టీటీడీలో టీడీపీ దందా

TDP Govt Dadda in TTD - Sakshi

హాకర్ల లైసెన్స్‌ల కోసం పైరవీలు

350 నుంచి వెయ్యికి చేరనున్న లైసెన్సులు

ఒక్కో లైసెన్స్‌కి రూ.5 లక్షలు

దందాలో బడా బాబుల హస్తం

ఒత్తిళ్లకు తలొగ్గుతున్న టీటీడీ

అధికార పార్టీ నేతలు కొందరు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చుకుంటున్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను అమ్ముకోవడం.. వ్యాపార దుకాణాలను తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టి వారి ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకోవడం ఇక్కడ సర్వసాధారణమైపోతోంది. ఇందులో బడాబాబుల హస్తం ఉండడంతో టీటీడీ అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సాక్షి, తిరుపతి: తిరుమలలో టీడీపీ నేతల దందా కొనసాగుతోంది. హాకర్స్‌ లైసెన్స్‌ల కోసం కొంద రు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. అమరావతి నుంచి చక్రం తిప్పుతూ తమకు అనుకూలమైన వారికి లైసెన్సులు ఇప్పించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అధికార పార్టీ నేతల దందాను చూసి సామాన్య వ్యాపారులు ముక్కున వేలేసుకుంటున్నారు. వారు అడిగినంత ఇచ్చుకునే స్థోమత లేక.. కుటుంబ జీవనం కష్టమవుతుందేమోనని కుమిలి పోతున్నారు. 

అడ్డులేదని..అడ్డదారులు
తిరుమలకు వచ్చిన భక్తులు సెంటిమెంట్‌గా దేవుని పటాలు.. దారాలు తీసుకుని వెళ్తుంటారు. వీటిని చేతిలో పెట్టుకుని తిరుమలలో రోడ్లపై తిరుగుతూ విక్రయించే వ్యాపారులు అనేక మంది ఉన్నారు. వీరిలో స్థానికులే ఎక్కువ. ఇటువంటి వారికి టీటీడీ గతంలో అధికారికంగా హాకర్స్‌ లైసెన్సులు ఇచ్చింది. అవి 350 వరకు ఉండేవి. ప్రస్తుతం 900కి చేరాయి. తిరుమలలో అనధికారికంగా అన్నప్రసాద వితరణ కేంద్రం, నడక దారి లో లైసెన్సులు లేకుండా విక్రయాలు జరుగుతుం డేవి. వ్యాపారుల మధ్య తలెత్తే విభేదాలు తార స్థాయికి చేరుకునేవి. పుణ్యక్షేత్రంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. 

ఇటీవలే బదిలీపై వెళ్లిన సీవీఎస్‌ఓ రవికృష్ణ అనధికార హాకర్ల భరతం పట్టారు. నడకదారి నుంచి తిరుమల వరకు అనధికారిక హాకర్లను తొలగించారు. ఈ విషయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అప్పటి సీవీఎస్‌ఓపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో ఆయన బదిలీకి ఇది కూడా ఓ కారణమైందని తిరుమలలో ప్రచారం జరుగుతోంది. 

పైసా వసూల్‌
టీటీడీని టీడీపీ నేతలు తమ ఆదాయ వనరుగా మార్చుకునేశారు. టీటీడీ ఈఓగా బాలసుబ్రమణ్యం ఉన్న సమయంలో తిరుమలలో 350 మందికి మాత్రమే హాకర్స్‌ లైసెన్సులు ఉండేవి. తర్వాత 730కి చేరాయి. తాజాగా మరో 170 లైసెన్సులు కొత్తవి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఒక్కో లైసెన్సుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా జిల్లాకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాల్లోని తమ అనుచరులు, వారి బంధువులను పిలిచి హాకర్స్‌ లైసెన్సులు కట్టబెడుతున్నట్లు తెలిసింది. మొదటి నుంచి తిరుమలలో ఉంటున్న వారికి కొందరికి మాత్రం లైసెన్సులు ఇచ్చి మిగిలిన అనుమతులను బినామీ పేర్లతో అమ్ముకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఇలా అనధికారిక వ్యక్తుల సంఖ్య  పెరిగిపోతోందని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి హాకర్‌ లైసెన్సు దక్కితే సొంతంగా వ్యాపారం చేయలేకపోయినా... ఎవరికో ఒకరికి కట్టబెడితే ఆ లైసెన్సుకు నెలకు రూ.20వేలు అద్దె ఇస్తున్నట్లు తెలిసింది. తిరుమలలో హాకర్‌ లైసెన్సు ఉంటే టీటీడీలో ఉద్యోగం కన్నా పెద్దదే అని అక్కడ వ్యాపారులు చెబుతున్నారు. ఇటువంటి లైసెన్సుల కోసం ఎన్ని లక్షలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్న వారు అనేక మంది ఉన్నట్లు సమాచారం. హాకర్స్‌ లైసెన్సులు ఇవ్వడానికి టీటీడీ అధికారులు నిరాకరించినా... అధికారపార్టీ పెద్దల నుంచి ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలిసింది. తప్పని పరిస్థితిలో టీటీడీ అధికారులు కూడా లైసెన్సులు ఇవ్వటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top