తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా.. | Sakshi
Sakshi News home page

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..

Published Sat, Aug 17 2019 12:38 PM

Vigilance Officers Inspecting On Granite Quarries In Prakasham - Sakshi

సాక్షి, ప్రకాశం : మైన్స్‌ అధికారులు కళ్లు మూసుకున్నారు. ఏపీఎండీసీ అధికారులు అక్రమార్కులకు సహకారం అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు చేయూతనిచ్చింది. పరిస్థితులు ఇంత చక్కగా కలిసి వస్తే గ్రానైట్‌ యజమానులు ఊరుకుంటారా..? అందుకే తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. కలిసొచ్చిన కాలాన్ని ఒక్క రోజు కూడా వృథా చేయకుండా అడ్డగోలుగా తవ్వుకున్నారు. హద్దులు దాటిన అక్రమ తవ్వకాలు ఇప్పుడు విజిలెన్స్‌ అధికారుల దాడులలో బహిర్గతమవుతున్నాయి. గడచిన నెల రోజులుగా రామతీర్థం, చీమకుర్తి పరిధిలో ఉన్న గ్రానైట్‌ క్వారీలలో తనిఖీలు చేస్తున విజిలెన్స్‌ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడుతున్నాయి. క్వారీ యజమానుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా రాజీ పడకుండా పార్టీలకతీతంగా గత నెల 16వ తేదీ నుంచి విజిలెన్స్‌ ఏఎస్‌పీ ఆధ్వర్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహిస్తున్నారు. మైన్స్‌ అధికారులు క్వారీల యజమానులకు ఇచ్చిన అనుమతులకు మించి తవ్వుకోవడం వలన రాళ్ల నిల్వల్లో భారీ తేడాలు బయట పడుతున్నాయి.

తవ్వి తీసిన రాళ్లకు, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించిన రాళ్లకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఒక క్వారీ యజమాని నెలకు 3 వేల క్యూబిక్‌ మీటర్లు రాయిని తీశారు. దానిలో ప్రభుత్వానికి కేవలం వెయ్యి క్యూబిక్‌ మీటర్లుకు మాత్రమే రాయల్టీ చెల్లించారు. మిగిలిన 2 వేల క్యూబిక్‌ మీటర్లు రాయిని అడ్డదారిలో రాయల్టీ లేకుండా చెలామణి చేసుకున్నారు. కానీ, విజిలెన్స్‌ అధికారుల దాడులలో అలా రాయల్టీ చెల్లించని ఆ రెండు వేల క్యూబిక్‌ మీటర్లు రాయికి ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీ ధరతో పాటు ఆ రాయికి మార్కెట్‌ విలువ ఎంతయితే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఫైన్‌గా వేసే పరిస్థితి ఉంది. అలా అడ్డదారిలో మొత్తం క్వారీలలో తవ్వి తీసుకున్న రాయి మొత్తాన్ని లెక్కలు కడితే దాదాపు రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

పొంతన లేని గణాంకాలు..
రామతీర్థం క్వారీలలో జరుగుతున్న విజిలెన్స్‌ అధికారుల తనిఖీలలో పొంతనలేని గణాంకాలు బయటపడుతున్నాయి. క్వారీలో తవ్వి తీసిన రాళ్ల పరిమాణానికి, రికార్డులలో నమోదు చేసి ఉన్న రాళ్లకు పొంతన కుదరటం లేదనే వాస్తవాలు బయటపడుతున్నాయి. క్వారీలో రాయిని తీసిన గుంతలో 10–15 శాతం మాత్రమే రికవరీ వస్తుందని, మిగిలిందంతా వేస్ట్, డస్ట్‌గాను డంపింగ్‌లలో పోస్తామని యజమానులు చెబుతున్నారు. కానీ వేస్ట్, డస్ట్‌ రూపంలో పోగా రికవరీ వచ్చేటువంటి 15 శాతం రాళ్ల లెక్కలు కూడా సక్రమంగా లేవనేది తనిఖీ చేసే అధికారుల వాదన. రికవరీ వచ్చేటువంటి రాళ్లలో దాదాపు సగానికి పైగా రాళ్లకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా అడ్డదారులలో స్థానిక ఫ్యాక్టరీలకు, అలవెన్స్‌ల పేరుతో రాయల్టీకి పంగనామాలు పెడుతున్నట్లు అధికారుల తనిఖీలలో బట్టబయలైంది. స్టాకులో తేడాలు ఎక్కువుగా ఉండటంతో ఇటీవల రెండు మూడు క్వారీలలో పెద్ద పెద్ద గ్రానైట్‌ బ్లాకులను డంపింగ్‌లలో పెట్టి పైన మట్టిపోసి కప్పెట్టినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే కొన్ని క్వారీలలో మైనింగ్‌ ప్లాన్‌ ప్రకారం తవ్వకుండా ఎక్కడ రాయి వస్తే అక్కడ తవ్వుకున్నట్లు, కొన్ని చోట్ల సరిహద్దులను కూడా దాటి ఇతర క్వారీలు లేనిచోట వారికి నచ్చినట్లు తవ్వుకున్నట్లు తనిఖీలలో బయటకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే క్వారీలలో పనిచేసే సిబ్బందికి భద్రత, వైద్యం, సంక్షేమ వంటి అంశాలను పూర్తిగా గాలికొదిలేసినట్లు దాడులలో తేటతెల్లమైంది. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వివరాలను లేబర్‌ డిపార్టుమెంట్‌ అధికారులు సేకరించాల్సి ఉంటుంది. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న విజిలెన్స్‌ అధికారుల దాడులు ఈనెలాఖరకు పూర్తయ్యే అవకాశం ఉంది. తనిఖీలన్నీ పూర్తయ్యాక నివేదకను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement