టీచర్ల బదిలీల తకరారు | Teachers transfer confirmed | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీల తకరారు

Aug 5 2015 1:35 AM | Updated on Sep 3 2017 6:46 AM

ఏలూరు సిటీ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై స్పష్టత కొరవడింది. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని నూతనంగా అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తుండగా...

ఏలూరు సిటీ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై స్పష్టత కొరవడింది. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని నూతనంగా అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తుండగా...ఈ విధానంతో టీచర్లు తమ స్వేచ్ఛను కోల్పోతారని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. బదిలీల కౌన్సెలింగ్‌కు ఇంకా సరైన విధి విధానాలు ఖరారు కాలేదని విద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికే ఆదర్శ ప్రాథమిక పాఠశాలల పేరుతో కొన్ని ప్రైమరీ స్కూళ్లను మూసివేసేందుకు అధికారులు నివేదికలు సమర్పించారు. ఇవన్నీ పూర్తి చేసేందుకు విద్యాధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రమబద్ధీకరణ పేరుతో జిల్లాలో రెండు దశల్లో 189 ప్రాథమిక పాఠశాలలకు, మునిసిపల్ యాజమాన్యంలో 16 స్కూళ్లకు తాళాలు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో పాఠశాలల మూసివేతపై ప్రజల నుంచి అభ్యంతరాలు రావటంతో ఈసారికి వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు మంచిదేనని అయితే స్కూళ్లను మూసివేయకుండా కేరళ తరహాలో అన్ని స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ వినవస్తోంది.
 
 వెబ్ కౌన్సెలింగ్ వద్దంటున్న టీచర్లు
 ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాత విధానానికి బదులు కొత్తగా ఎంసెట్ తరహాలో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 7న డెమో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రాథమిక విద్య ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మాత్రం వెబ్ కౌన్సెలింగ్ వద్దంటున్నారు. ఒక్కో టీచర్ 99 ఆప్షన్లను పెట్టుకోవచ్చని, ఇంటి నుంచో, నెట్ సెంటర్ల నుంచో సులువుగా చేయవచ్చని విద్యాధికారులు చెబుతున్నారు. కానీ పాత విధానంలో అయితే ఖాళీలను చూసుకుంటూ తమ అవకాశం వచ్చినప్పుడు బదిలీ స్థానాన్ని ఎంపిక చేసుకోవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. పైగా భార్యాభర్త, ప్రత్యేక కేటగిరీల్లో ఇబ్బందులు వస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు నాలుగువేల మంది ఉపాధ్యాయులు బదిలీ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది.
 
 క్రమబద్ధీకరణతో పిల్లలకు కష్టాలే
 తొలుత ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పూర్తి చేసి అనంతరం బదిలీలు చేపడతారు. దీనిలో భాగంగానే 20లోపు పిల్లలున్న పాఠశాలలు, అసలు పిల్లలు లేని స్కూళ్లను మూసివేసి అక్కడి ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేస్తారు. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేస్తుండటంతో మిగులు టీచర్లను క్రమబద్ధీకరిస్తే గానీ పూర్తిస్థాయిలో ఖాళీలు ప్రకటించే అవకాశం లేదు. జిల్లాలో మొదటి దశలో 364 స్కూళ్లను గుర్తించగా 281ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేశారు. వాటిలో 83 స్కూల్స్ విలీనం అవుతున్నాయి. రెండో దశలో 198 స్కూళ్లను గుర్తిస్తే 92 ఆదర్శ పాఠశాలలుగా ఏర్పాటు అవుతాయి. వీటిలో 106 పాఠశాలలు విలీనం అవుతున్నాయి. మొత్తానికి 189 పాఠశాలలు మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక మునిసిపల్ యాజమాన్యంలో 46 పాఠశాలలు గుర్తించగా 30 ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేస్తుండగా వీటిలో 16 స్కూళ్లు విలీనం అవుతున్నాయి. ఒకేసారి పిల్లలు లేని స్కూళ్లను మూసివేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో దశల వారీగా తాళాలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement