తెలుగుదేశంలో టెన్షన్‌.. టెన్షన్‌

 TDP Leaders Who Want to Join The BJP In Prakasham - Sakshi

సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : ఘోర ఓటమితో తెలుగుదేశం పార్టీ డీలా పడింది. మరోవైపు క్యాడర్‌ను కాపాడుకోవడం కూడా కష్టంగా మారుతోంది. వైఎస్సార్‌ సీపీ చేరికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు కాబట్టి వారు ఎటూ వెళ్లకుండా ఉండిపోయారు. లేకపోతే కొన్ని మండలాల్లో క్యాడర్‌ పూర్తిగా ఖాళీ అయిపోయేది. ఇప్పుడు నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వీడిపోవాలన్న దానిపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిణామాలు, గత 25 రోజులుగా జగన్‌ పాలన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం సాధ్యం కాదన్న అభిప్రాయం తెలుగుదేశం నాయకుల్లో బలపడుతోంది. సంక్షేమ రాజ్యంగా మార్చడం కోసం ప్రభుత్వం చూపిస్తున్న చొరవతో తెలుగుదేశం నేతల్లో ఆందోళన మొదలైంది. అవినీతిపై విచారణకు కమిటీ వేసిన నేపథ్యంలో తాము ఇబ్బందులు పడతామన్న భావన పలువురు మాజీ ప్రజాప్రతినిధుల్లో ఏర్పడింది. దీంతో బీజేపీలోకి వెళ్తే కొంత రక్షణ ఉంటుందన్న ఆలోచన నేతల్లో వ్యక్తమవుతోంది.  

టీడీపీని వీడిన అంబికా కృష్ణ
గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేసిన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు పరిమితం కాగా అందులో  ఎవరు పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే  అంబికాకృష్ణ  ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేత రాంమాధవ్‌ సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా  కొనసాగుతున్న అంబికా కృష్ణ 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మళ్లీ సీటు ఆశించినా ఎమ్మెల్సీ హామీ ఇచ్చి అధిష్టానం బుజ్జగించింది. అయితే ఎమ్మెల్సీ ఇవ్వకపోగా చివరి ఏడాది కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడంతో ఆయన  కొంత కాలంగాఅసంతృప్తితో  ఉన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌  మాధవ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయన సోదరుడు అంబికా రాజా కూడా ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

ఒక్కశాతం ఓట్లూ రాని బీజేపీ 
గత ఎన్నికల్లో బీజేపీకి జిల్లాలో ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్నారు. అయినా వారికి 2019 ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు కూడా రాలేదు. అయితే కేంద్రంలో భారీ మెజారిటీతో ప్రభుత్వం రావడంతో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే వైపు అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలను రాబట్టుకోవడంపై బీజేపీ నేతలు దృష్టి సారించారు.

ఇందులో భాగంగా ఇటీవల కాకినాడలో సమావేశం నిర్వహించిన కాపు నేతల్లో ఒకరిద్దరికి కమలం కండువా కప్పడానికి యత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే రాబోయే మున్సిపల్, స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరితే ఒకటి అరా సీట్లు కూడా రావేమోనన్న భయంతో వారు తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు సమాచారం. మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లూ తమ నేతల వెంట నడిచేందుకు ఇష్టపడటం లేదు. అయితే టీడీపీ రాన్రాను బలహీనపడిపోతుందని, అందువల్ల ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బావుంటుందని నేతలు వారికి నచ్చచెబుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు టీడీపీలో కలవరం రేపుతున్నాయి. పైకి మొక్కుబడిగా తాము పార్టీ మారడం లేదని చెప్పినా లోలోపల బీజేపీవైపు చూస్తున్నట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top