ఓ వివాహితను నమ్మించి తన వెంట తీసుకెళ్లి సరదాగా తిరిగి చివరికి ఆమెను హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
రాజంపేట, న్యూస్‌లైన్ : ఓ వివాహితను నమ్మించి తన వెంట తీసుకెళ్లి సరదాగా తిరిగి చివరికి ఆమెను హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వేకోడూరు మండ లం తంబళ్లవారిపల్లెకు చెందిన గాలి పెంచలయ్య, గాలి ఈశ్వరమ్మలకు రెండవ కుమార్తె దివ్య. ఆమెను బద్వేలుకు చెందిన నాగశేషుకు ఇచ్చి వివాహం చేశారు. ఈ నెల 7వ తేదిన ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. ఆ తర్వాత 9వ తేది రాజంపేట మండలంలోని బోయనపల్లె హైస్కూల్‌లో శవమై కనిపించింది.
దివ్యతో పరిచయం ఇలా..
ఏడాది కిందట దివ్యకు ఓ మిస్‌కాల్డ్ వచ్చింది. దీంతో ఆమె ఫోన్ చేయగా తన పేరు కార్తీక్ అని దివ్యతో పరిచయం మొదలెట్టాడు. తాను ఇంజనీరు అని చెప్పి పరిచయాన్ని కొనసాగించాడు. అప్పటికే ఇష్టంలేని పెళ్లి చేసుకున్న దివ్య అతని మాటలకు పడిపోయింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని బంగారు, డబ్బు తీసుకురావాలని చెప్పడంతో ఈనెల 7వ తేదిన మెట్టినింట గడప దాటి హత్యకు గురైంది.
హత్యకేసు
మిస్టరీని చేధించిన పోలీసులు
పోలీసుల విచారణలో దివ్య, కార్తీక్‌లు తిరుమల, తిరుపతి తదితర ప్రాంతాల్లో జల్సాగా తిరిగారు. చివరికి తన అక్క రాజేశ్వరి, బావ మాతయ్య ఉంటున్న బోయనపల్లెకి వచ్చేశారు. అక్కడ స్నేహితుడు చంద్ర వద్ద మకాం వేశారు. బోయనపల్లె హైస్కూల్‌లో ఇద్దరు కలిసి ఉన్నారు. ఆమెను కర్చీప్‌తో గొంతు బిగించి హత్య చేశారు. దివ్య వద్ద ఉన్న ఆరుతులాలు బంగారు, 38 గ్రాముల వెండి నగలు, సెల్‌ఫోన్లు తీసుకొని వెళ్లిపోయాడు. రాజంపేట రూరల్ పోలీసులు హత్యకేసులోని మిస్టరీని చేధించారు.
అరెస్టు ఇలా..
ఈ కేసులో ప్రధాన నిందితుడు రైల్వేకోడూరు నారాయణరాజుపోడుకు చెందిన కార్తీక్‌ను అక్కడే ఆదివారం అరెస్టు చేశారు. రాజంపేట జూనియర్ సివిల్ జడ్జికోర్టులో హాజరు పెట్టగా రిమాండ్‌కు ఆదేశించారు. డీఎస్పీ జీవీ రమణ సమక్షంలో విలేకరుల ఎదుట మన్నూరు సీఐ కార్యాలయ ఆవరణలో హాజరుపెట్టారు. హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులకు రివార్డు ఇప్పించేందుకు ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ ప్రకటించారు.