ముంపు గ్రామాలు బిక్కుబిక్కు | Sakshi
Sakshi News home page

ముంపు గ్రామాలు బిక్కుబిక్కు

Published Sun, Oct 14 2018 2:29 AM

Villages are in dark at Andhra Pradesh with effect of Titli cyclone - Sakshi

(శ్రీకాకుళం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : గాఢాంధకారంలో ఎప్పుడు ఏ పాములు వచ్చి కాటేస్తాయో? ఏ విష పురుగులు కరుస్తాయోననే భయంతో వారు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు, ఉప్పు లాంటి నిత్యావసర సరుకులు తుపాను నీటిలో మట్టికొట్టుకుపోయాయి. చుట్టూ వరద నీరున్నా తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకని దుర్భరమైన పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో ‘తిత్లీ’ ముంపు బాధిత గ్రామాల ప్రజలు రెండు మూడ్రోజులుగా అనుభవిస్తున్న నరకయాతన ఇది. వర్షం పూర్తిగా ఆగిపోయి రెండ్రోజులైనా.. వరదనీరు కొంత తెరిపిచ్చినా కనీసం మంచినీరుగానీ, నిత్యావసర సరుకులుగానీ.. ఆహార పదార్థాలుగానీ అందని దుర్భర పరిస్థితి వారిది. 12వ తేదీ మధ్యాహ్నానికే వర్షం ఆగిపోయినా వంశధార, నాగావళి ముంపు ప్రాంతాలు, టెక్కలి నియోజకవర్గంలోని చాలా పల్లెల వైపు శనివారం సాయంత్రం వరకూ అధికారులు దృష్టిసారించలేదు. తమ గ్రామాలకు ఇప్పటివరకూ ఏ ఒక్క ప్రజాప్రతినిధిగానీ, అధికారిగానీ రాలేదని నందిగామ మండలం ఉయ్యాలపేట, టెక్కలి మండలం గంగాధరపేట తదితర గ్రామాల వారు ‘సాక్షి’తో తమ ఆవేదనను పంచుకున్నారు.  

పొంచి ఉన్న వ్యాధుల ముప్పు 
తిత్లీ తుపానువల్ల ఎగువ ప్రాంతమైన ఒడిశాలో కురిసిన భారీ వర్షాలతో వంశధార, నాగావళితోపాటు ఉద్దానంలో వాగులు, వంకలు, గెడ్డలు ఉప్పొంగడంతో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, నందిగామ, సురుబుజ్జిలి, కవిటి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర మండలాల్లోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్నిచోట్ల రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంవల్ల రవాణా సౌకర్యం తెగిపోయింది. వరదనీటితో బావులు, బోర్ల నీరు కలుషితమై బుదరమయంగా మారింది. కనీసం క్లోరినేషన్‌కు కూడా దిక్కులేదు. ఈ నీరు తాగితే డయేరియా, కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిసినా విధిలేని పరిస్థితుల్లో బాధితులు వాటినే ఆశ్రయిస్తున్నారు. పొలాల్లోనూ, రహదారులపైనా నీరు ఎక్కువ రోజులు నిలిచిపోవడం.. కూలిన చెట్ల ఆకులు, అలములు వాటిలో కుళ్లిపోవడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఫలితంగా దోములు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటివల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

ఎప్పుడేం కాటేస్తుందో?
కుండపోత వర్షాలతో వంశధార, నాగావళి.. ఇతర వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో అడవుల్లోని పాములు పెద్ద సంఖ్యలో కొట్టుకువచ్చాయి. ఇవి ఇళ్లలోకి వచ్చి ఎక్కడ కాటేస్తాయోనని ముంపు గ్రామాల వారు బెంబేలెత్తిపోతున్నారు. విద్యుత్‌ పునరుద్ధరణ ఇంకా జరగకపోవడంతో టెక్కలి లాంటి పట్టణంతోపాటు అనేక గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. అలాగే, విష పురుగులు వణికిస్తున్నా కనీసం తమకు కొవ్వొత్తులు ఇచ్చే నాధుడులేడని బాధితులు చెబుతున్నారు. చీకటి పడ్డాక బయటకు వెళ్లాలంటే ఏ పురుగు, ఏ పాము కాటేస్తాయోనని భయమేస్తోందని గంగాధరపేటకు చెందిన ఒక వృద్ధుడు అన్నాడు.  

మంచి నీరైనా అందించండి బాబూ.. 
ఇదిలా ఉంటే.. తమకు కనీసం మంచినీరైనా అందించాలని ముంపు గ్రామాల వారు చేతులెత్తి వేడుకుంటున్నారు. గెడ్డలు, బావుల్లో నీరు తాగాలంటే భయమేస్తోందని.. ఒక్కో ఇంటికి ఒక్కో టిన్ను (రక్షిత) నీరైనా అందించాలంటున్నారు. కొందరు మట్టి నీరు తాగలేక రెండు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి బోరు నీటిని కావడిపై తెచ్చుకుంటున్నారు. ప్రతి ఇంటికీ 25 కిలోల (మత్స్యకారులకు  50 కిలోలు) బియ్యం, కందిపప్పు, వంట నూనె, చింతపండు తదితర నిత్యావసర సరుకులు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా అవి ఎక్కడా అందిన దాఖలాల్లేవు. మరోవైపు.. టెక్కలి మండలంలోని గంగాధరపేటకు వెళ్లే రహదారి వరదతో కొట్టుకుపోయింది. దీంతో టెక్కలి–నౌపడ మధ్య రైలు మార్గం కూడా దెబ్బతింది. దీనివల్ల గంగాధరపేటకు రాకపోకలు తెగిపోయాయి. గ్రామస్తులు నిత్యావసర సరుకులు, తాగునీటికి అష్టకష్టాలు పడుతున్నారు. నందిగామ మండలంలోని ఉయ్యాలపేట వాసులదీ ఇదే దుస్థితి. పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి తదితర మండలాల్లో ఇలాంటి గ్రామాలు అనేకం. ఈ గ్రామాలకు కూడా ఇప్పటివరకూ అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు గానీ వెళ్లి బాధితులను పరామర్శించి సహాయ చర్యలు చేపట్టలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు 
తాగునీరు, నిత్యావసరాల కోసం గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. మా గ్రామంలోకి శనివారం రాత్రి వరకూ ఎవ్వరూ రాలేదు. లంచాలు తీసుకుని ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువుల ఏర్పాటుకు సహకారం అందించి మమ్మల్ని ముంపులో పడేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇప్పుడు మాలాంటి పేదల కష్టాలు కనిపించడంలేదు.     
– లండ శ్రీకాంత్, నందిగామ మండలం, ఉయ్యాలపేట 

Advertisement

తప్పక చదవండి

Advertisement