బతుకు భారమై కుటుంబంతో సహా...

Woman Commit Suicide Attempt With Her Mother And Two Sons In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఉగ్గుపాలతో లాలిపోసే కన్నతల్లే ఆ పసిబిడ్డలను భారంగా తలపోసింది. భర్త మరణంతో కుటుంబ పోషణ భారమై బతకడమే వ్యర్థమనుకుంది. తన ఇద్దరు బిడ్డలతో పాటు తల్లితో కలిసి పోలవరం కుడికాల్వలో దిగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో నాలుగు నెలల పసికందు ప్రాణాలు కోల్పోగా మిగిలిన ముగ్గురిని స్థానికులు కాపాడారు. వివరాలలోకి వెళితే.. మండలంలోని పోలసానిపల్లి పంచాయతీ శివారు ఆంజనేయనగర్‌ సమీపాన గల పోలవరం కుడి కాల్వలో శుక్రవారం ఓ మహిళ, తన తల్లితో పాటు తన ఇద్దరు మగ బిడ్డలతో సహా దిగి ఆత్మహత్యాయానికి పాల్పడింది. కాల్వలో ప్రవాహం పెద్దగా లేని కారణంగా ఆ ఇల్లాలితో పాటు ఆమె తల్లి, పెద్ద కుమారుడు బతికి బయట పడ్టారు. కానీ అభం శుభం తెలియని నాలుగు నెలల పసికందు కన్నుమూశాడు. 

భర్త మృతితో తీవ్ర మనస్తాపం
ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో జూనియర్‌ లైన్‌మెన్‌గా పనిచేసే చెలమాల నాగరాజు గత నెల 14న విధుల్లో ఉండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. భర్తను కోల్పోయిన భార్య చెలమాల శ్రావణి తీవ్ర మనస్తాపానికి గురైంది. నెల రోజులుగా తాను కూడా  భర్త వద్దకు వెళ్లిపోతానని, నేను లేకుంటే మా పిల్లలు సైతం అనాథలుగా మిగిలిపోతారని, భర్త చనిపోయిన ఏరియాలో ఆత్మహత్య చేసుకుని చనిపోతానని ఇంట్లో చెబుతోంది. శ్రావణి తల్లిదండ్రులు ఓదార్చుతూ మనోధైర్యాన్ని నింపుతున్నారు. శ్రావణి మానసికంగా కోలుకునేందుకు వీలుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు భర్త చనిపోయాక ఆర్థిక ఇబ్బందులు కూడా కుటుంబానికి ఎక్కువయ్యాయి. భర్త మృతి తర్వాత సంబంధిత విద్యుత్‌ శాఖ నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇంకా అందలేదు. దీంతో తీవ్రంగా కలత చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని స్థానికులు అంటున్నారు.  

ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తూ.. 
భర్త నాగరాజు చనిపోయాక నాలుగు నెలల మగబిడ్డ, ఏడాదిన్నర వయస్సు గల పవన్‌తో కలిసి శ్రావణి లింగపాలెం మండలం సింగగూడెంలోని తల్లిదండ్రుల ఇంట్లో నివాసముంటోంది. అయితే పెద్ద కుమారుడు పవన్‌కు జ్వరం రావడంతో శ్రావణి, తన తల్లితో పాటు ఇద్దరు పిల్లలను వైద్యం నిమిత్తం ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చింది. తిరిగి వెళుతూ పోలసానిపల్లి పంచాయతీ ఆంజనేయనగరం సమీపంలోని పోలవరం కుడి కాల్వ వద్దకు శ్రావణి తన తల్లిని, పిల్లలను తీసుకుని వచ్చింది. కుడి కాల్వ గట్టు వద్ద రేవులో శ్రావణి తన నాలుగు నెలల బిడ్డను, శ్రావణి తల్లి గంగ తన మనువడు పవన్‌ను ఎత్తుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కాల్వలో దిగారు. ఇక్కడే శ్రావణి తన చేతిని కత్తితో కోసుకుంది. అది చూసిన ఆమె తల్లి గంగ ఆపే ప్రయత్నం చేసింది. దీంతో తమ పిల్లలిద్దరిని కాల్వలో వదిలేశారు.

నాలుగు నెలల పసికందు నీరు తాగి ఊపిరిరాడక కన్నుమూసాడు. ఇదంతా చూస్తున్న స్థానికులు వారిని బయటకు రావాలని కేకలు వేశారు. అయినప్పటికీ పట్టించుకోలేదు. భీమడోలు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన ఎస్సై కె.శ్రీహరిరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రావణి చేతి నుంచి అధిక రక్తస్రావం కారడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె తల్లి గంగ, పవన్‌లు నీటితో మునిగిపోతుండగా పోలీసులు వారిని కాపాడి భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమడోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top