
గుంటూరులో టీడీపీ గ‘లీజు’ వ్యవహారం
పార్టీ కార్యాలయం పేరిట చాకలి చెరువు భూమి కబ్జా
అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్మాణాలు
లీజు పేరిట 99 ఏళ్లకు కట్టబెడుతూ జీవో
సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా కేబినెట్ ఆమోదం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరం నడిబోడ్డున ఉన్న చెరువు భూమిని 99 ఏళ్లకు టీడీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం కట్టబెట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను కూడా బేఖాతరు చేసింది. చెరువు స్థలాలను లీజుకు ఇవ్వకూడదు. అందులో కట్టడాలు అసలే నిర్మించకూడదు. అయినా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలోనే చెరువు స్థలాన్ని ఆక్రమించుకుని టీడీపీ కార్యాలయం నిర్మించేశారు.
చెరువు స్థలాన్ని లీజుకు ఇచ్చే అధికారం లేదని తెలిసి మున్సిపల్ అధికారులు ఆ విషయాన్ని కౌన్సిల్ ముందు ఉంచలేదు. ఈ అంశాన్ని రహస్యంగా ఉంచి చివరి నిమిషంలో టేబుల్ అజెండాగా తీసుకువచ్చి కౌన్సిల్‌లో ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదింపచేసుకున్నారు. ఈ తీర్మానంలో కనీసం నగరపాలక సంస్థ అధికారుల నుంచి ఎటువంటి ప్రతిపాదనలు, వివరణలు లేకుండానే తీర్మానం చేసేయడం గమనార్హం. ఆ తరువాత జీవో కూడా అడ్డగోలుగా ఇచ్చేశారు. ఈ అడ్డగోలు వ్యవహారం వివరాల్లోకి వెళితే..
నగరం నడిబొడ్డున 2,954 గజాలు
గుంటూరు అరండల్‌పేట పిచ్చుకులగుంటలోని చాకలి చెరువుకు చెందిన టీఎస్ నంబర్–826లో వెయ్యి చదరపు అడుగుల స్థలాన్ని ఏటా రూ.25 వేలు అద్దె చెల్లించేలా 1999లో తెలుగుదేశం పారీ్టకి లీజుకు ఇచ్చారని, ప్రతి మూడేళ్లకు అద్దె పెంచేలా లీజు నిర్ణయించారని మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదనలో పేర్కొన్నారు. అయితే, లీజు కింద పేర్కొన్న 1,000 చదరపు గజాలతోపాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా టీడీపీ ఆక్రమించి మూడు అంతస్తుల భవనం నిర్మించింది. 2008 నుంచి ఒక్క రూపాయి కూడా నగరపాలక సంస్థకు అద్దె చెల్లించలేదు.
పైగా అప్పటి నుంచి లీజు పునరుద్ధరించలేదు. అందులో నిర్మించిన పార్టీ కార్యాలయానికి కూడా ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఇప్పటివరకూ పన్నులు కూడా విధించలేదు. 2015లో అప్పటి టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెయ్యి గజాలకు అదనంగా 1,637 గజాలను కూడా కలిపి 2,637 గజాల స్థలాన్ని 99 సంవత్సరాలకు లీజుకు ఇవ్వాలని కోరారు. నగరపాలక సంస్థ అధికారులు ఆ భూమిని సర్వే చేయించి మొత్తం 2,954 గజాలు ఉందని తేల్చారు.
అప్పట్లో దీనిపై నిర్ణయం తీసుకోలేదు. 2017లోనే లీజు గడువు ముగిసిపోయింది. అప్పటి నుంచి పైసా కూడా అద్దె చెల్లించకుండా అక్రమంగా ఆ స్థలాన్ని కార్యాలయం పేరిట టీడీపీ నేతలు అనుభవిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత ఈ ఏడాది మార్చి 15న టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఈ స్థలాన్ని శాశ్వత పద్ధతిలో లీజుకు ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనను టేబుల్ అజెండా కింద కౌన్సిల్‌లో కనీసం సభ్యులు చర్చించకుండానే ఆమోదం తెలిపారు.
99 ఏళ్లకు కట్టబెట్టిన కేబినెట్
జీవో–340 ప్రకారం మున్సిపల్ స్థలాన్ని లీజుకు ఇచ్చే విషయంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీన్ని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. దీని ఆధారంగా ప్రభుత్వం 2017 నుంచి 33 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేవిధంగా.. ఆ తర్వాత దాన్ని 99 సంవత్సరాల వరకూ పొడిగించే విధంగా.. ఎకరానికి కేవలం వెయ్యి రూపాయలు అద్దె చెల్లించేలా ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ జీవో జారీ చేశారు.
నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం ఆ స్థలం మార్కెట్ విలువలో 10 శాతం లీజుగా నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్ విలువ గజం రూ.55 వేలుగా ఉంది. దీని ప్రకారం ఇప్పుడు లీజుకు తీసుకుంటున్న 2,954 గజాలకు ఏడాదికి కోటిన్నరకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
ఈ లెక్క ప్రకారం ఇప్పటివరకూ రూ.9 కోట్ల వరకు లీజు చెల్లించాలి. ఇవేమీ లేకుండానే ఆ భూమి మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పనంగా కట్టబెట్టేశారు. జీవో–340ని అడ్డం పెట్టుకుని కేవలం ఎకరానికి రూ.వెయ్యి చొప్పున అద్దె చెల్లించేలా ఆదేశాలు జారీ చేయడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.