
ఢిల్లీలో కూర్చుని రాజధానిపై మేం చెప్పలేం
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికే తాము నిర్ణయాధికారం వదిలేశామన్నారు. ఢిల్లీలో ఉండి తాము రాజధానిని నిర్దేశించలేమని, కానీ రాజధాని నిర్మాణానికి మాత్రం అవసరమైన సాయం చేస్తామని ఆయన తెలిపారు. ఇక కేరళ గవర్నర్ నియామకంపై చెలరేగిన వివాదాన్ని కూడా వెంకయ్య ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రాజ్యసభ ఎంపీగా నియమించిందని గుర్తు చేశారు.
అల్ఖైదాను తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచేస్తుందని ఆయన తెలిపారు. వంద రోజుల పాలనలో మోడీ ప్రభుత్వం వంద అడుగులు ముందుకు వేసిందని, దేశానికి నిర్ణయాత్మక ప్రధానిగా సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంపై తమకు ఎలాంటి వివక్ష లేదని, అయితే ఏపీ సర్కారు చురుగ్గా పనిచేస్తూ సహాయాన్ని పొందుతోందని వెంకయ్యనాయుడు చెప్పారు. నిబంధనల మేరకు తెలంగాణకు సహకరించేందుకు తాము సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీదే కీలకపాత్ర అని ఆయన మరోసారి చెప్పారు.