కౌంటింగ్‌ నుంచి ఆ వీవీప్యాట్‌లను తొలగిస్తాం

We will remove those VVPATS from counting - Sakshi

మాక్‌పోలింగ్‌లో స్లిప్పులను తొలగించని వీవీప్యాట్‌లను లాటరీ నుంచి మినహాయిస్తాం

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, అమరావతి: మాక్‌ పోలింగ్‌లో నమోదైన స్లిప్పులను తొలగించని వీవీప్యాట్‌లను ఓట్ల లెక్కింపునకు (లాటరీ ద్వారా ఎంపిక చేసినవి) తీసుకోబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వీవీప్యాట్‌ల లెక్కింపులో అనవసర సందేహాలు తలెత్తకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికల సమయంలో మాక్‌ పోలింగ్‌లో 50 ఓట్లు నమోదైన తర్వాత వాటిని తొలగించి సీఆర్సీ చేసి పోలింగ్‌ ప్రారంభించాల్సి ఉండగా కొన్ని చోట్ల వాటిని తొలగించకుండా పోలింగ్‌ కొనసాగించారని, దీనివల్ల ఈవీఎం, వీవీప్యాట్‌ ఓట్లకు తేడా వస్తుందని చెప్పారు.

ఇలాంటి వీవీప్యాట్‌లను లెక్కింపు నుంచి మినహాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు. శనివారం సచివాలయంలో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ చంద్రగిరి రీపోలింగ్‌పై పిటీషన్‌ దాఖలు కావడంతో వీడియో దృశ్యాలను కోర్టుకు అందచేశామని, సోషల్‌ మీడియాలో వస్తున్న దృశ్యాలు చంద్రగిరివి కావని ఆయన స్పష్టం చేశారు. మే 23లోపు ఎప్పుడైనా రీ–పోలింగ్‌ చేయవచ్చని, పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాతనే ఏడు చోట్ల రీ–పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రీపోలింగ్‌పై తనకు వచ్చిన ఫిర్యాదు పరిశీలించాలంటూ సీఎస్‌ లేఖ రాయడం ఎలా తçప్పవుతుందని ప్రశ్నించారు. 

పోస్టల్‌ బ్యాలెట్‌ జారీలో ఒక్కచోటే తప్పు 
పోస్టల్‌ బ్యాలెట్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ద్వివేది కొట్టిపారేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఒక్కచోట మాత్రమే ఒక ఉద్యోగికి రెండు ఓట్లు జారీ అయ్యాయని, ఇలా జారీ చేసిన ఓటులో ఒకటి వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్లపై ఫిర్యాదులు రావడంతో అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకొని పరిశీలించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన తర్వాతనే ఆర్వోలు ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌లో 200 మంది ఆర్వోలు, 200 మంది కేంద్ర పరిశీలకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top