ఉంగుటూరు.. ఆ దారే వేరు..

Unguturu Constituency Review - Sakshi

సాక్షి, భీమడోలు(ఉంగుటూరు) : నియోజకవర్గం 1967లో ఆవిర్భవించింది. అంతకుముందు తొలుత 1955లో అలంపురం నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పెంటపాడు నియోజకవర్గంలో ఉండేది. 1967లో ఉంగుటూరు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009 పునర్విభజనకి ముందు పూర్తి మెట్టప్రాంతంగా ఉండేది. పునర్విభజన తర్వాత భీమడోలు, ఉంగుటూరు మండలాలకు డెల్టా మండలాలైన నిడమర్రు, గణపవరం మండలాలను కలపడంతో మెట్ట, డెల్టా మేలుకలయికగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన కొల్లేరు ప్రాంతం నియోజవర్గంలోనూ విస్తరించి ఉంది.

భౌగోళిక స్వరూపం  
గ్రామాలు : 81 
సాగు విస్తీర్ణం : 27,064హెక్టార్లు 
ఆక్వా సాగు విస్తీర్ణం : 14,474
ప్రధాన పంటలు  : వరి, మొక్కజొన్న,చెరకు, అపరాలు మెట్ట. ఇదీ ఉంగుటూరు నియోజకవర్గం ముఖచిత్రం.

    
నియోజకవర్గంలో మండలాలు:భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు, గణపవరం
జనాభా : 2,66,139
పురుషులు:1,19,070
స్త్రీలు:1,47,069
ఓటర్లు : 1,93,475
పురుషులు:96,241
స్త్రీలు:97,221
ఇతరులు:13

రాజకీయ ప్రత్యేకత 
ఉంగుటూరు నియోజవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందనే భావన బలంగా ఉంది. అలాగే చరిత్రను చూస్తే ఒకసారి గెలిచిన వారు రెండోసారి విజేతలైన దాఖాలాలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చింది. దీంతో వరుసగా 2004, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వట్టి వసంతకుమార్‌ గెలుపొందారు. 


రాజకీయ చైతన్యం ఎక్కువ
ఈ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే, విద్యావేత్త, విద్యాదాత  చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా వాటిలో ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన  రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.  భీమడోలు మండలం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురానికి చెందిన వట్టి వెంకటరంగ పార్థసారథి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. వీవీఆర్‌ పార్థసారథి తనయుడు వట్టి వసంతకుమార్‌ దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రధాన అనుచరుడు. ఆయన ఆశీస్సులతో 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రెండో సారి గెలిచి రాష్ట్ర మంత్రిగా పని చేశారు.  

కాంటూరు హామీకి తూట్లు 
కొల్లేరు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ప్రాంత పరిరక్షణకు గత ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు.  కొల్లేరులోని అభయారణ్యం పరిధి ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు కుదించి తీరుతానని, మిగిలిన భూములు పేదలకు పంచుతానని స్పష్టం చేశారు. కొల్లేరులోని 9 మండలాల్లో ఐదో కాంటూరు దిగువన గల 77138 ఎకరాల్లో చేపల చెరువులను కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వసం చేశారు.

అయితే ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తే 14,861 ఎకరాల మిగులు భూములు ఉంటాయి. వాటన్నింటినీ పేదలకు పంచుతానని పేర్కొన్నారు. అయితే ఈ హామీకి చంద్రబాబు తూట్లు పొడిచారు. జిరాయితీ భూములకు నష్టపరిహారం ఇస్తామని ఇచ్చిన హామీనీ విస్మరించారు.   

బాబు హయాంలోనే కొల్లేరు కలుషితం
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆక్వా బకాసురులు కొల్లేరుపై కన్నేశారు. చేపల చెరువులు తవ్వేశారు. దీంతో కొల్లేరు కలుషితమైపోయింది. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చే విదేశీ పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో పక్షుల జాతి అంతరించిపోవడాన్ని గమనించిన విదేశాలు తాము ఇచ్చిన నిధులు దుర్వినియోగమవుతున్నాయని ప్రపంచ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.  దీంతో చంద్రబాబు కొల్లేరు చెరువుల ధ్వంసానికి జీఓ నంబర్‌ 120  ఇచ్చారు. ఆ జీఓ కొల్లేరు ప్రజల పాలిట శాపంగా మారింది.  2006లో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో అప్పటి ప్రభుత్వం చెరువులను ధ్వంసం చేసింది. కొల్లేరు వాసుల జీవనం అధ్వానంగా మారేందుకు చంద్రబాబు కారకుడయ్యారు. 

ముఖ్య సమస్యలివీ..  

  • ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ హయాంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అయితే టీడీపీ హయాంలో పేదల కోసం ఒక్క సెంటు భూమి కొనలేదు.
  • వైఎస్సార్‌ హయాంలో సేకరించిన భూమిలోనే ఇళ్లస్థలాలు ఇచ్చి జబ్బలు చరుచుకుంది టీడీపీ సర్కార
  • ​​​​​​​అర్హులైన వారికి ఇళ్లస్థలాలు ఇచ్చిన దాఖలాలే లేవు. ఫలితంగా అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ​​​​​​​

వైఎస్‌ జగన్‌ హామీతో హర్షాతిరేకం 
చంద్రబాబు జీఓతో కొల్లేరు వాసులు పొట్టకొట్టిన నేపథ్యంలో ఇక్కడి మత్స్యకారులకు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్సీని ఇస్తానని, కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కొల్లేరు ప్రాంత ప్రజలు ఆయన అధికారం చేపట్టే క్షణం కోసం నిరీక్షిస్తున్నారు. 

వలసల పాపం బాబుదే 
నియోజకవర్గంలోని నిడమర్రు, భీమడోలు మండలాల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ మత్స్యసిరికి కొదవ ఉండేది కాదు. విదేశీ  పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదంగా ఉండేది. ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి సంతాన ఉత్పత్తి కోసం పక్షులు ఇక్కడికి వచ్చేవి. దీంతో కొల్లేరు సంరక్షణకు ఆయా దేశాలు ఆర్థిక చేయూతనిచ్చేవి. అయితే స్వచ్ఛ కొల్లేరు  ధ్వంసం అయిపోయింది. మత్స్యసంపదపై ఆధారపడి జీవించే వేలాది జీవితాలు నాశనమయ్యాయి. మత్స్యకారులు వలసబాట పట్టారు.

పొట్ట చేత పట్టుకుని ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. కొందరు ఇళ్లలో వృద్ధులు, పిల్లలను వదిలేసి మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలకు పనుల కోసం పోయారు.  ఈ పాపమంతా ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. భీమడోలు మండలంలోని పాతూరు సహకార చక్కెర కర్మాగారం చంద్రబాబు హయాంలోనే మూతపడింది. ఆ ఫ్యాక్టరీని నమ్ముకున్న వేలాదిమంది రోడ్డున పడ్డారు. జీవనం కోసం వలసపోయారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top