సవాలక్షన్నర ఆంక్షలు!

సవాలక్షన్నర ఆంక్షలు! - Sakshi

  •   రుణమాఫీపై రోజుకో నిబంధన

  •   నిన్న ఆధార్‌తో లింకు

  •   నేడు ఆన్‌లైన్ బ్యాంకుల్లో  ఖాతాలు కావాలంటూ కొత్త రాగం

  •   రుణం తీసుకున్న రైతు నుంచి  మళ్లీ ఆధారాల సేకరణా?

  •   30 నిబంధనలు విధించిన ప్రభుత్వం

  •   మండిపడుతున్న అన్నదాతలు

  • మచిలీపట్నం/పామర్రు : రుణమాఫీ అమలుకు ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. అన్ని అర్హతలు ఉండి బ్యాంకు ద్వారా పంట రుణం పొందిన రైతుల నుంచి ఆనేక ఆధారాలను మళ్లీ కోరుతోంది. కుటుంబానికి రూ.లక్షన్నరకు కుదించిన  రుణమాఫీ ప్రక్రియను మరింత జాప్యం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రైతులు మండిపడుతున్నారు.



    జిల్లా వ్యాప్తంగా 6,29,186 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.9,137 కోట్ల రుణాలను తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని, రైతులెవరూ రుణాలు చెల్లించవద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు.  దీంతో రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు.



    చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ చేయకుండా, విధివిధానాలను ఖరారు చేసేందుకు కోటయ్య కమిటీని నియమించారు. రాష్ట్రంలో రూ.87వేల కోట్ల పంట రుణాలు ఇవ్వగా కోటయ్య కమిటీ వీటిని రూ.35 వేల కోట్లకు తగ్గించింది. అనంతరం ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.1.50 లక్షలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ మొత్తాన్ని మాఫీ చేయడానికి అనేక ఆంక్షలు విధించింది.

     

    కేడీసీసీలో పొదుపు ఖాతా ప్రారంభించాలి..




     గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో 1.60 లక్షల మంది రైతులు గత ఏడాది రూ.1,100 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వీరు పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు పొందారు. ఈ రైతులంతా తమ మండలంలో, లేదా సమీపంలోని ఆన్‌లైన్ ఉన్న కేడీసీసీ బ్రాంచ్‌లో పొదుపు ఖాతా ప్రారంభించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. రుణమాఫీ జరిగితే రైతు పేరున వచ్చిన నగదును కేడీసీసీ బ్రాంచ్‌లో ఉన్న ఖాతాలో జమ చేస్తారని చెబుతున్నారు.



    పీఏసీఎస్‌లో రుణం తీసుకున్న ఖాతా నంబరు ఉండగా అందులోనే రుణమాఫీ సొమ్మును జమచేయవచ్చు కదా.. అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 28వ తేదీలోపు పీఏసీఎస్ కార్యదర్శికి అన్ని వివరాలు అందజేస్తే ఆయనే రైతు పేరున కేడీసీసీ బ్రాంచ్‌లో పొదుపు ఖాతా ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇటీవల ప్రభుత్వం 30 నిబంధనలతో ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసినట్లు కేడీసీసీ బ్యాంకు సీఈవో తోట వీరబాబు ‘సాక్షి’కి తెలిపారు.

     

    ముఖ్యమైన ఇబ్బందులు ఇవీ..



    రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోయినా అడంగల్ కాపీ ద్వారా డాక్యుమెంటేషన్ చేసుకుని పీఏసీఎస్‌ల ద్వారా పంట రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం రుణం తీసుకున్న ప్రతి రైతు పట్టాదారు పాస్‌పుస్తకం నకళ్లను అందజేయాలనే నిబంధన పెట్టారు. పట్టాదారు పాస్‌పుస్తకం లేకుంటే డాక్యుమెంటేషన్ ఆధారంగా ఇచ్చిన పంట రుణానికి రుణమాఫీ వర్తిస్తుందా.. లేదా.. అన్న అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి.

     

    కొందరు రైతులకు ఆధార్‌కార్డులు ఇంకా రాలేదు. ఆధార్‌కార్డు లేకుంటే రుణమాఫీ చేస్తారా.. లేదా.. అనే అనుమానాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

     

    తాజాగా 2014 జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీలోగా పంట రుణాలు చెల్లించి తిరిగి రుణాలు తీసుకుంటే రుణమాఫీ జరగదనే నిబంధన ప్రభుత్వం విధించింది. గతంలో పంట రుణాలు తీసుకుని తిరిగి చెల్లించినా రుణమాఫీ చేస్తామని ప్రకటించారని ఇప్పుడు మళ్లీ ఈ నిబంధన ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

     

    కౌలు రైతులకు శాపం..

     

    రుణమాఫీ అమలుపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించటం కౌలు రైతులకు శాపంగా మారింది. రుణమాఫీ వర్తించాలంటే రుణం తీసుకున్న రైతు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం నకళ్లను అందజేయాలని తాజాగా నిబంధన విధించారు. కౌలురైతు పేరున భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం ఎలా ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.



    2011-12 సంవత్సరంలో 48,581 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయగా, వారిలో 8,526 మంది రూ.15.65 కోట్లు రుణాలు పొందారు. 2012-13లో 34,447 మంది రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వగా, వారిలో 7,431 మంది రూ.15.04 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీరందరికీ వారి పేరున పట్టాదారు పాస్‌పుస్తకాలు లేవు. ఈ నేపథ్యంలో కౌలురైతులకు రుణమాఫీ జరుగుతుందా.. లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

     

    మొదటి నుంచి సాగదీత ధోరణి

     

    ప్రభుత్వం రుణమాఫీపై సాగదీత ధోరణితో వ్యవహరిస్తోంది. జిల్లాలో రూ.9,137 కోట్ల పంట రుణాలు రద్దు కావాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.5వేల కోట్లలో వెయ్యి కోట్ల రూపాయలు నాన్‌ప్లాన్ గ్రాంట్ కింద ఉన్నాయని, ఈ లెక్కన రుణమాఫీకి రాష్ట్ర వ్యాప్తంగా రూ. 4వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించినట్లయ్యిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు.



    గతంలో రుణమాఫీ జరిగిన సమయంలో రైతులు ఏ బ్యాంకులో రుణం తీసుకుంటే అదే బ్యాంకులో రుణమాఫీకి సంబంధించిన సొమ్ము జమ చేశారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం పీఏసీఎస్‌లో రైతు పేరున బ్యాంకు ఖాతాలు ఉన్నా, మళ్లీ ఆన్‌లైన్ సదుపాయం ఉన్న బ్రాంచిలో పొదుపు ఖాతా ప్రారంభించాలని చెప్పడం రుణమాఫీ ప్రక్రియను జాప్యం చేసేందుకేనని ఆయన విమర్శించారు. ఏదో ఒకసాకు చూపి రైతులను మోసం చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top