అదిగో గిరిజన వర్సిటీ వచ్చేసింది. మేం సాధించేశామని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పించారు.
అదిగో గిరిజన వర్సిటీ వచ్చేసింది. మేం సాధించేశామని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పించారు. హడావుడిగా స్థలపరిశీలన జరిపారు. ప్రతిపాదనలు పంపించారు. ఆ తరువాత దాని గురించి పట్టించుకోవడం మానేసినట్టున్నారు. ఇంతవరకూ కనీసస్థాయిలో కూడా పనులు...మరో పక్క తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభం కాలేదు. దీంతో జిల్లా వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ ఇక్కడి జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే తరగతులు కూడా ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు కిమ్మనడంలేదు. ఈ వర్సిటీ ఏర్పాటుకు జనవరి నుంచి పలు ప్రాంతాలను హడావుడిగా పరిశీలించిన నేతలు, అధికారులు ఇప్పుడేమీ మాట్లాడంలేదు. ఫిబ్రవరి 17న స్థల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం, జిల్లా ప్రజా ప్రతినిధులు త్వరలోనే జీఓ విడుదలవుతుం ద ని, వెనువెంటనే నిధు లు మంజూరవుతాయ ని, ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని ఆదేశాలు, ప్రకటనలు గుప్పించారు. ఉన్నతాధికారులు, నేతలు చెప్పిన విధంగా ప్రాథమికంగా అవసరమైన నిధుల కోసం ఇక్కడి అధికారులు ప్రతిపాదించారు. అయితే ఇప్పటివరకూ జీఓ రాలేదు. ప్రాథమిక పనులకు నిధులు కూడా రాలేదు. దీంతో ఈ ఏడాది సరే..! వచ్చే ఏడాదికైనా గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభమవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు మండలాల్లో స్థలపరిశీలన: కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఈ వర్సిటీ నిర్మాణానికి తొలుత పాచిపెంటలో పరిశీలన చేశారు. ఫిబ్రవరిలో కేంద్ర మానవ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ సుక్‌బీర్ సింగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, కలెక్టర్, రాష్ట్ర మంత్రులు కలసి బొండపల్లి మండలం గుంకలాం, కొత్తవలస మండలం రెల్లి గ్రామాల్లోని భూములను పరిశీలించారు. అయితే అప్పుడు గుంకలాంలో నిర్మించే అవకాశం ఉందని ప్రజా ప్రతినిధులు, రా్రష్ట్ర మంత్రులు ప్రకటించారు. అయితే కొద్ది రోజుల అనంతరం గిరిజన యూనివర్సిటీని గుంకలాం కాకుండా కొత్తవలస మండలం రెల్లిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో అక్కడ 347.47 ఎకరాల మైదాన ప్రాంతం, మరో 178.77 ఎకరాల కొండ, గుట్టల ప్రాంతాలను గుర్తించారు. మొత్తం 526.24 ఎకరాలను కేంద్ర బృందం పరిశీలించింది.
అయితే ఇక్కడ భవన నిర్మాణానికి ముందుగా స్థలం చదును చేసి, ప్రహరీ నిర్మించాల్సి ఉంది. కొండపక్కగా వెళ్తున్న హెచ్‌టీ విద్యుత్ టవర్ లైన్‌ను పక్కకు తరలించాల్సి ఉంది. ఇందుకోసం నిధులు అవసరం ఉంది. కొండలు గుట్టలు ఉన్న ప్రాంతంలోని మొక్కలు తొలగించేందుకు లోతట్టు ప్రాంతాలను ఎత్తు చేసి చదును చేసేందుకు రూ.4.5 కోట్లు ఖర్చు అవుతాయని ప్రతిపాదనలు చేశారు. అలాగే 526 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు మరో రూ.5 కోట్లతో,హెచ్‌టీలైన్ మార్చేందుకు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. వీటికి సంబంధించి నిధులు ఇంత వరకూ మంజూరు కాలేదు. గుర్తించిన స్థలాన్ని ఓకే చేస్తూ కూడా విడుదల కాలేదు. ప్రాథమికంగా చేయవలసిన పనులే ఇంకా ప్రారంభం కాలేదు. కనీసస్థాయిలో కూడా కదలిక లేకపోవడంతో వర్సిటీని ఎప్పుడు ప్రారింభిస్తారన్న అనుమానాలను జిల్లా వాసులు వ్యక్తం చేస్తున్నారు.
తాత్కాలిక తరగతుల సంగతేంటి ?
కేంద్ర బృందం, రాష్ట్ర మంత్రులు చెప్పినట్టు జేఎన్‌టీయూలో తాత్కాలిక తరగతులైనా ప్రారంభిస్తే ఎటువంటి అనుమానాలకూ తావుండేదికాదు. తాత్కాలిక తరగతుల విషయమై కేంద్ర బృందం, మంత్రులు జేఎన్‌టీయూ అధికారులతో మాట్లాడటం వారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అయినా దీనిపై ఎటువంటి ముందడుగు పడడంలేదు.