‘రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రుణమాఫీతో మాకు సంబంధం లేదు.. బకాయిలు చెల్లించకపోతే వడ్డీలు పెరిగిపోతాయి.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రావు..’
⇒రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు
⇒ఆ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వం
⇒బకాయిలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకర్ల నోటీసులు
⇒పంటలు లేక, చేతిలో చిల్లి గవ్వ లేక ఆందోళనలో అన్నదాత
‘రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రుణమాఫీతో మాకు సంబంధం లేదు.. బకాయిలు చెల్లించకపోతే వడ్డీలు పెరిగిపోతాయి.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రావు..’ రైతులను బ్యాంకర్లు, సొసైటీల అధ్యక్ష కార్యదర్శులు బెదిరిస్తున్న తీరిది. అంతేకాదు.. బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు వేలం వేస్తామంటూ నోటీసులకు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకుగురవుతున్నారు. ఒకపక్క పంటలు పండక, చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వం నుంచి రుణమాఫీ రెండో విడత సొమ్ము విడుదల కాక, బ్యాంకర్ల బెదిరింపులు తాళలేక అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు.
విజయవాడ : రుణభారం రైతన్నకు పెనుశాపంగా మారింది. తీసుకున్న బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకర్లు, సహకార సంఘాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఆందోళనకు గురవుతున్నాడు. పంటలు పండకపోవడంతో ఏడాదంతా ఎలా జీవనం సాగించాలా అని మధనపడుతున్న రైతులకు బ్యాంకర్లు నోటీసులిస్తామంటూ బెదిరింపులకు దిగుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. మరోపక్క రుణమాఫీ రెండో విడత సొమ్ము విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవటం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
4.04 లక్షల మంది రుణమాఫీ లబ్దిదారులు...
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 5.54 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ కింద మూడు విడతల్లోనూ కలిపి 4,04,000 మందిని గుర్తించారు. వారి బకాయిల మాఫీ కోసం రూ.1,490 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రూ.50 వేల లోపు ఉన్నవారికే ఒకేసారి రుణమాఫీ చేస్తానని ప్రకటించిన ప్రభుత్వం మిగిలిన రైతులకు ఐదు భాగాలుగా ఐదేళ్లలో విడుదల చేస్తామంటూ ప్రకటించింది. రూ.50 వేల రుణమాఫీతో కలిపి మొత్తం రూ.573 కోట్లు రుణమాఫీ జరిగినట్లు జిల్లా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది చెల్లించాల్సిన రెండో విడత సొమ్ము ఊసే ఇంతవరకూ ప్రకటించలేదు. దీంతో బ్యాంకర్లు తమను బకాయిలు చెల్లించాలని వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు వేలం వేసేందుకు నోటీసులు ఇస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సిన రెండో విడత సొమ్ము చెల్లించాక ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తామని చెబుతున్నారని, అయితే అసలే కుటుంబం గడవని పరిస్థితుల్లో ఉన్న తాము బకాయిలు ఎలా చెల్లించగలమని వారు ఆవేదన చెందుతున్నారు. మిగిలిన నాలుగేళ్ల సొమ్మును ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తద్వారా తమకు వేధింపులు తగ్గుతాయని చెబుతున్నారు.
సాగు లేక.. కుటుంబం గడవక..
కృష్ణా డెల్టాలో 150 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్‌కి, రబీకి ప్రభుత్వం నీరు అందించలేకపోయింది. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల భూమికి గాను ఖరీఫ్‌లో కేవలం 4.64 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. రబీలో 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, ఏమాత్రం జరగలేదు. పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఎకరాకు సగటున 28 బస్తాలు ధాన్యం పండాల్సి ఉండగా కేవలం 20-22 బస్తాలు మాత్రమే పండాయని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో రైతులు డబ్బులు సరిగా అందక బకాయిలు తీర్చలేని దుస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు.