కార్యాలయాలకు హాజరైన ఉద్యోగులు | To the attendance office employees | Sakshi
Sakshi News home page

కార్యాలయాలకు హాజరైన ఉద్యోగులు

Oct 19 2013 2:56 AM | Updated on Sep 27 2018 5:59 PM

సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమ భారాన్ని తమ భుజస్కంధాలపై మోసిన ఉద్యోగులు.. సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించి.. శుక్రవారం నుంచి విధులకు హాజరుకావడంతో ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడాయి.

సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమ భారాన్ని తమ భుజస్కంధాలపై మోసిన ఉద్యోగులు..  సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించి.. శుక్రవారం నుంచి విధులకు హాజరుకావడంతో ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడాయి. కార్యాలయాలకు పట్టిన బూజులను.. ఫైళ్లకు పట్టిన దుమ్మును దులిపి.. తమ ఇష్టదైవాలను స్మరించుకొని ఉద్యోగులు విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. 66 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం ప్రభుత్వ కార్యాలయాల్లో మళ్లీ సందడి కనిపించింది.
 
 సాక్షి, కాకినాడ : రాష్ర్ట విభజన నిర్ణయానికి నిరసనగా నిరవధిక సమ్మె చేసిన ఉద్యోగులంతా శుక్రవారం నుంచి తిరిగి విధులకు హాజరయ్యారు. రాష్ర్ట విభజనపై జూలై 30న ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే పెన్‌డౌన్ చేసి ఉద్యమబాట పట్టారు. సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. ఉవ్వెత్తున ఎగసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించాయి. ఆగస్టు 12 వరకు పెన్‌డౌన్ పాటించిన ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆరోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె బాటపట్టారు. వీరికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, లాయర్లు ఇలా అన్ని రంగాలకు చెందినవారు జత కలిశారు. చివరకు అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే  వైద్యులు, విద్యుత్ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి ఉరికారు. 
 
 విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగి  కేంద్రానికి నిజంగా షాక్ ఇచ్చారు. సమ్మె కాలంలో ఉద్యోగులు జీతాల్లేక ఇబ్బందులు పడ్డారు. పదిరోజులో..20 రోజులో కాదు చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో 66 రోజుల పాటు నిరవధిక సమ్మె చేశారు. చివరకు సమైక్యాంధ్ర విషయంలో ఎలాంటి హామీరాకుండానే తొలుత ఉపాధ్యాయులు..ఆ తర్వాత విద్యుత్ ఉద్యోగులు.. ఆర్టీసీ కార్మికులు ఇలా ఒకరి వెంట ఒకరు సమ్మెకు విరమణ ప్రకటించారు. వీరి బాటలోనే మిగిలిన ఉద్యోగులంతా గురువారం అర్ధరాత్రి సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించారు.దీంతో శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన కార్యాలయాలకు ఉదయమే స్వీపర్లు, క్లాస్-4 ఎంప్లాయిస్ చేరుకొని ఆఫీసుల్లో బూజులు దులిపి శుభ్రం చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఉదయం 11.30 గంటల సమయంలో ఉద్యోగులు, అధికారులు విధులకు హాజరయ్యారు. 
 
 కానీ ఎప్పుడూ అర్జీదారులు, ప్రజలతో కిటకిటలాడే ప్రభుత్వ కార్యాలయాలు సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నప్పటికీ ఆ సందడి కానరాలేదు. ఉద్యోగులు, అధికారులు పూర్తిస్థాయిలో విధులకు హాజరైనప్పటికీ సమ్మె విరమణ విషయం గ్రామస్థాయి వరకు చేరకపోవడంతో ప్రజల తాకిడి అంతగా లేదు. దీనికితోడు విధులకు హాజరైన ఉద్యోగులు సంతకాలు చేసి ఫైళ్లు, టేబుల్స్ శుభ్రం చేసుకోవడానికే పరిమితమయ్యారు తప్ప. పూర్తిస్థాయి కార్యకలాపాలు చేపట్టలేదు. కలెక్టరేట్‌లో కలెక్టర్, జేసీ, ఏజేసీ, డీఆర్వోలతో పాటు ఇతర కీలక విభాగాల అధికారులంతా ఉదయం 10.30 గంటల సమయానికి చేరుకున్నారు. ఎప్పుడూ కిటకిటలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకే అధికారులు, సిబ్బంది చేరుకున్నప్పటికీ క్రయ విక్రయదారుల సందడి మాత్రం లేకుండా పోయింది.
 
 జిల్లాట్రెజరీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకే జిల్లా ట్రెజరీ అధికారి లలిత సిబ్బందితో సమావేశమై పెండింగ్ బిల్లులను సాధ్యమైనంత త్వరగా క్లియర్‌చేసి చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకే సిబ్బంది చేరుకున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కౌంటర్, ఆస్తి, కుళాయి పన్నుల చెల్లింపు విభాగాల్లో మాత్రమే ప్రజల తాకిడి కొద్దిగా కన్పించింది. జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయానికి అధికారులు సిబ్బంది చేరుకోగా అప్పటికే రిజిస్ట్రేషన్ల, లెసైన్సుల కోసం వాహన కొనుగోలుదారులు హడావుడి కన్పించింది. ఎప్పుడూ అర్జీదారులతో కిటకిటలాడే ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో మాత్రం తొలిరోజు ఆ సందడి కన్పించ లేదు. ముఖ్యంగా తహశీల్దార్ కార్యాలయంలో సాంకేతికపరమైన సమస్యలతో మీ సేవ కేంద్రం పనిచేయకపోవడంతో అర్జీదారులు వెనక్కి వెళ్లిపోయారు.
 
 నిన్నటి వరకు బోసిపోయిన బీసీ, సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాలు సుదీర్ఘ విరామం అనంతరం తెరుచుకోవడంతో విద్యార్థుల సందడి మొదలైంది. కలెక్టరేట్ నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకోవడంతో 66 రోజుల తర్వాత పౌరసేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. మరోపక్క జిల్లా జేఏసీ నేతలతోపాటు జేఏసీలో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల నేతలంతా ఈ నెల 22వ తేదీన కాకినాడ జేఎన్‌టీయూకే గ్రౌండ్స్‌లో జరుగనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్  సభపైనే దృష్టి పెట్టారు. సభను విజయవంతం చేసేందుకు సంఘాలన్నీ ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement