పాపం.. పాస్టర్ | unknown persons attacks on pastor | Sakshi
Sakshi News home page

పాపం.. పాస్టర్

Jan 12 2014 1:10 AM | Updated on Sep 2 2017 2:31 AM

గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన పాస్టర్ సంజీవులు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది.

 చాదర్‌ఘాట్, న్యూస్‌లైన్: గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన పాస్టర్ సంజీవులు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఆయన్ను కుటుంబసభ్యులు శనివారం మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కిడ్నీగ్లాడర్, లివర్, పెద్దపేగు, అవయవాలు పూర్తిగా పనిచేయడం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో పాస్టర్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలుసుకున్న పలు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.

 నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ అధ్యక్షుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై  బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్లపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. దాడులు అమానుషమని, క్రిస్టియన్లకు రక్షణ కల్పిం చలేని సీఎం డౌన్‌డౌన్ అని నినదించారు.జాతీయ రహదారిపై ఆందోళన నేపథ్యంలో కోఠి, దిల్‌సుఖ్‌నగర్  మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయిం ది.

 అన్నివిధాలా ఆదుకుంటాం: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి
 దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన పాస్టర్ సంజీవులును,ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, ఖర్చులు కూడా భరిస్తుందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి హామీఇచ్చారు. సంజీవులును పరామర్శించి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీఇచ్చారు.

 దాడులు అమానుషం: బ్రదర్ అనిల్‌కుమార్
 పాస్టర్ సంజీవులుపై దాడిని మత ప్రబోధకులు బ్రదర్ అనిల్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తూ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంజీవులు ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన ప్రార్థన చేశారు.
 సంజీవులను పరామర్శించిన వారిలో మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, సినీహీరో రాజా, తెలంగాణ క్రిస్టియన్స్ సంఘాల సంయుక్త ప్రధానకార్యదర్శి జెరూసలేం ముత్తయ్య, రంగారెడ్డి,హైదరాబాద్ వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ నాయకుడు రవి, విరాజీ, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement