ఏసీబీ వలలో దున్నవూరు వీఆర్వో

VRO Caught By ACB For Taking Bribe - Sakshi

సాక్షి, మందస(శ్రీకాకుళం) : ఇటీవల సోంపేట మండలం బారువ ఇన్‌చార్జి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మరువక ముందే తాజాగా మందస మండలం దున్నవూరు గ్రామ రెవెన్యూ అధికారి కిల్లి ప్రసాదరావు అడ్డంగా దొరికిపోయారు. రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. ఈ ఘటన రెవెన్యూ వర్గాల్లో అవినీతిపరులను చెమటలు పట్టించింది. మండల చరిత్రలో తొలి ఏసీబీ కేసు నమోదైంది. మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన దున్నవూరు గ్రామ రెవెన్యూ అధికారి కిల్లి ప్రసాదరావు పని చేస్తున్నారు. మూణ్నెల్ల క్రితం కోటబొమ్మాళి మండలం నుంచి డిప్యూటేషన్‌పై ఇక్కడకు వచ్చారు. భేతాళపురం పంచాయతీకి కూడా ఇన్‌చార్జి వీఆర్వోగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భేతాళపురం పంచాయతీలోని సిగలపుట్టుగ గ్రామానికి చెందిన చీగటి షణ్ముఖరావు తనకున్న 96 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు రుణ నిమిత్తం ఆశ్రయించాడు.

స్థలానికి సంబంధించిన ఎల్‌పీసీ(ల్యాండ్‌ పొజిషన్‌ సర్టిఫికెట్‌) కావాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో మందస తహసీల్దార్‌ కార్యాలయంలో షణ్ముఖరావు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ఫైల్‌ వీఆర్వో వద్దకు వెళ్లగా, రూ.4 వేలు డిమాండ్‌ చేసినట్టు ఆరోపిస్తూ, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ విజయనగరం డీఎస్పీ (శ్రీకాకుళం ఇన్‌చార్జి) బీవీఎస్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం సీఐలు భాస్కరరావు, హరి, విజయ్, మహేశ్, సిబ్బంది మోహనరావు, రామారావు, రాము, రమేష్‌ తదితరులు బుధవారం అవినీతి చేపను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా షణ్ముఖరావు వీఆర్వోకు లంచం ఇవ్వడానికి ఫోన్‌ చేశాడు. మందస పట్టణంలోని భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద కలవాలని వీఆర్వో చెప్పడంతో ఏసీబీ అధికారులకు సమాచారం చేరవేశాడు.

అక్కడ రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా, అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, ఫింగర్‌ ప్రింట్స్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ సొంత స్థలం కోసం పొజిషన్‌ సర్టిఫికెట్‌కు షణ్ముఖరావు నుంచి రూ.4 వేలు లంచం డిమాండ్‌ చేశారని, పక్కా ప్రణాళికతో వీఆర్వో కిల్లి ప్రసాదరావును పట్టుకున్నామని, విశాఖపట్నం ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఇదిలాఉంటే మందస మండలంలో కొంతమంది అధికారులు, సిబ్బంది అవినీతిపై ప్రచారం సాగుతున్నప్పటికీ, ఇంతవరకు బాధితులు బయట పడలేదు. తహసీల్దార్‌ కార్యాలయంపై పలు ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో ఏసీబీ వలలో వీఆర్వో చిక్కుకోవడంతో వీరి వెన్నులో వణుకు పుట్టింది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top