
పెళ్లయి ఏడాది నిండకుండానే..!
ఎన్నో ఊహలు..ఎన్నో ఆశలతో..సంసార జీవితాన్ని సంతోషంగా పండించుకోవాలని అత్తవారింట్లో అడుగుపెట్టింది ఆ యువతి.
విజయనగరం క్రైం : ఎన్నో ఊహలు..ఎన్నో ఆశలతో..సంసార జీవితాన్ని సంతోషంగా పండించుకోవాలని అత్తవారింట్లో అడుగుపెట్టింది ఆ యువతి. సంప్రదాయబద్ధంగా తనను కోడలిని చేసుకున్న అత్తింటి వారు జీవితాంతం కష్టపెట్టకుండా చూసుకుంటారని ఆశించిన ఆమెకు నిరాశే ఎదురైంది. వరకట్న వేధింపులు భరించలేక పెళ్లయి ఏడాది తిరక్కముందే ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి, పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామానికి చెందిన దంపతులు ఎం. మహేష్, లక్ష్మిలకు ఇద్దరు కుమార్తెలు శిరీష, జ్యోతి.
విజయనగరం పట్టణం సుద్దవీధికి చెందిన కార్పెంటర్ పని చేసుకుంటున్న కె.రవికుమార్‌కు శిరీష(19)ను ఇచ్చి గత ఏడాది ఆగస్టు 11న మహేష్ దంపతులు వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ.రెండు లక్షల క ట్నం, తులంన్నర బంగారు అభరణాలు, సారె సామన్లు అందించారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత నుంచి అల్లుడు రవికుమార్, కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధించారు. ఈ క్రమంలో శిరీష గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత కూతుర్ని తమ ఇంటికి పంపించాలని అల్లుడు రవికుమార్‌ను శిరీష తల్లిదండ్రులు కోరారు. శిరీషను కన్నవారింటికి పంపించేందుకు రవికుమార్ ఒప్పుకోలేదు. అత్తమామలు విజయనగరంలోనే కాపురం పెట్టి శిరీషను చూసుకోవాలని రవికుమార్ తెగేసి చెప్పినట్లు మృతురాలి తండ్రి మహేష్ తెలిపారు.
దీంతో అల్లుడు నివాసం ఉంటున్న వీధికి దగ్గరలోనే మహేష్ కుటుంబస భ్యులు ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సుమారు నెల కిందట శిరీషకు బాలుడు జన్మించాడు. మంగళవారం ఉదయం శిరీషను, బాలుడిని తమ ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి రవికుమార్‌తో పాటు అతని తల్లి మహేష్ ఇంటికి వచ్చారు. ఆషాఢమాసం మీ ఇంటికి తీసుకువెళ్లకూడదని శిరీష తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. అయితే ఇంటికి తీసుకువెళ్లి మళ్లీ తీసుకువస్తామని అల్లుడు,తల్లి ఒత్తిడి తేవడంతో భర్తే, అత్తే కదా తీసుకువెళ్తున్నారని శిరీష తల్లిదండ్రులు ఒప్పుకుని పంపించారు. అయితే శిరీష సాయంత్రం వరకు తిరిగి కన్నవారింటికి చేరకపోవడంతో ఆమె తల్లి అల్లుడికి ఫోన్ చేసి ఇంటికి ఇంకా ఎందుకు పంపలేదని ప్రశ్నించింది. శిరీషను రిక్షాపై తల్లిదండ్రులు నివాసం ఉండే తూర్పుబలిజివీధికి రవికుమార్‌తోపాటు అతని అన్నయ్య తీసుకువచ్చారు.
ఇంటికి వచ్చిన శిరీష అమ్మా బాబు ఏడుస్తున్నాడు పాలు తీసుకురమ్మని బయటకు పంపించింది. ఈలోగా ఏం జరిగిందో ఏమోగాని బయటకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి శిరీష ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు చీరతో ఉరుపోసుకుంది. దీంతో నిర్ఘాంతపోయిన తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని 108కు సమాచారం అందించి కేంద్రాస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపు శిరీష మార్గమధ్యంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న శిరీష బంధువులు బుధవారం జిల్లా కేంద్రాస్పపత్రికి చేరుకున్నారు. రవికుమార్ వేధింపుల వల్లే శిరీష మృతి చెందిందంటూ దాడిచేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టూటౌన్ పోలీసులు కేంద్రాసుపత్రికి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ
విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు కేంద్రాస్పత్రికి చేరుకుని మృతికి గల కారణాలను మృతురాలు తండ్రి మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు.
అత్తింటి వారి వేధింపుల వల్ల ఆత్మహత్య..
అత్తింటి వారి వేధింపుల వల్లే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని శిరీష తల్లిదండ్రులు ఆరోపించారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు బాగానే అందించినా ఇంకా అదనపు కట్నం కోసం వేధించేవారని వాపోయారు. అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్నయ్య అశోక్, సంధ్య, రవికుమార్ అక్క జయశ్రీ, బావ అప్పారావులు నిరంతరం అదనపు కట్నం కోసం వేధించే వారని ఆరోపించారు. శిరీష మృతికి కారకులైన వీరిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న సీపీఎంనాయకులు రెడ్డి శంకరరావు, రాకోటి ఆనంద్‌లు కేంద్రాస్పత్రికి చేరుకుని బాధితులకు అండగా నిలబడ్డారు. అదనపు కట్నం కోసం నిరంతరం వేధిస్తున్నారని శిరీష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని, ఆదిశగా పోలీసులు రవికుమార్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో నిందితులు ?
శిరీష ఆత్మహత్య చేసుకోవడంతో రవికుమార్‌తోపాటు మరో నలుగురిని కేంద్రాస్పత్రి వద్ద టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.