
ఆమె అమృత వర్షిణి.. శ్రీవారు అసావేరి..
ఆమె అమృత వర్షిణి.. శ్రీవారు అసావేరి.. ఆ కాపురమే కల్యాణి. కర్ణాటక సంగీత విద్వన్మణి..వ్యాఖ్యాన శిరోమణి జంటగా పండిస్తున్న సంగీత సాహిత్య సిరి ఆ సంసారం.
ఆమె అమృత వర్షిణి.. శ్రీవారు అసావేరి.. ఆ కాపురమే కల్యాణి. కర్ణాటక సంగీత విద్వన్మణి..వ్యాఖ్యాన శిరోమణి జంటగా పండిస్తున్న సంగీత సాహిత్య సిరి ఆ సంసారం. సుమధుర గాన సుధామణి మండ సుధారాణి..వృత్తి వైద్యమే అయినా సంస్కృతీ సంస్కృతాభిమానాన్ని అణువణువునా పెంచుకున్న డాక్టర్ రామప్రసాద్..ఆ కపుల్ ఈ వారం యూ అండ్ ఐలో మనల్ని పలకరిస్తున్నారు. సరిగమల మధురిమలు చిలకరిస్తున్నారు.
సంగీత సాహిత్యాలపై ఉన్న అభిరుచే తమని కలిపిందని, సంప్రదాయ కళలకు ప్రాణమిచ్చే కుటుంబం తమదని స్టీల్‌ప్లాంట్‌లో అనస్తటిస్ట్ రామప్రసాద్, కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధారాణి తెలిపారు. తమది ప్రేమ వివాహమని, ఇరువైపులా పెద్దలు అంగీకరించడంతో తమ ప్రేమప్రయాణం వివాహబంధంలోకి అడుగిడిందన్నారు.
సుధారాణి : మాది సంగీత సాహిత్యాలకు ప్రాధాన్యమిచ్చే విజయనగరం. నాన్నగారు ఎమ్మార్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్. మా నాన్నగారి మేనత్తలు, మా మేనత్త కూడా పాటలు పాడేవారు. మూడో జనరేషన్‌లో నేను సంగీతం నేర్చుకున్నాను. రామప్రసాద్ కుటుంబం కొన్నేళ్లు విజయనగరంలో ఉంది. నేను, రామప్రసాద్ చెల్లి క్లాస్‌మేట్స్. ఇద్దరం సంస్కృతం ఒక మాస్టారి వద్దే నేర్చుకున్నాం. నా పదహారో ఏట ఆలిండియా లెవెల్లో రేడియో పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాను. విశాఖపట్నం వచ్చి ఇవటూరి విజయేశ్వరరావుగారి వద్ద సంగీతం నేర్చుకున్నాను.
రామప్రసాద్ : మేము నాన్నగారి ఉద్యోగరీత్యా విజయనగరం నుంచి బొబ్బిలి వెళ్లిపోయాం. 1980లో నేను ఏఎంసీలో మెడిసిన్ చేయడానికి వైజాగ్ వచ్చాను. అప్పుడే తను కచేరీలు చేసేది. నాకు సంగీతంపై ఆసక్తి ఉండడంతో కచేరీలకు వెళ్లేవాడిని. ముందే పరిచయం ఉండడంతో ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం. అప్పుడే తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 1984లో పెళ్లి ప్రతిపాదనను ఆమె ముందు పెట్టాను.
సుధారాణి : ముందు నుంచీ ఆయన గురించి తెలియడం, కుటుంబాల మధ్య పరిచయం ఉండడంతో నేను వెంటనే అంగీకరించాను. కెరీర్‌లో కొంచెం సెటిల్ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిద్దామనుకున్నాం. తర్వాత ఇద్దరం పెద్దవాళ్లకు చెప్పాం.
రామప్రసాద్ : పీజీలో చేరాక పెళ్లి చేసుకుందామనుకున్నాం. సుధ కూడా రేడియోలో గ్రెడేషన్‌కు అప్లై చేసింది. పీజీ ఎంట్రన్స్ టెస్ట్ సుమారు రెండున్నరేళ్లు నిర్వహించకపోవడంతో దానితో ముడిపడి ఉన్నవన్నీ ఆలస్యం అయ్యాయి. కచేరీల్లో మేమిద్దరం కలిసేవాళ్లం. 1989 ఆగస్టు 9న మా వివాహమైంది.
సుధారాణి : ఈయనకు స్టీల్‌ప్లాంట్‌లో అనస్తటిస్ట్‌గా అవకాశం రావడంతో మేం స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. మా అత్తగారు వాళ్లు మాతో ఉండడంతో పాప పుట్టిన తర్వాత కూడా ఇబ్బందేమీ అనిపించలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరం పాప దగ్గర తప్పనిసరిగా ఉండేవాళ్లం. నేను కచేరీకి వెళ్లినా ఈయన పాప బాధ్యత తీసుకునేవారు. వీరికి సాహిత్యంపై మంచి పట్టు ఉంది. కల్యాణ వేదికలపై హైందవ వివాహ ప్రాశస్త్యాన్ని తెలిపే ఆయన వ్యాఖ్యానం అందర్నీ అలరిస్తుంది.. ఆయన చిన్నతనంలో ఐదారేళ్లు సంస్కృతం నేర్చుకోవటంతో ఆయన వ్యాఖ్యానం ఆకట్టుకుంటుంది. సంగీతంలోను ఆయనకు ప్రవేశం ఉండటం విశేషం. దాదాపు 70 రాగాల వరకు పోల్చగలరు. రాగయుక్తంగా పద్యాలు గానం చేస్తారు. నాకు సాహిత్యంలో ఏదైనా డౌట్ వస్తే ఆయన్ని అడుగుతాను, సంగీతంలో ఏ పద్యం ఎలా పాడాలి అని ఆయన నన్ను అడుగుతారు. అలా ఇద్దరం ఒకరికొకరం సమన్వయం చేసుకుంటాం.
రామప్రసాద్ : నాకు సాంస్కృతిక కార్యక్రమాలంటే చాలా ఆసక్తి. స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కునగరం గానసభకు తొమ్మిదేళ్లు కల్చరల్ సెక్రటరీగా ఉన్నాను. తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ కచేరీలు, హరికథలు, భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ .. అలా దాదాపు 180 నుంచి 190 వరకు కార్యక్రమాలు నిర్వహించాను. మే 26, 2002లో అన్నమయ్య సంకీర్తనలపై కూచి సాయిశంకర్‌తో కలిసి చేసిన గాత్ర చిత్ర సమ్మేళనానికి మంచి స్పందన వచ్చింది.
సుధారాణి : స్టీల్‌ప్లాంట్‌లో మంచి వాతావరణం ఉండేది. మా పాప ప్రత్యూష శ్రుతి రవళికి ఇవన్నీ బాగా ఉపకరించాయి.
రామప్రసాద్ : మా పాప చిన్నప్పుడే మేమొక నిర్ణయం తీసుకున్నాం. తనను తెలుగు మీడియం పాఠశాలలోనే చదివించాలని...ఎందుకంటే మాతృభాషలో భావ వ్యక్తీకరణ సులువవుతుంది. సహజ సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి.
సుధారాణి : తన చదువు విషయంలో చాలా శద్ధ తీసుకునేవాళ్లం. నేను లెక్కలు చెబితే మిగిలిన సబ్జెక్ట్స్ ఆయన చెప్పేవారు. రోజూ రెండు గంటలు కచ్చితంగా పాపకు చదువు చెప్పేవారు.
రామప్రసాద్ : పాపకు ఆసక్తి ఉన్న రంగంలోనే ప్రోత్సహించాలనుకున్నాం. వయొలిన్ నేర్పించాం. సంగీతం నేర్చుకుంది. 2012లో స్వరసమరంలో ఫస్ట్‌ప్రైజ్ వచ్చింది. 2013లో నాద్‌భేద్ కార్యక్రమంలో కర్ణాటక సంగీతంలో ఆలిండియా లెవెల్లో బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. ఇప్పుడు చెన్నైలో ఎంఏ మ్యూజిక్ చేస్తోంది. సుధ, శ్రుతి రవళి కలిసి దాదాపు 50 నుంచి 60 కచేరీలు చేశారు.
సుధారాణి : నాకు పెద్ద సమస్య అనిపించింది...ఆయన సింపుల్‌గా సాల్వ్ చేస్తారు. ఆయనకు పెద్ద ఇష్యూ అనిపించిన అంశాన్ని నేను టేకప్ చేస్తాను. నేను చేస్తానన్న పని ఆయన వద్దు అన్నారంటే తన భార్యను కాబట్టి అలా చెప్పడం లేదు.. ఏదో కారణం ఉండి ఉంటుంది అని ఆలోచిస్తాను. తను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నేను చేయడం మానేస్తాను. లేదంటే ఆయనకు మళ్లీ వివరించి ఆ పని చేస్తాను.
రామప్రసాద్ : ఇది నేను చేయాల్సిన పని, ఇది తను చేయాల్సిన పని అని అనుకోకుండా ఎవరికి వీలున్న పని వాళ్లం చేసేస్తాం. తను లేనప్పుడు నేను ఇంటి పనులు చేస్తాను, నేను లేనప్పుడు తను బయటిపనులన్నీ చేసుకుంటుంది. మా ఇద్దరిదీ ఒకే మాట. నాకు కొంచెం కోపం ఉన్నా తను ఓపిగ్గా ఉంటుంది. దాదాపు అన్ని విషయాల్లో ఇద్దరి అభిప్రాయం ఒకటే కావడంతో మా దాంపత్యజీవనం ఆనందంగా సాగిపోతోంది.