ఓటరుగా నమోదుకు నేటితో గడువు ముగియనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం సాయంత్రం వరకూ కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు.
సాక్షి, గుంటూరు: ఓటరుగా నమోదుకు నేటితో గడువు ముగియనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం సాయంత్రం వరకూ కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గడువు పొడిగించిన తరువాత ఎక్కువ మంది స్పందించి దరఖాస్తులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు కేంద్రాల్లో శనివారం సాయంత్రం వరకు 2.17 లక్షల దరఖాస్తుల అందాయి. ఆదివారం కూడా పోలింగ్ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో) ఫారం-6ను స్వీకరిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరూ కొత్తగా ఓటు కోసం ఫారం-6ను పూర్తి చేసి అందజేశారు.
గుంటూరు నగర కార్పొరేషన్‌లో ఈ నెల 17వ తేదీ నాటికి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన 42 వేల మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేయగా, గడువు పొడిగించాక ఆదివారం సాయంత్రానికి మరో మూడు వేల దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించి ఎంక్వైరీకి పంపే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.ఆన్‌లైన్‌లోనే ఎక్కువ.. ఈ సారి ఎక్కువ మంది యువకులు ఈ సారి ఆన్‌లైన్‌లోనే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు నగరంలోని సుమారు 20 వేల మందికి పైగా యువత బీఎల్‌వో దగ్గరకు వెళ్లే పనిలేకుండా ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ అధికారులు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
గుంటూరు నగరంలోని పలు శివారు కాలనీల్లో కొత్తగా ఇళ్లు నిర్మించుకుని నివశించే ప్రజలు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకుంటే, వాటన్నింటి పైనా బీఎల్‌వోలు అభ్యంతరాలు చెబుతున్నారు. పొన్నూరు రోడ్డులోని హుసేన్‌నగర్‌లోని 70 మంది దరఖాస్తులు ఈ విధంగా తిరస్కరణకు గురై వెనక్కి వచ్చాయి. సరైన నివాస ధ్రువపత్రాలు జత చేయలేదంటూ సిబ్బంది ఫారం-6 దరఖాస్తుల్ని స్వీకరించడం లేద ని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళ్‌దాస్‌నగర్, కొండా వెంకటప్పయ్యకాలనీ, నందమూరినగర్, తుపాన్‌నగర్, ఎన్‌జీవో కాలనీ, రామిరెడ్డినగర్ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు.