‘దేశం’దండోపాయం! | TDP leaders are demanding to police department | Sakshi
Sakshi News home page

‘దేశం’దండోపాయం!

Sep 3 2014 1:16 AM | Updated on Aug 24 2018 2:36 PM

‘‘మనం మనం ఒకటి.. మీకెంత కావాలో చెప్పండి...అవసరమైతే ఇప్పటి వరకు ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇప్పిస్తాం.. వారి వ్యాపారాల జోలికి వెళ్లొద్దు..

సాక్షి, గుంటూరు: ‘‘మనం మనం ఒకటి.. మీకెంత కావాలో చెప్పండి...అవసరమైతే ఇప్పటి వరకు ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇప్పిస్తాం.. వారి వ్యాపారాల జోలికి వెళ్లొద్దు.. మీకేం భయం లేదు.. మీ ఎస్పీల సంగతి మా మంత్రులు చూసుకుంటారు.. మాకు అడ్డువచ్చి అనవసరంగా  ఇబ్బందులు పడొద్దు.. మొండిగా ప్రవర్తిస్తే శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం జాగ్రత్త..’’  ఇసుక, రేషన్ బియ్యం మాఫియా తరఫున వకాల్తా పుచ్చుకున్న టీడీపీ నాయకులు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పోలీస్ అధికారులను బెదిరిస్తున్న తీరిది... నయానో భయానో నచ్చచెప్పి... తమ దారికి తెచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇవి...
 
 రూరల్ జిల్లా ఎస్పీగా పీహెచ్‌డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్‌గా దృష్టి సారించారు.అప్పటి వరకు నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన కొందరు పోలీసు అధికారులకు కొత్త ఎస్పీ చర్యలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది.
 
 జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను నియ మించడంతోపాటు, అక్రమ రవాణా జరిగిన ప్రాంతంలో ఆ పోలీస్‌స్టేషన్ అధికారిని బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
 
 ఇప్పటికే కొల్లిపర ఎస్‌ఐని వీఆర్‌కు పంపగా, ఇసుక మాఫియా నుంచి డబ్బు తీసుకున్నారనే కారణంతో సత్తెనపల్లి రూరల్ ఎస్‌ఐని సస్పెండ్ చేశారు.    మరో వైపు అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ కూడా అక్రమార్కులపైనా, అసాంఘిక శక్తులపైనా దృష్టి సారించారు. నగరంలో వ్యభిచారగృహాలు, క్రికెట్‌బెట్టింగ్ కేంద్రాలు, సింగిల్ నంబర్ లాటరీ నడిపినా, కనిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తరహా వ్యక్తులపైనా ప్రత్యేక నిఘా ఉంచారు.
 
 దీంతో అక్రమార్కులకు సహకరిస్తే వేటు తప్పదని పోలీస్ అధికారులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే యథావిధిగా నెలవారీ మామూళ్లతో స్టేషన్‌లకు వస్తున్న అక్రమ వ్యాపారులను వెనక్కు పంపుతున్నారు.జిల్లాలో ఇద్దరు ఎస్పీలు సీరియస్‌గా ఉన్నారని మేం చేసేది ఏమీలేదని కొందరు తేల్చి చెబుతున్నట్టు సమాచారం. మరికొందరు మాత్రం ఈ నెల చూసి ఆ తరువాత మామూళ్లు తీసుకుంటామంటూ రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
 
 ఇదిలావుండగా సాగర్, పొందుగల వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను బలోపేతం చేసే దిశగా అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలు చర్యలు చేపట్టగలిగితే బియ్యం, ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
 అక్రమ వ్యాపారులకు అండగా టీడీపీ నేతలు..
 పోలీస్ అధికారులు నెల వారీ మామూళ్లు తీసుకోకపోవడతో, తమ వ్యాపారాలకు అడ్డు వస్తారని భయపడుతున్న అక్రమార్కులు అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది.
 రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాకు సహకరించాలనీ, పోలీస్ అధికారులకు నచ్చచెప్పాలని కోరుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు కొందరు పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తమ వారికి సహకరించాలని నచ్చ చెబుతున్నట్టు తెలిసి ంది. మాట వినని అధికారులను బెదిరిస్తున్నారని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement