మహాకవి గురజాడ కలం నుంచి జాలువారి, శతాబ్దం తర్వాత కూడా సజీవంగా ఉన్న అజరామర నాటకం కన్యాశుల్కం ప్రేక్షకులను కట్టిపడేసింది.
=తొలి ప్రదర్శన మనోహరం
=ఆకట్టుకున్న నటీనటులు
=మూడు గంటలపాటు కట్టిపడేసిన నాటకం
చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : మహాకవి గురజాడ కలం నుంచి జాలువారి, శతాబ్దం తర్వాత కూడా సజీవంగా ఉన్న అజరామర నాటకం కన్యాశుల్కం ప్రేక్షకులను కట్టిపడేసింది. చోడవరం మండలంలో తొలిసారిగా ప్రదర్శితమైన సంక్షిప్త నాటకం వీక్షకులను రసవాహినిలో ఓలలాడించింది. కడుపుబ్బా నవ్వించింది. రంగస్థల నటులకు సవాలనదగ్గ ఈ నాటకంలో రాణించడంతో స్థానిక కళాకారుల సంతోషానికి అవధి లేకుండా పోయింది.
గోవాడకు చెందిన లిఖిత సాయి క్రియేషన్స్ సంస్థ మొట్ట మొదటిసారిగా కన్యాశుల్కం నాటకాన్ని శనివారం రాత్రి ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో పంచముఖాంజనేయ, వేణుగోపాల స్వామి ఆలయాల ద్వితీయ వార్షికోత్సవం సందర్బంగా ఈ ప్రదర్శన సాగింది. గోవాడకు చెందిన భాగవతులు ఉదయ్ కుమార్ దర్శకత్వంలో సాగిన ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వణికించే చలిలో సైతం శనివారం రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ నాటకాన్ని తిలకించడం విశేషం.
మన జిల్లాకే చెందిన మహాకవి గురజాడ రచించిన కన్యా శుల్కం నాటకం ఆధారంగా మూడు గంటల నిడివిలో ఈ ప్రదర్శన సాగింది. నాటకానికి ఆయువుపట్టయిన గిరీశం పాత్రలో ఉదయ్ కుమార్ ఆకట్టుకున్నారు. అతని శిష్యుడు వెంకటేశంగా బాల నటుడు వినయ్ రసవత్తరంగా నటించి రంజింపజేశాడు. సహజసిద్ధమైన రంగస్థలాంకరణ నాటకానికి మరింత కళ తెచ్చింది. ఏళ్లు గడిచినా గురజాడ కన్యాశుల్కానికి గల ఆదరణ తరగలేదని శనివారం మరోసారి రుజువైంది. ప్రేక్షకాదరణతో నాటక ప్రదర్శనపై నమ్మకం పెరిగిందని,
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతామని లిఖిత సాయి క్రియేషన్స్ ప్రతినిధి జయంతి సతీష్ తెలిపారు. నాటకంలోని కళాకారులను కందర్ప గౌరీశంకర్ దంపతులు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కె. భాస్కరరావు, సమైక్యాంధ్ర జేఏసీ గోవాడ కన్వీనర్ ఎం.ఏ దేముడు, తదితరులు జ్ఞాపికలతో ప్రత్యేకంగా అభినందించారు.
చాలా బాగుంది.
కన్యాశుల్కం నాటక ప్రదర్శన చాలా బాగుంది. మొదటి ప్రయత్నంలోనే ఇంతలా విజయవంతం అవుతుందని అనుకోలేదు. ఈ నాటకంలో సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉండడం సంతోషం. వారికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తాం.
- కె.భాస్కరరావు, గోవాడ సుగర్స్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు.
విజయవంతమయింది
ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా కేవలం నాటికల పోటీలనే ఏర్పాటు చేశాం. అయితే మొదటి ప్రదర్శనగా చేసిన కన్యాశుల్కం నాటకంతో వార్షికోత్సవం విజయవంతం అయినట్లయ్యింది. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులే దీనికి నిదర్శనం.
- వి. రామకృష్ణ, ఆలయ ధర్మకర్త. వెంకన్నపాలెం.