ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు

Two New Judges To AP High Court - Sakshi

జస్టిస్‌ మానవేంద్రనాథ్‌, జస్టిస్‌ వెంకటరమణ నియామకం

రాష్ట్రపతి ఆమోదముద్ర

కేంద్రం నోటిఫికేషన్‌ జారీ

సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఇద్దరు కొత్త న్యాయమూర్తులు వస్తున్నారు. జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ మటం వెంకట రమణల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరుకుంది. వీరిద్దరూ న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులయ్యారు. సోమవారం వీరు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. హైకోర్టులో మరో 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నూతన న్యాయమూర్తుల వివరాలు... 
 
జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ : 
విజయనగరం జిల్లా, పార్వతీపురం స్వస్థలం. 2002లో జిల్లా జడ్జి కేడర్‌లో జుడీషియల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2003 జనవరి 6 వరకు అనంతపురం మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ తరువాత విశాఖపట్నం, 4, 5, 6వ అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006 నుంచి 2009 ఏప్రిల్‌ వరకు హైదరాబాద్‌ మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా పనిచేశారు. 2009 నుంచి 2012 వరకు విశాఖ జల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి 2013 వరకు కృష్ణా జిల్లా జడ్జిగా, 2013 ఏప్రిల్‌ నుంచి 2015 జూన్‌ 30 వరకు ఏపీ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2015 జూలై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ సాఫీగా సాగిపోవడంలో ఈయన కీలక పాత్ర పోషించి అప్పటి ప్రధాన న్యాయమూర్తుల మన్ననలు పొందారు. విధి నిర్వహణలో చాలా కచ్చితంగా వ్యవహరిస్తారన్న పేరుంది. 

జస్టిస్‌ వెంకటరమణ : 
అనంతపురం జిల్లా, గుత్తి స్వస్థలం. ఈయన తండ్రి ఎం.నారాయణరావు పేరుమోసిన న్యాయవాది. 1982లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయిన తరువాత, తండ్రి వద్దనే వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. సీనియర్‌ న్యాయవాది జయరాం వద్ద వృత్తిపరంగా నిష్ణాతులయ్యారు. 1987లో జుడీషియల్‌ సర్వీసుల్లోకి ప్రవేశించి పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. మొన్నటి వరకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జిగా వ్యవహరించారు. హైకోర్టు విభజన తరువాత కర్నూలు జిల్లా జడ్జిగా నియమితులై ప్రస్తుతం అదే పోస్టులో కొనసాగుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top