీయుల నిధుల ప్రవాహంలో 4.3 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను ప్రపంచబ్యాంక్‌ తాజాగా విడుదల చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థతోపాటు యూరోపియన్‌ యూనియన్, రష్యా ఆర్థిక వ్యవస్థలు కోలుకున్నందున రానున్న సంవత్సరాల్లోనూ నిధుల ప్రవాహం పెరుగుతుందని అభిప్రాయపడింది.

ప్రవాస భారతీయులు 2016లో 62.7 బిలియన్‌ డాలర్లు(రూ.4,07,550 కోట్లు) భారత్‌కు పంపారు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పట్నుంచీ భారత్‌కు వచ్చే రెమిటెన్సులు భారీగా పెరుగుతూ వచ్చాయి. 1991లో 2.10 బిలియన్‌ డాలర్లు (ప్రస్తుత విలువ ప్రకారం రూ.13,650 కోట్లు)గా ఉండగా.. 2014 సంవత్సరానికి 70.39 బిలియన్‌ డాలర్ల(రూ.4,57,535 కోట్లు) గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే అప్పట్నుంచీ వరుసగా రెండేళ్లుగా రెమిటెన్సులు తగ్గుతూ వస్తున్నాయి. భారత్‌కు అత్యధికంగా నిధులు వచ్చే యూఏఈలో ముడి చమురు ధరలు పడిపోవడంతో ఉపాధి అవకాశాలు దెబ్బతిని రెమిటెన్సులు బాగా తగ్గిపోయాయి.

అగ్రస్థానం మనదే... ఇదిలా ఉండగా ప్రవాసీయుల నుంచి అత్యధిక నిధులు పొందుతున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. 2017లో 65.4 బిలియన్‌ డాలర్ల(రూ.4.25 లక్షల కోట్లు)తో భారత్‌ మొదటిస్థానంలో, 62.9 బిలియన్‌ డాలర్ల(రూ.4,08,850 కోట్లు)తో చైనా రెండో స్థానంలో కొనసాగుతాయని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది. తర్వాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్‌(32.8 బిలియన్‌ డాలర్లు), మెక్సికో(30.5 బిలియన్‌ డాలర్లు), పాకిస్తాన్‌(22.3 బిలియన్‌ డాలర్లు) ఉంటాయని భావిస్తోంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల రెమిటెన్సులు 2016లో 573.6 బిలియన్‌ డాలర్లు(రూ.37,28,400 కోట్లు)గా ఉండగా.. అది 2017 నాటికి 595.7 బిలియన్‌ డాలర్ల(రూ.38,72,050 కోట్లు)కు, 2018 నాటికి 615.7 బిలియన్‌ డాలర్ల(రూ.40,02,050 కోట్లు)కు చేరుకుంటాయని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేస్తోంది. అయితే అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేయడం, గల్ఫ్‌ ప్రాంతాల్లో చిన్న స్థాయి కార్మికుల్లో ఉపాధి అవకాశాలు తగ్గడం ప్రవాస నిధుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని భావిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top