హోరెత్తిన తెలం‘గానం’


 హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ :

 రెండు వందల మంది కళాకారులు.. సుమారు 8 గంటలు.. ఒక్కో గొంతుక నుంచి ఒక్కో ఉద్యమ గానం అదే ప్రత్యేక తెలంగాణం. కళాకారుల ఆట పాటలకు అనుగుణంగా హాజరైన ప్రజల ఈలలు, చప్పట్లతో హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణం మారుమోగింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక ధూం ధాంలు నిర్వహించి బాసటగా నిలిచిన కళాకారులు.. తెలంగాణ కల సాఫల్యమవుతున్న నేపథ్యంలో మరోసారీ ఒక్కచోట చేరా రు. తెలంగాణ జానపద కళాకారులైన వరంగల్ శంకర్, దీకొండ సారంగపాణిలను స్మరించుకుంటూ తెలంగాణ క్రాంతి దళ్ చేపట్టిన‘మువ్వల సవ్వడి’ వారందరినీ ఏకం చేసింది. క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కొనసాగిన ధూం ధాంకు ప్రజా యుద్ధనౌ క గద్ధర్, ప్రజాగాయని విమలక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్, సారంగపాణి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

     

 ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ జానపదం అంట రానితనం భరిస్తున్న దళిత స్త్రీ నుంచి వచ్చిందని, అది ఉద్యమ పాటకు దారి తీసిందన్నారు. తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతుంటే వాటిని పరిరక్షించుకునే క్రమంలోనే తెలంగాణలో కవులు, కళాకారులు పుట్టారని పేర్కొన్నారు.  తాను రాసిన భాగవతాన్ని ఆనాడు కన్నడ రాజు తనకు అంకితం చేయాలని కోరితే ధైర్యంతో ఎదురొడ్డిన గొప్ప ధీశాలి పోతన.. ఆయన వరంగల్ జిల్లాకు చెందిన వాడు కావడం గర్వకారణమన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ సంక్రాంతి, అట్లతద్ది పండుగులను జరుపుతున్న ఆంధ్రా పాలకులు తెలంగాణ బతుకమ్మలను మరిచిపోయిండ్లని విమర్శించారు. ప్రస్తుతం మూడు జాతరలు జరుగుతున్నా యని, అందులో ఒకటి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, మరోటి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఎన్నికల జాతర ప్రారంభమైందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి టికెట్లు ఇస్తామంటూ ఇప్పటికే తెలంగాణలో నాయకుల జాతర కొనసాగుతోందని చెప్పారు. సీనియర్ జర్నలి స్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారే తప్ప ఎవరూ ఇవ్వలేదు.

 

  తెలంగాణ పునర్నిర్మాణంలో పార, గడ్డపార పట్టిన వాళ్లనే గెలిపిద్దామన్నారు. ముఖ్యమంత్రినే ఎదురించినానంటూ గొప్ప లు చెబుతున్న మంత్రి శ్రీధర్‌బాబు ల్యాండ్, సాండ్, గ్రానైట్ మాఫియాకు అధిపతి అని చెప్పారు. తెలంగాణ గురించి మాట్లాడుతున్న ఆయన 1200ల మంది విద్యార్థులు మరణించినపుడు ఎక్కడపోయిండని ప్రశ్నించారు. మళ్లీ మంత్రి కావాలంటే ముక్కు నేలకు రాసి, తప్పులను ఒప్పుకోవాలని చెప్పారు. ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య మాట్లాడుతూ కళ లేని దేశం దీపం లేని ఇల్లు లాంటిది.. కళలను, కళాకారులను ప్రజలు ఆదరించినపుడే భవిష్యత్ తరాలకు అందుతాయన్నారు. గొల్లమల్లమ్మ కోడలా అంటూ కొందరు రాసి న పాట ఎందరినో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాటలు రాసేప్పుడు ఆలోచించాలని హితవుపలికారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు పదవులు పోతాయని భయపడ్డరు.. ఇప్పుడు ముం దుండి నడిపిస్తున్నరు.. వారికి అండగా ఉందామని చెప్పా రు.

 

  జానపద పాటలను అనేక రాష్ట్రాలకు పరిచయం చేసింది శంకర్, సారంగపాణిలేనని పేర్కొన్నారు.

 తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు  పృథ్వీరా జ్ మాట్లాడుతూ జానపద గాయకులైన వరంగల్ శంకర్, దీకొండ సారంగపాణి విగ్రహాలను పబ్లిక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇడ్లి సాంబార్, విద్యార్థి ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలైన అమరుల పేర్లు ఇప్పటికీ తెలంగా ణ నాయకులకు తెలియకపోవడం బాధాకరమని అన్నారు. రజాకార్లకు భయపడి ఆంధ్రాకు వలస పోయిన తెలంగాణ ప్రజలను పిరికివాళ్లుగా భావించి పప్పులు, కూరగాయలు, ఇంటి కిరాయిలు పెంచి కమర్శియల్‌గా సంపాధించుకున్న ఆంద్రోళ్లు నేడు తెలుగు భాష మాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ కవులను, కళాకారులను వారు విస్మరించారని మండిపడ్డారు. పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ మాట్లాడుతూ 1971లో ఐక్య రాజ్యసమితిలో తాను మిమిక్రీ కళను ప్రదర్శించేందుకు వెలితే అమెరికా అధ్యక్షుడు ఈ కళ ఎప్పడి నుంచి ఉందని అడిగితే మీదేశం పుట్టక ముందు నుంచి ఉందని చెప్పానని చమత్కరించారు. మిమిక్రీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో భీముడు స్త్రీలా మాట్లాడి శత్రువును సంహరిస్తాడని గుర్తు చేశారు. మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ నేరేళ్ల వేణుమాధవ్, తాను క్లాస్‌మేట్స్ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. విద్యార్థిగా హైద్రాబాద్‌లో ఉద్యమంలో పాల్గొన్న విషయాలను నెమరువేసుకున్నాడు. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిపై రాసిన కవితను చదివి వినిపించాడు.

 

 మా ఆయన పాటలంటే ప్రాణం

 కళనే నమ్ముకున్న నా భర్త తదనానంతరం నన్ను ఎవరూ చేరదీయలేదు. ఇద్దరు పిల్లల తో ఎన్నో కష్టాలు పడ్డాను. భర్త ఉద్యోగంతోనే నేడు బతుకుతున్నాను. అయినప్పటికీ శంకర్ నుంచి వచ్చిన జానపద పాటలంటే ప్రాణం.

 - సంధ్య, వరంగల్ శంకర్ సతీమణి

 

 భర్త స్నేహితులే ఆదుకున్నారు

 జానపద కళాకారుడిగా నా భర్త సారంగపాణి సంపాధించింది ఏమీ లేదు. ఆయన మరణాంతరం స్నేహితులే కుటుంబాన్ని ఆదుకున్నారు. పిల్లలను చదివించి ప్రయోజకులను చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. భర్త లేని తనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆర్థిక సాయం అందించాడు.     

 - ప్రమీల, సారంగపాణి సతీమణి

 

 చదివించారు

 ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి ఫీజులు లేకుండా చదివించారు.

 - రాజమహేందర్,

 సారంగపాణి కొడుకు  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top