ట్రాన్స్‌ఫార్మర్ల కష్టాలు | Transformers difficulties | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ల కష్టాలు

Jan 18 2014 2:36 AM | Updated on Jun 1 2018 8:47 PM

సాగునీటి వనరులున్న రైతులు బోరుబావుల కింద పంటలు సాగు చేసుకుందామనుకుంటే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది.

 అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : సాగునీటి వనరులున్న రైతులు బోరుబావుల కింద పంటలు సాగు చేసుకుందామనుకుంటే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. వ్యవసాయ మోటారుకు విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడానికి రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటున్నారు. కనెక్షన్ కోసం డీడీలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేకపోవడంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు.
 
 జిల్లాలో ఎక్కువ శాతం  రైతులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడ్డారు. వర్షాలు ముఖం చాటేస్తుండడంతో భూముల్లో బోర్లు వేసుకుని పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే... ట్రాన్స్‌కో అధికారులు  కరుణించడం లేదు. జిల్లాలో వ్యవసాయ బోర్లకు సంబంధించి మొత్తం 1.96 లక్షల విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయి. గత రెండేళ్లుగా మరో 33 వేల మంది రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. 2012లో దరఖాస్తు చేసుకున్న రైతులకు నేటికీ మంజూరు చేయడం లేదు. దీంతో వారు నిత్యం ట్రాన్స్‌కో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
 
  అడ్డగోలు బదలాయింపు
 విద్యుత్‌శాఖ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తొలి నుంచీ వినిపిస్తున్నాయి. రైతులకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లను అభివృద్ధి పనుల ముసుగులో నేతలు తన్నుకుపోతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కలెక్టర్ ఆదేశాలు, అత్యవసరం అంటూ తప్పించుకుంటున్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మంజూరవుతున్న విద్యుత్ సామగ్రిని ఇతరత్రా వాటికి మళ్లిస్తుండడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెండేళ్లలో 33 వేలకు పైగా దరఖాస్తులు వస్తే  కేవలం ఏడు వేల కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన వాటిని ఎప్పటికి పరిష్కరిస్తారో ట్రాన్స్‌కో అధికారులే చెప్పలేకపోతున్నారు.

ఈ ఏడాది 17 వేల కనెక్షన్లను మంజూరు చేయాలని ట్రాన్స్‌కో అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే... ఇప్పటి వరకూ ఏడు వేల కనెక్షన్లను మాత్రమే ఇవ్వగలిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఎక్కువశాతం పెండింగ్‌లో ఉన్నాయని వారు చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అవసరమైనంత మెటీరియల్, ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా కావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా 300 ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేస్తున్నారు. ఇందులో ఎక్కువశాతం పరిశ్రమలు, తాగునీటి పథకాలకు మళ్లిస్తున్నారు. నెలకు కనీసం 800 ట్రాన్స్‌ఫార్మర్లు వస్తేగానీ దరఖాస్తులన్నీ పరిష్కరించలేమని అధికారులు అంటున్నారు.
 
 2013 మార్చిలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రస్తుతం మంజూరు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా... వాస్తవానికి అంతకంటే ముందు దరఖాస్తు చేసిన వారికి కూడా  ఇవ్వడం లేదు. ప్రతి నాలుగైదు వ్యవసాయ మోటార్లకు ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి. జిల్లాలో 26 వేల వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్ ఉండడంతో ఐదు వేలకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం. ప్రజాప్రతినిధులు చొరవచూపి రైతులకు అవసరమైనంత మెటీరియల్, ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా అయ్యేలా చూడాల్సిన అవసరముంది.
 
 సప్లయ్ తగినంత లేదు
 జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వాటికి తగ్గట్టు మంజూరు చేయలేకపోతున్నాం. డిమాండ్ తగ్గ స్థాయిలో ప్రభుత్వం నుంచి సప్లయ్ లేకపోవడంతోనే సమస్య ఎదురవుతోంది. ప్రస్తుతం నెలకు 300 ట్రాన్స్‌ఫార్మర్లు వస్తున్నాయి. జనవరికి సంబంధించి ఇంతవరకూ  రాలేదు. ప్రతినెలా సక్రమంగా ఇవ్వడంతో పాటు కనీసం 800 తగ్గకుండా ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం.   
 - ప్రసాద్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement