జమ్మలమడుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
జమ్మలమడుగు, న్యూస్‌లైన్: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచర గణంతో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇందుకు సంబంధించి 300 వాహనాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా గల తన అనుచరులతో భారీగా రాజధానికి తరలివెళ్లి, అక్కడ వైఎస్ జగన్ సక్షమంలో పార్టీలో చేరుతారు. ఈ పరిణామం ఆది అనుచరులు, అభిమానుల్లో ఆనందం నింపింది. సమైక్యాంధ్ర ప్రభావంతో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కొంత ఇబ్బందులు పడుతున్నా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండ వాహనాలను ఎవరికి వారు సమకూర్చుకున్నారు. సొంతంగా వాహనాలు కలిగిన వారు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌కు తరలిన నేతలు
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరునుండడంతో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివెళ్లారు. వారిలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ నాయకుడు సూర్యనారాయణరెడ్డి, పెద్దముడియం మండల మాజీ ఉపాధ్యక్షుడు కేవీ కొండారెడ్డి, నేతలు బి.నారాయణరెడ్డి, జగదేకరెడ్డి, డి.కొండారెడ్డి తరలివెళ్లారు. ఇంకా కొండాపురం నుంచి శివనారాయణరెడ్డి, అంకిరెడ్డి, పొట్టిపాడు ప్రతాపరెడ్డి, ఎర్రగుంట్ల నుంచి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బయలుదేరారు. వీరందరూ జమ్మలమడుగులోని శ్రీనివాస డిగ్రీ కళాశాల ప్రాంగణం నుంచి ఆరు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఉదయం 9 గంటలకు బయలుదే రి వెళ్లారు.