గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సీడీలను విడుదల చేశారు. వీఆర్‌ఓ పరీక్షలో జిల్లాకు చెందిన యెగానందరెడ్డి (హాల్ టికెట్ -112103198) 99 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. వీఆర్‌ఏ పరీక్షలో 97 మార్కులతో బోనాల ప్రభాకర్ (హాల్‌టికెట్ -312100031) రాష్ర్ట స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. జిల్లాలో ఫిబ్రవరి 2న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు నిర్వహించారు. 64 వీఆర్‌ఓ పోస్టులకు 61,073 మంది దరఖాస్తు చేసుకోగా 52,942 మంది పరీక్ష రాశారు. 167 వీఆర్‌ఏ పోస్టులకు 4,637 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,175 మంది పరీక్ష రాశారు.
సాక్షి మెటీరియల్ ఎంతో తోడ్పడింది
వీఆర్‌ఓ పరీక్షలో జిల్లా 6వ ర్యాంకర్ మనోహర్
తనకల్లు, న్యూస్‌లైన్ : వీఆర్‌ఓ పరీక్షకు సాక్షి స్టడీ మెటీరియల్ తనకు ఎంతో ఉపయోగపడిందని మనోహర్ పేర్కొన్నాడు. తనకల్లు మండలం గణాదివారిపల్లికి చెందిన మనోహర్ 96 మార్కులు సాధించి జిల్లాలో 6వ ర్యాంక్ సాధించాడు. మనోహర్ తల్లిదండ్రులు సుబ్బరాయుడు, రెడ్డెమ్మ. వీరు వ్యవసాయం చేస్తు జీవనం గడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా మనోహర్ పెద్దవాడు. తమ్ముడు హేమకుమార్ టైలరింగ్ చేస్తున్నాడు. మనోహర్ ఎంఎస్‌సీ, బీఈడీ చేశాడు. 2008లో నిర్వహించిన డీఎస్‌సీలో అర్ధ మార్కు తక్కువ రావడంతో ఎంపిక కాలేదు.
అయినా నిరాశ చెందకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. వీఆర్‌ఓ పరీక్షలో ర్యాంక్ సాధించిన మనోహర్‌ను పలువురు అభినందించారు. వీఆర్‌ఓ ఉద్యోగం చేస్తూ.. మరిన్ని పోటీ పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని మనోహర్ తెలిపాడు. తల్లిదండ్రుల కష్టం, తమ్ముడి ఆర్థిక సాయం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పాడు.
25న మెరిట్ జాబితా : కలెక్టర్
మెరిట్, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా జిల్లాలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తామని కలెక్టర్ లోకేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వీఆర్‌ఓ పోస్టులకు జిల్లా స్థాయిలో రూపొందించిన జనరల్ మెరిట్ లిస్ట్, వీఆర్‌ఏ పోస్టులకు జిల్లా స్థాయితో పాటు గ్రామ స్థాయి జనరల్ మెరిట్ లిస్ట్‌లను ఏపీపీఎస్సీ వారు పంపినట్లు తెలిపారు.