న్యాయం కావాలి..! | Sakshi
Sakshi News home page

న్యాయం కావాలి..!

Published Mon, Aug 31 2015 12:08 AM

న్యాయం కావాలి..!

ఆడపిల్లను కన్నందుకు అత్తింటివారి వెలి
పట్టించుకోని మహిళా పోలీస్ స్టేషన్
బాధితురాలి ఆవేదన

 
అల్లిపురం(విశాఖ): తన  కాపురం నిలపాలని ఒక వివాహిత పెద్దలు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఆడపిల్లను కన్నానని అత్తింటి వారు వెలివేశారని, మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌లో నివసిస్తున్న సీరపు లక్ష్మికి, బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన కొడిదాసు శ్రీనివాస్‌కు 2013లో అనకాపల్లిలో పెళ్లి జరిగింది. శ్రీనివాస్ హైదరాబాద్‌లో సెల్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. రూ.2 లక్షల కట్నం, బైకు, ల్యాప్‌టాప్, ఇతర లాంఛనాల కింద రూ.3 లక్షలు ముట్టజెప్పారు. లక్ష్మి 7వ నెల గర్భిణిగా ఉన్నప్పుడు కన్నవారి ఇంటి వద్ద వదిలి వెళ్లిన శ్రీనివాస్.. పాప పుట్టిందని తెలిసినా చూసేందుకు రాలేదు.

తరువాత భర్త, అత్త, ఆడపడుచు వచ్చి.. పాపను చంపేస్తామని బెదిరించి తనను వదిలించుకోవడానికి సంతకాలు పెట్టించుకున్నారని తెలిపింది. రాజాం గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టినా ఫలితం లేదని, ఆ అమ్మాయన్నా, కూతురన్నా ఇష్టం లేదని, అతను ఇంకో అమ్మాయితో కలిసి ఉంటున్నాడని చెప్పి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏప్రిల్‌లో మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో కౌన్సెలింగ్ చేసి భర్త ఇంటికి పంపారు. అక్కడ రెండు నెలల పాటు నరకాన్ని చూపించారని, తనను రాజాంలో వారింట్లో వదిలిపెట్టి అతను హైదరాబాద్ వెళ్లిపోయాడని చెప్పింది. దీంతో తాను తిరిగి తన తల్లి వద్దకు చేరుకుంది. ఇప్పటి వరకు అతను రాలేదని, పోలీసులు కూడా అతడిని పిలిపించటం లేదని ఆమె వాపోయింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరింది.
 
 

Advertisement
Advertisement