మహిళలను మోసగించిన టీడీపీ సర్కార్‌

tdp govt Cheating on Womens - Sakshi

ఏలూరు టౌన్‌: రాష్ట్రంలోని మహిళలందరినీ టీడీపీ ప్రభుత్వం ఘోరంగా మోసగించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ళ నాని ఆరోపించారు. ఎన్నికల ముందు దొంగ హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన అనంతరం డ్వాక్రా మహిళల రుణమాఫీ గురించి మర్చిపోయారని విమర్శించారు. ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జగన్‌ పాదయాత్రపై ముందుస్తు ప్రణాళిక చేసుకునేందుకు పార్టీ మహిళా నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

 ఈ సమావేశానికి పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, ఏలూరు కన్వీనర్‌ మధ్యాహ్నపు ఈశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బి.వినీత, మేకా పార్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ళ నాని మాట్లాడుతూ రాష్ట్రం లోని ప్రజలంతా వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉండడంతో టీడీపీ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయన్నారు. వారి అవినీతి, అక్రమాలు, అరాచక పాలనతో ప్రజలంతా విసుగెత్తిపోయారని ఆరోపించారు. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు పాదయాత్ర చీకటిలో చేస్తే, వైఎస్‌ జగన్‌ ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. పాదయాత్ర అంటే దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానిదేనని..

 ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉండేది మహానేత కుటుంబమేనన్నారు. జగన్‌ పాదయాత్ర విజయవంతానికి జిల్లాలోని ప్రతీ మహిళా నాయకురాలూ కృషి చేయాలని కోరారు. మహిళా సమన్వయకర్త శ్రీలక్ష్మి మాట్లాడుతూ పార్టీలో కష్టపడే ప్రతీ నాయకునికీ ప్రాధాన్యత ఉంటుందనీ, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌ సోదరి షర్మిల పార్టీ కోసం శ్రమించారని తెలిపారు. జిల్లాలోని మహిళా నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాదయాత్రను విజ యవంతం చేసేందుకు పనిచేయాలని కోరారు.

 ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూసి వినీత జన్మదినోత్సవ కేక్‌ను ఆళ్ళ నాని కట్‌ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా సమన్వయకర్త శ్రీలక్ష్మిని నాని అభినందించారు. ఈ మహిళా సమావేశంలో పార్టీ నాయకులు జానకీరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంజిమాల దేవి, కటిక శ్రీదేవి, పార్టీ నాయకులు గంగాభవాని, మున్నీ, ఏలూరు పార్లమెంటరీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఎన్‌.సుధీర్‌బాబు, యువజన విభాగం అధ్యక్షులు నవహర్ష, విద్యార్థి విభాగం అధ్యక్షులు దినేష్‌రెడ్డి ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top