పర్యాటకాభివృద్ధికి కృషి | Tourism development should be made chandra babu naidu | Sakshi
Sakshi News home page

పర్యాటకాభివృద్ధికి కృషి

May 2 2015 3:15 AM | Updated on Jul 11 2019 5:37 PM

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని

ముఖ్యమంత్రి చంద్రబాబు
కాకినాడ సిటీ/ కాకినాడ రూరల్:
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని  పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం కాకినాడ రూరల్ సూర్యారావుపేట వద్ద రూ.70 కోట్లతో చేపట్టనున్న కాకినాడ బీచ్, హోప్‌ఐలాండ్, కోససీమ ఇకో టూరిజం సర్క్యూట్‌ల ప్రాజెక్టు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కాకినాడ-కోనసీమ, గోదావరి పరిసర ప్రాంతాలు పర్యాటకాభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయన్నారు. కాకినాడ సమీపంలోని హోప్‌ఐలాండ్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని పేర్కొన్నారు.

హోప్ ఐలాండ్‌ను రూ.15కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం-కాకినాడ మధ్య సముద్రతీరం వెంబడి బీచ్‌రోడ్డు అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. కాకినాడ నుంచి చెన్నై వరకు ఉన్న బకింగ్‌హాం కాలువను జాతీయ జలరవాణా మార్గంగా అభివృద్ధి చేయనుండడంతో చౌకైన రవాణా మార్గం అందుబాటులోకి రానున్నదని వివరించారు. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున పెద్దఎత్తున పరిశ్రమలు వస్తాయని, మౌలిక సదుపాయాలు పెరుగుతాయని చెప్పారు. ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల మిగులు నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని, వీటిలో ఏటా కనీసం వెయ్యి టీఎంసీల నీటిని కాపాడుకుంటే రాష్ట్రంలో ఒక ఎకరం కూడా ఎండిపోయే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టుతోపాటు గోదావరి జలాలను అనుసంధానం చేసి కృష్ణా నీటిని రాయలసీమకు తరలించి భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు  చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకే నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప,  ఉపాధి కార్మిక, కల్పన శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్వి నీరబ్ కుమార్‌ప్రసాద్‌లతోపాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్  అరుణ్‌కుమార్, ఎస్పీ  రవిప్రకాష్, డీసీసీబీ అధ్యక్షుడు వరుపుల రాజా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement