డిసెంబర్‌కు నీళ్లంట..!

Water From Veligonda Project In This December - Sakshi

కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త హామీ

టీడీపీ నాలుగేళ్ల పాలనలో టన్నెల్‌–1 తవ్వింది 2.5 కి.మీ.

వచ్చే ఏడున్నర నెలల్లో ఇంకాతవ్వాల్సింది 3.5 కి.మీ

మొత్తం 18 కి.మీ సొరంగం2014 నాటికే 13 కి.మీ పూర్తి

బాబు నోట పూటకో మాట

ముక్కున వేలేసుకుంటున్నజిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు

పూర్తికాని కొల్లంవాగుహెడ్‌ రెగ్యులేటర్‌  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వచ్చే డిసెంబర్‌ నాటికే టన్నెల్‌–1 పనులు పూర్తిచేసి వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా జిల్లాకు నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గురువారం నీరు–ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కందుకూరులో జరిగిన సభలో ఈ ప్రకటన చేశారు. గత నాలుగేళ్లలో వెలిగొండ నీటిని ఏడాదికొకమారు చొప్పున విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం తాజాగా వచ్చే డిసెంబర్‌కే వెలిగొండ నీరంటూ సరికొత్త ప్రకటన చేయడంపై జిల్లా వాసులే కాక అధికార పార్టీకి చెందిన  ప్రజాప్రతినిధులు, నేతలు సైతం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. గత నాలుగేళ్లుగా వెలిగొండ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల కాలంలో దాదాపుగా పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం రూ.204 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో పాత కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ప్రభుత్వానికి  పాత కాంట్రాక్టర్లకు మధ్య విబేధాలు తలెత్తాయి. పాత వారికి బిల్లులిచ్చి పనులను వేగవంతం చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా పాత కాంట్రాక్టర్లను తప్పించి కొత్తవారికి పనులు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. పనుల అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకొని రూ.234 కోట్ల టన్నెల్‌–1 పనులతో పాటు రూ.570 కోట్ల టన్నెల్‌–2 పనులకు ఇటీవలే టెండర్లు పిలిచింది.పాత కాంట్రాక్టర్లయిన షబీర్, షూ, ప్రసాద్, కోస్టల్, హెచ్‌సీసీకంపెనీలు కోర్టుకు వెళ్ళడంతో టెండర్ల వ్యవహారంపెండింగ్‌లో పడింది.

ఇప్పటి వరకు జరిగిన టన్నెల్‌ పనులు..
ఇప్పటి వరకు 18 కి.మీ. టన్నెల్‌–1 పనుల్లో 15.167 కిలోమీటర్లు, 18 కిలోమీటర్ల టన్నెల్‌–2 పనుల్లో 10.708 కిలోమీటర్లు పని మాత్రమే పూర్తయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి టన్నెల్‌–1లో 13 కి.మీ. మేర పని పూర్తయింది. ఇంకా 5 కి.మీకుపైనే పని పెండింగ్‌లో ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలో కేవలం రెండున్నర కి.మీ. మాత్రమే పని జరిగింది. చంద్రబాబు చెప్పినట్లు టన్నెల్‌–1 పనులను పూర్తిచేసి ఫేజ్‌–1లో వెలిగొండ ద్వారా నీరివ్వాలంటే ఇంకా 3 కి.మీ.కుపైనే టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. దీంతో పాటు రూ.100 కోట్ల నిధులతో చేపట్టిన కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. రాబోయే డిసెంబర్‌ అంటే ఏడున్నర నెలల కాలమే. ఏడున్నర నెలలో 3 కి.మీ. మేర టన్నెల్‌ తవ్వాల్సి ఉంది. ఇది ఎంత మేర సాధ్యమన్నది ప్రశ్నార్థకం. బాబు కొత్త హామీపై జిల్లా ప్రజలతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.

బాబు అధికారంలోకి వస్తూ్తనే 2016 నాటికి వెలిగొండ ద్వారా జిల్లాకు నీటిని విడుదల చేస్తామన్నారు. అప్పటి నుంచి  జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వెలిగొండ నీటి విడుదలకు కొత్త తేదీలను ప్రకటిస్తూనే ఉన్నారు. పనులు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. బాబు హామీలు నీటి మూటే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top