తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఇల్లెందు, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న సోనియా గాంధీ మాట తప్పలేదని, తెలంగాణ ఇచ్చేది ..తెచ్చేది కాంగ్రెస్సేనని ఆయన తెలిపారు. ఇల్లెందులో శనివారం జరిగిన తెలంగాణ ప్రకటన కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న మంత్రి జగదాంబ సెంటర్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. 1969లో తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ ఇల్లెందులోనే జరిగిందని ఈసందర్భంగా మంత్రి గుర్తుచేశారు. భద్రాచలం కూడా తెలంగాణలో అంతర్‌భాగమేన్నారు. కొందరు పని కట్టుకొని పది జిల్లాలతో కూడిన తెలంగాణకు రాయలసీమకు చెందిన కొన్ని జిల్లాలను కలపాలని ప్రకటిస్తున్నారని, ఇలాంటి గందరగోళంను సృష్టించే ప్రకటనలతో ఎవరి ప్రయోజనాలు నెరవేరుస్తారో ఆలోచించుకోవాలన్నారు. ఇల్లెందు పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్ష పట్టణక్రమబద్దీకరణ సాధించి తీరుతామన్నారు. ఇల్లెందు పట్టణదహార్తిని తీర్చేందుకు దుమ్ముగూడెం కాలువను ఇల్లెందు చెరువులోకి మళ్లించేందుకు కృషి చేస్తామన్నారు.
దూషిస్తుంటే బాధేస్తోంది....:పొంగులేటి
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించిన నేతలే సీమాంధ్రలో సోనియాగాంధీని దూషిస్తుంటే బాధేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మూడు దఫాలుగా అవకాశం వచ్చినా ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేసి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా సోనియాగాంధీ నిలిచారని ఆయన అన్నారు. 1100 మంది విద్యార్థులు, యువకులు తెలంగాణకోసం ఆత్మత్యాగాలు చేశారని అన్నారు. తెలంగాణకు అనుకూలమంటూ లేఖలు ఇచ్చిన పార్టీలన్నీ యూటర్న్ తీసుకుంటున్నాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఊసరవెల్లిబాబుగా మారాడని, ఆత్మగౌరవ యాత్ర పేరుతో ప్రజలను మరోమారు మోసగించేం దుకు సిద్ధమవుతున్నాడని విమర్శిం చారు. యూటర్న్ తీసుకుంటున్న రెండు కళ్ల సిద్ధాంతం బాబుకు రెండు ప్రాంతాల్లో శృంగభంగం తప్పదన్నారు. తెలంగాణ విభజనతో సీమాంధ్రకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు.
ఇల్లెందు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మడత వెంకటగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వనమావెంకటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాథాకిషోర్, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోరం కనకయ్య, టేకులపల్లి సోసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్, మూలమధుకర్‌రెడ్డి, మొలబాబు, కొక్కు నాగేశ్వరరావు, కోటిరెడ్డి, ప్రమోద్‌కుమార్, జీవి భద్రం, మన్నాన్, అక్కిరాజు గణేష్, ఉప్పు శ్రీను, ప్రసన్నకుమార్,చందు,దేవదానం, కమల్‌కుమార్‌కోరి, సుదర్శన్‌కోరి, పసికరాజమల్లు, అనిత, రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్‌ను డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు.
కేంద్రమంత్రి బలరాం, భట్టి గైర్హాజరు...
తెలంగాణ ప్రకటన కృతజ్ఞతా ర్యాలీ,సభ,పార్టీ పట్టణ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి కేంద్ర మంత్రి బలరాం నాయక్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క గైర్హాజరయ్యారు. దీంతో ప్రార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. కృతజ్ఞతా ర్యాలీ, పార్టీ పట్టణ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి బలరాం,భట్టి, రాంరెడ్డి, వనమా, పొంగులేటి నేతల కోసం పలు దఫాలు వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు శనివారం నిర్వహించిన కార్యక్రమానికి బలరాం, భట్టి గైర్హాజర్ కాగా వనమా,పొంగులేటి వచ్చారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఫోటో ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయకపోవటంతో ఆ వర్గం నేతలు ర్యాలీలో పాల్గొనలేదు.