రాజకీయ బదిలీ

TDP Leaders Involvement In Police Employees Transfers YSR Kadapa - Sakshi

శాంతిభద్రతల విషయంలో ఎస్పీ అభిషేక్‌ మహంతి రాజీ పడకుండా ముందుకు సాగారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల సంరక్షణమే లక్ష్యంగా తనదైన ముద్ర వేసుకున్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమన్న దృష్టితో వెళుతూ  పోలీసుల్లోనూ, ప్రజల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి అధికారిని ప్రోత్సహించాల్సింది పోయి బదిలీ బహుమానంగా అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం ఘనత వహించింది. తాను ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఎస్పీ ఉంటే కష్టమని సీఎంకు మంత్రి ఆది మొరపెట్టుకుని బదిలీ చేయించారని వాదనలు వినిపిస్తున్నాయి.

సాక్షి కడప : ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీని ఢీ కొట్టలేమని అధికార టీడీపీ భావిస్తోందా.. ఇప్పటి నుంచే వక్రమార్గాలపై దృష్టి పెట్టిందా.. ఈక్రమంలోనే ఎస్పీ అభిషేక్‌ మహంతిని అర్ధాంతర బదిలీ చేశారా.. అంటే ఔను అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత ఎస్పీ అభిషేక్‌ మహంతి నిక్కచ్చిగా వెళతుండడం అధికార పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. పైగా పలు సంఘటనల వ్యవహారంలో న్యాయబద్దంగానే ముందుకు వెళ్లారు. అయితే మంత్రి ఆదికి సంబంధించి ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు కాగానే.. ఎస్పీగా అభిషేక్‌ మహంతి ఉంటే ఎన్నికల సమయంలో కష్టమని, ఖచ్చితంగా బదిలీ చేయాల్సిందేనని సీఎం వద్ద మంత్రి ఆది మొరపెట్టుకున్నట్లు తెలియవచ్చింది. కానీ రాజకీయాలకు అనుకూలంగా పనిచేయలేదన్న కారణాలతో బదిలీలకు అధికార పార్టీ నేతలు తెరతీయడం ద్వారా పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్యగా పలువురు భావిస్తున్నారు.

రాజకీయ బదిలీ
జిల్లా ఎస్పీగా  అభిషేక్‌ మహంతి 2018 అక్టోబరు 26వ తేదీన బదిలీ ఉత్తర్వులు వెలువడగా....తిరుపతి అర్బన్‌ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన నవంబరు 2వ తేదీన కడప ఎస్పీగా బా«ధ్యతలు చేపట్టారు.  నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్న తరుణంలో అర్థాంతరంగా గురువారం బదిలీ ఉత్తర్వులు అందాయి. గ్రేహౌండ్స్‌ విభాగానికి సంబంధించి గ్రూప్‌ కమాండర్‌గా బదిలీ చేశారు. ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో తర్వాత ప్రభుత్వ ఆధీనంలో బదిలీల ప్రక్రియ ఉండదు కాబట్టి ముందస్తుగా టీడీపీ నేతలు బదిలీ చేయించినట్లు తెలుస్తోంది. 2011 బ్యా చ్‌కు చెందిన అభిషేక్‌ మహంతి పనిచేసిన అన్ని చోట్ల తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మూడున్నర నెలలకే
జిల్లాలో అంతకుముందు ఎస్పీలు పీహెచ్‌డీ రామకృష్ణ, బాబూజీ అట్టాడలు దాదాపు ఒకట్నిర సంవత్సరం నుంచి  రెండేళ్లపాటు పనిచేశారు.ఇటీవలే  కడపకు వచ్చిన అభిషేక్‌ మహంతిని ఊహించని రీతిలో మంత్రితోపాటు టీడీపీ నేతలు పట్టుబట్టి బదిలీకి ప్రయత్నించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిజాయితీగా..నిక్కచ్చిగా ప్రజలకు న్యాయం అందించే అధికారులను బదిలీ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కేవలం మూడున్నర నెలల వ్యవధిలోనే ఎస్పీని రాజకీయ బదిలీ చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపకపోవడంతోనే
జిల్లాలో ఎస్పీగా అభిషేక్‌ మహంతి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్న సిద్ధాంతంతో ముందుకు వెళుతున్నారు. ఈ ప్రకారమే ప్రొద్దుటూరు పట్టణంలోని పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఇద్దరు టీడీపీ నేతలు గొడవలకు దిగిన సందర్భంలోనూ ఎస్పీపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ నిక్కచ్చిగా వ్యవహారిస్తూ చట్టం దృష్టిలో  అందరూ సమానులేనని ఎంపీ సీఎం రమేష్‌ వర్గానికి చెందిన వారితోపాటు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గానికి చెందిన వారిపై కేసులు నమోదు చేశారు.

అంతేకాకుండా మంత్రికి పట్టున్న గొరిగెనూరు వ్యవహారంలో ఎస్పీ నిక్కచ్చిగా వ్యవహరించారు. కిందిస్థాయి సిబ్బంది తప్పుదారి పట్టించినప్పటికీ ఎస్పీ తనకున్న సమాచారం మేరకు ముందుకు వెళ్లారు.ఈ వ్యవహారం నాటి నుంచి కూడా మంత్రి అసహనంగా ఉంటూనే లోలోపల ఎస్పీ బదిలీకి ప్రయత్నాలు సాగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు ఎస్పీగా అభిషేక్‌ మహంతి కొనసాగి నిజాయితీగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే ప్రజాస్వామంలో విఫలమౌతామనే భావన టీడీపీ నేతలకు బలంగా ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే అర్ధాంతర బదిలీకి ఆస్కారం ఏర్పడినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

నూతన ఎస్పీగా రాహుల్‌దేవ్‌ శర్మ
జిల్లా నూతన ఎస్పీగా రాహుల్‌దేవ్‌శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో టెక్నికల్‌ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న ఈయనను కడపకు బదిలీ చేశారు. 2015 జూన్‌ 11న కడపలో ఓఎస్‌డీగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌దేవ్‌శర్మ 2016 జనవరి 10వ తేది వరకు విధులు నిర్వర్తించారు. అనంతరం ఎస్పీగా పదోన్నతి రావడంతో విశాఖకు వెళ్లిపోయారు. ఏది ఏమైనా రెండు, మూడు రోజుల్లో కొత్త ఎస్పీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top