బ్లూఫ్రాగ్‌.. ఫ్రాడ్‌

There Are Often Difficulties In Handing Over NREGS Data To A Private Company By The Former Telugu Desam Government - Sakshi

గత ప్రభుత్వ హయాంలో ‘ఉపాధి’ యాప్‌ నిర్వహణ బాధ్యతల అప్పగింత

బ్లూఫ్రాగ్‌ నుంచి డేటా టీసీఎస్‌కు కాపీ

ప్రభుత్వ డేటా ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలో ఉండటం నిబంధనలకు విరుద్ధం

ప్రభుత్వ డేటా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉండడం నిబంధనలకు విరుద్ధం. దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ (జాతీయ ఉపాధి హామీ పథకం) డేటా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సర్వర్లలో ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ప్రత్యేకం. గత ప్రభుత్వంలో దీనిని పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితమైన బ్లూఫ్రాగ్‌ కంపెనీకి ఉపాధి హామీ పథకం డేటాను, యాప్‌ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. పర్యవసానంగా సదరు కంపెనీకి గత ప్రభుత్వం నుంచి భారీగా ఆదాయం రావడంతో పాటు ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ఉపాధి హామీ కూలీల డేటా మొదలుకుని యాప్‌ ద్వారా తీసుకునే హాజరు, చెల్లింపుల వరకు అంతా వారి పర్యవేక్షణలోనే జరుగుతోంది. ప్రైవేట్‌ది కావడంతో తరచూ సమస్యలు వస్తుండడంతో యాప్‌ నిర్వహణే ఇబ్బందిగా మారింది. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని 46 మండలాల్లో 3,92,410 జాబ్‌ కార్డులున్నాయి. వీటి ఆధారంగా ఉపాధి హామీ పనులు కూలీలకు కేటాయిస్తుంటారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న 661 మండలాల్లో 61,48,411 మందికి ఉపాధి హామీ కూలీల జాబ్‌ కార్డులున్నాయి. ఈ క్రమంలో ఏటా వీరిలో కొందరికి ఉపాధి హామీ పనులు ఆయా మండలాల్లోని గ్రామాల్లో కేటాయిస్తుంటారు. సగటున ఒక్క రోజుకు ఒక్కొకరికి కూలి రూ.200 వరకు ఇస్తుంటారు. రాష్ట్రంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఉపాధి హామీ కూలీల నిర్వహణ, ఇతర వివరాలు నమోదు చేసే యాప్‌ తయారీ బాధ్యతలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. ఈ క్రమంలో నారా లోకేష్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పర్యవేక్షించిన పంచాయతీ రాజ్‌ శాఖలోని వివిధ పథకాలు, యాప్స్‌ తయారీ బాధ్యతలు అప్పగించిన బ్లూఫ్రాగ్‌ కంపెనీకే దీనిని అప్పగించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన బాధ్యత, నిర్వహణ అంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే.

ఈ క్రమంలో గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు, జాబ్‌ కార్డుల జారీ, ఉపాధి కూలీల హాజరు ఇలా అన్నింటినీ ప్రైవేట్‌ కంపెనీ యాప్‌ ద్వారానే నిర్వహించేలా డిజైన్‌ చేశారు. దీనికి బ్లూఫ్రాగ్‌తో పాటు టీసీఎస్‌ జాయింట్‌ వెంచర్‌గా కేటాయించారు. దీనిలో బ్లూఫ్రాగ్‌ కంపెనీ ఉపాధి హామీ పథకం కోసం తొమ్మిది రకాల సేవలకు గానూ 15 యాప్స్‌ను సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి యాప్స్‌ తయారీ కోసం బిల్లులు తీసుకున్నారు. ఈ క్రమంలో డేటా అంతా బ్లూఫ్రాగ్‌ సర్వర్ల ద్వారా మెయింటెనెన్స్‌ చేస్తూ సర్వర్లో వివరాలు నమోదు అయిన 24 గంటల్లో టీసీఎస్‌కు డేటా ట్రాన్స్‌ఫర్‌ అయ్యేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి జాబ్‌ కార్డు వివరాలు బ్లూఫ్రాగ్‌తో పాటు టీసీఎస్‌ వద్ద ఉంటాయి. పథకం అమలుకు సంబంధించి యూజర్‌ రిజిస్ట్రేషన్, వర్క్‌ డిమాండ్‌ రిజిస్ట్రేషన్, పని కేటాయింపు, పని నిర్వహణ, హాజరు నమోదు, హాజరును పరిశీలించిడం, పని విలువ, దాని పరిశీలన, తదితర  సేవల కోసం 15 రకాల యాప్స్‌ను సిద్ధం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో డ్వామా అధికారులు ఉపాధి హామీ వివరాలు యాప్‌లో నమోదులో సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఒక రోజు ముందు యాప్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, టెక్నికల్‌ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కనీసం రెండు మూడు గంటలు కసరత్తు చేస్తే కానీ వివరాలు నమోదు కాకపోవడం తదితర ఇబ్బందులు ఉన్నాయి.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
విలువైన ప్రభుత్వ డేటా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు. కర్ణాటక. తమిళనాడు, కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో దీనిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ ఇన్ఫర్మేటివ్‌ సెంటర్‌ పర్యవేక్షిస్తుంది. సర్వర్ల, యాప్‌ నిర్వహణ అన్ని ఎన్‌ఐసీనే చూసుకుంటుంది. దానికి సంబంధించిన యాక్సెస్‌ కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం సర్వర్లను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. ఉపాధి హామీ డేటాను సదరు ప్రైవేట్‌ సంస్థలు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకునేలా యాక్సెస్‌ కంపెనీకి మాత్రమే ఉంది. ప్రభుత్వానికి యాక్సెస్‌ లేదు. అలాగే డేటా వేరే వారికి బదలాయించడం చట్టరీత్యా నేరం. మన రాష్ట్రంలో వివరాలు నమోదు అయిన 24 గంటల్లో డేటా టీసీఎస్‌కు ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్‌ అయ్యేలా చేశారు. దీనిని ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి తీసుకుని ఎన్‌ఐసీకి అప్పగిస్తే ఖజానాకు భారం తగ్గడంతో పాటు డేటా అంతా ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది.

పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు నివేదిక
ఇటీవల కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు డ్వామా అధికారులతో సమీక్ష నిర్వహించిన లోపాలపై చర్చించిన క్రమంలో విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కలెక్టర్‌ పంచాయతీ రాజ్‌ కమిషనర్‌కు దీనిపై సమగ్ర నివేదిక పంపారు. యాప్‌లోని ఇబ్బందులు మొదలుకుని అన్ని అంశాలపై సమగ్ర నివేదిక పంపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top